ఏదీ అలనాటి స్వేచ్ఛా చింతన?

ABN , First Publish Date - 2021-03-27T06:11:35+05:30 IST

రామ్‌మోహన్ రాయ్ నుంచి అంబేడ్కర్ దాకా ఎంతోమంది సాంఘికసంస్కర్తలు తమ దేశస్థులను కాలం చెల్లిన సంప్రదాయాల భారం నుంచి విముక్తం చేసేందుకు నిరంతర కృషి చేశారు. ఆ సంస్కర్తల కృషి భారత రాజ్యాంగ రూపకల్పనతో ఒక సమున్నత....

ఏదీ అలనాటి స్వేచ్ఛా చింతన?

రామ్‌మోహన్ రాయ్ నుంచి అంబేడ్కర్ దాకా ఎంతోమంది సాంఘికసంస్కర్తలు తమ దేశస్థులను కాలం చెల్లిన సంప్రదాయాల భారం నుంచి విముక్తం చేసేందుకు నిరంతర కృషి చేశారు. ఆ సంస్కర్తల కృషి భారత రాజ్యాంగ రూపకల్పనతో ఒక సమున్నత స్థితికి చేరింది. వీరివలే కాకుండా ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు ఇతర సంస్కృతులు, దేశాల నుంచి హిందువులు నేర్చుకునేది ఏమీ లేదని భావిస్తారు. ‘విశ్వగురువు’ హిందువులే అన్న ఆత్మస్తుతి గోల్వాల్కర్ మొదలు సంఘ్ సైద్ధాంతికుల రచనలన్నిటా పరివ్యాప్తమై ఉన్నది.


‘నేను ఏమిటి? ఆసియా సంస్కృతికి చెందిన వాడినా? యూరోపియన్ నాగరికత అనుయాయినా? లేక అమెరికా జాతీయుడినా? విభిన్న వ్యక్తిత్వాల ఆసక్తికరమైన సమ్మేళనం ఒకటి నాలో విలసిల్లుతున్నట్టు అనుభూతి చెందుతున్నాను’

– -స్వామి వివేకానంద


సంస్కర్త జ్యోతిరావు ఫూలే 1873లో కులవ్యవస్థపై ఒక తీవ్ర విమర్శను వెలువరించారు. ‘గులాంగిరి’ అనే ఆ సుప్రసిద్ధ విమర్శాగ్రంథాన్ని ఆయన మరాఠీ భాషలో రచించారు. అయితే అంకితంను ఆంగ్లంలో రాశారు. బానిసత్వాన్ని నిర్మూలించే లక్ష్యానికి ‘ఉదాత్త, నిస్వార్థ, ఆత్మత్యాగంతో నిబద్ధమైన అమెరికా సుజనుల’ పట్ల గౌరవాదరాలను ఫూలే ఆ అంకితంలో వ్యక్తం చేశారు. అమెరికాలో జాతి సమానత్వ సాధనకు సంస్కర్తలు చూపిన నిష్ఠ, ‘బ్రాహ్మిణ్ బానిసత్వ బంధనాల నుంచి శూద్రసోదరులను విముక్తపరిచేందుకు కృషి చేస్తున్న భారతీయులకు’ ఒక ఉత్కృష్ట ఉదాహరణగా స్ఫూర్తి నివ్వగలదనే ఆశాభావాన్ని ఫూలే వ్యక్తం చేశారు. 


విదేశీ విధ్వంసక భావజాలానికి వ్యతిరేకంగా భారతీయులను హెచ్చరిస్తూ పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగం గురించిన వార్తలను చదివినప్పుడు నాకు జ్యోతిరావు ఫూలే ‘అంకితం’ మాటలు గుర్తుకొచ్చాయి. అన్నీ ఒక్కడై పోరాడిన సంస్కర్త విశాల విశ్వజనీన భావాలు ఒక వైపు, భారత్‌లో అత్యంత శక్తిమంతుడైన వ్యక్తిలో విదేశీయుల పట్ల ఒక మానసిక రుగ్మతగా పెచ్చరిల్లిన విముఖత మరోవైపు- ఈ వాస్తవాలు విశదం చేస్తున్నదేమిటి? స్వతంత్ర జాతిగా, సమస్త రంగాలలోనూ గర్వకారణమైన విజయాలతో సాగు తున్న వర్తమానంలో కంటే పరాయిపాలనలో మగ్గిపోతున్నప్పుడు మాత్రమే హిందూ చింతన స్వేచ్ఛగా, మానవ విశ్వమంత విశాల దృక్పథంతో వర్ధిల్లిందని స్పష్టమవుతోంది. 


19వ శతాబ్దంలోనూ, ఇరవయ్యో శతాబ్దం పూర్వార్ధంలోనూ హిందూసమాజ నాయకులకు తమ మహోన్నత మత సమూహపు బలహీనతలు, దౌర్బల్యాలు ఏమిటో బాగా తెలుసు. హిందువులను బాధిస్తున్న అశక్తతలు గణనీయంగా తమకు తాము విధించుకున్నవనే సత్యం కూడా వారికి బాగా తెలుసు. మన వైఫల్యాలకు కారకులు విదేశీ వలసపాలకులే అని నిందించడం సహేతుకం కాదు. ఏమైనా ఈ దౌర్బల్యాల నుంచి బయటపడి, సంక్లిష్ట, పరస్పరాధారిత, సదా మారుతున్న ప్రపంచం విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు హిందువులు అంతర్గత, బాహ్య విమర్శకుల వివేచనాయుత వాణిని విధిగా వినవలసి ఉందని ఆనాటి పునరుజ్జీవోద్యమకారులు నిండుగా విశ్వసించారు. 


ఆధునిక హిందూ సాంఘిక సంస్కరణల సంప్రదాయం రామ్‌మోహన్ రాయ్‌తో ప్రారంభమయింది. వర్తమాన హిందూత్వవాదులు విశ్వసిస్తున్నట్లుగా హిందువులు స్వచ్ఛమైన, పరిపూర్ణమైన మానవులని, దోష రహితులని రామ్‌మోహన్ రాయ్, ఆయన సమకాలికులు భావించలేదు. మూడు అంశాల ఆధారంగా హిందువులను ఆయన తీవ్రం గా తప్పుపట్టారు. అవి: మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుతెన్నులు; ఆధునిక విజ్ఞానంలో కొరవడిన ఆసక్తి; వివేచనాశక్తిని కాకుండా మతగ్రంథాలు వెల్లడించిన విషయాలను విశ్వసించడం. హిందువుల వైయక్తిక, సామాజిక జీవితాలలోని ఈ లొసుగులను పూర్తిగా రూపు మాపేందుకు రాయ్ తన జీవితాన్ని అంకితం చేసి మహత్తర ఫలితాలను సాధించారు. రామ్‌మోహన్ రాయ్ పాశ్చాత్య దేశాలలో విస్తృతంగా పర్యటించారు. యూరోపియన్ చింతకులు, ఉద్యమకారులు, రాజనీతిజ్ఞులతో సమాలోచనలు జరిపారు. ‘రాయ్ తన ప్రాచ్య సంస్కృతీ వారసత్వాన్ని ఏ మాత్రం త్యజించకుండా విశాలహృదయం, నిశితమేధతో పాశ్చాత్య జ్ఞానాన్ని అంగీకరించారని’ రవీంద్రనాథ్ టాగోర్ అన్నారు. 


రామ్‌మోహన్ రాయ్ వలే రవీంద్రుడు కూడా బెంగాలీ అయినప్పటికీ విశాల భారతదేశంలోని ఇతర భాషా సాహిత్యాలు, సంస్కృతుల పట్ల ఆసక్తి చూపారు. అలాగే తన భారతీయ వారసత్వానికి అమితంగా గర్వించినప్పటికీ విశాల ప్రపంచంలోని వివిధ దేశాల సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకోవడానికి సదా శ్రద్ధాళువు అయ్యేవారు. ఆయన వాస్తవంగా విశ్వ భారతీయుడు. ఆయన శ్రద్ధా సక్తులు కేవలం ఐరోపా, ఉత్తర అమెరికాకు మాత్రమే పరిమితం కావు. జిజ్ఞాస ఆయన్ని జపాన్, చైనా, జావా, ఇరాన్‌తో పాటు లాటిన్ అమెరికాకు కూడా తీసుకుపోయింది. ఈ విస్తృత పర్యటనలు, విశ్వ స్నేహ సంబంధాల పర్యవసానంగానే ఆయన గ్రామీణ బెంగాల్‌లో విశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి విశ్వభారతి అని నామకరణం చేశారు. 


1920–-21లో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. వలసపాలన నుంచి భారత్ విముక్తం కావాలని కోరుకోవడంలో రవీంద్రుడు ఎవరికీ ద్వితీయుడు కారు. అయితే సహాయ నిరాకరణోద్యమంలో విదేశీ వస్తువుల పట్ల ప్రజలలో పెచ్చరిల్లి పోతున్న విముఖత ఆయన్ని కలవరపరిచింది. ‘భారతీయులుగా మనం పాశ్చాత్య నాగరికత నుంచి నేర్చుకోవలసింది చాలాఉంది. అలాగే ప్రపంచ సమున్నతికి మనం కూడా చేయవలసింది ఉంది. కనుక పాశ్చాత్యప్రపంచానికి మనం దూరం కాకూడద’ని ఆయన మహ్మాత్ముడికి చెప్పారు. 


రామ్‌మోహన్ రాయ్, రవీంద్రనాథ్ టాగోర్ ఇరువురూ దార్శనికులు. తమ సొంత సంస్కృతిని, సమాజాన్ని సమున్నతం చేసుకోవాలంటే ఇతర సంస్కృతులు, సమాజాల నుంచి నేర్చుకోవలసి ఉంటుందన్న సత్యాన్ని గుర్తించిన ఉదాత్తులు. వారి సమకాలిక సంస్కర్తలు కూడా ఈ సత్యాన్ని గౌరవించారు. అమెరికాలో బానిసత్వం రద్దు, కులవివక్షలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాడిన జ్యోతిరావు ఫూలేకు అదే ఒక సమున్నత స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచింది. ఫూలే భారత్ వెలుపల ఎప్పుడూ ఎక్కడా పర్యటించలేదు. అయితే ఆయన మహోన్నత వారసుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ప్రపంచంలో విస్తృతంగా పర్యటించారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం ఆయనపై చెరిగిపోని ముద్ర వేసింది. ఫూలే వలే ఆయన కూడా అమెరికాలో నల్లజాతీయుల విషయంలోను, భారత్‌లో దళితుల విషయం లోను వ్యక్తమవుతున్న అమానుష వివక్షల్లో సమానాంతరాలు ఉన్నాయని గుర్తించారు. 


రామ్‌మోహన్ రాయ్ నుంచి అంబేడ్కర్ దాకా, ఆ ఇరువురి మధ్యకాలంలో ఫూలే, గోఖలే, రవీంద్రుడు, గాంధీ, పెరియార్, కమలాదేవి ఛటోపాధ్యాయ, ఇంకా ఎంతోమంది సాంఘికసంస్కర్తలు తమ దేశస్థులను కాలం చెల్లిన సంప్రదాయాల భారం నుంచి విముక్తం చేసేందుకు నిరంతర కృషి చేశారు. వారికి తెలిసిన, వారికి అనుభవంలోకి వచ్చిన హిందూసమాజం ఏకకాలంలో అసమ, నిరక్షరాస్య, అస్వతంత్ర సమాజం. మహిళలు, అణగారిన కులాల వారి పట్ల వివక్షలను రూపుమాపడం ద్వారా తమ సమాజాన్ని సమసమాజంగా రూపొందించేందుకు వారు కృషి చేశారు; పాఠశాలలు, కళాశాలల్లో ఆధునిక లౌకిక విద్యను ప్రోత్సహించి, జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా తమ సమాజాన్ని విద్యావంతుల సమాజంగా మార్చేందుకు వారు పాటుపడ్డారు; బహిరంగ చర్చలు, సమావేశాల సంస్కృతిని పెంపొందించడం ద్వారా స్వేచ్ఛాయుత సమాజాన్ని నిర్మించేందుకు వారు నిబద్ధమయ్యారు. అవును, ఇది ఎప్పటికీ స్ఫూర్తిదాయకమైన కృషి. 

సంప్రదాయ బంధనాల నుంచి హిందూచింతనను, హిందూసమాజాన్ని విముక్తం చేసేందుకు అనేక తరాల సంస్కర్తల కృషి భారత రాజ్యాంగ రూపకల్పన, ఆమోదంలో ఒక సమున్నత స్థితికి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న, ముఖ్యంగా ఐరోపా, అమెరికాలోని రాజ్యాంగ భావాలు, ఆచరణలు, శాసనాల స్ఫూర్తిని భారత రాజ్యాంగం సంలీనం చేసుకుంది. ఇలా నిష్పాక్షిక వైఖరితో ఇతర రాజ్యాంగ సంప్రదాయాలను సంలీనం చేసుకోవడం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు ఆగ్రహం కలిగించింది. 1949 నవంబర్ తుదినాళ్ళలో రాజ్యాంగం చిత్తుప్రతిని అంబేడ్కర్ సమర్పించినప్పుడు ఆరెస్సెస్ పత్రిక ‘ఆర్గనైజర్’ ఇలా వ్యాఖ్యానించింది: ‘కొత్త భారత రాజ్యాంగంలో భారతీయం అనేది ఏదీ లేదు. ప్రాచీన భారతీయ రాజ్యాంగ చట్టాలు, సంస్థలు, పరిభాష ఆనవాళ్లు కొత్త రాజ్యాంగంలో లేనేలేవు’ అదే పత్రికలో ప్రచురితమైన మరో వ్యాసం అంబేడ్కర్‌ను ఆధునిక భారత దేశ మనువుగా అభివర్ణించడాన్ని తీవ్రంగా విమర్శించింది. ఈ కాలమ్‌లో నేను ప్రశంసించిన సంస్కర్తల వలే కాకుండా ఆరెస్సెస్ సిద్ధాంతకర్తలు ఇతర సంస్కృతులు, దేశాల నుంచి హిందువులు నేర్చుకునేది ఏమీ లేదని భావిస్తారు. ప్రపంచానికి బోధించడానికే హిందువులను భూమి మీదకి పంపారని వారు వాదించడం కద్దు. ‘విశ్వ గురువు’ హిందువులే అన్న ఆత్మస్తుతి ఎమ్‌ఎస్ గోల్వాల్కర్ మొదలు ఆరెస్సెస్ సైద్ధాంతికుల రచనలన్నిటా పరివ్యాప్తమై ఉన్నది. 


విజయానందం, మానసిక రుగ్మతల అసాధారణ మిశ్రమం ఆరెస్సెస్ ప్రపంచ దృక్పథం. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆధిపత్యం గురించి ప్రకటనలు చేస్తూ మరోవైపు ఇతర మతాలకు చెందిన భారతీయులు, ముఖ్యంగా ముస్లింలకు నానా కళంకాలు ఆపాదించడం కొనసాగుతోంది. భారతీయ సమాజ వైఫల్యాలలో చాలా వాటికి హిందువుల ఆలోచనలు, ఆచరణలే కారణమన్న వాస్తవాన్ని అంగీకరించేందుకు సంపూర్ణ విముఖత చూపుతున్నారు. మూడు, నాలుగు దశాబ్దాలుగా ఆరెస్సెస్ అధికార ప్రాభవం, ప్రభావం అమితంగా పెరిగాయి. అయితే హిందూమనస్సు స్వేచ్ఛాలోచన, ఆత్మవిమర్శ, ఆత్మపరిశీలనా సామర్థ్యం కుంచించుకు పోతోంది మన రాజకీయ, సంస్థాగత జీవితంలో బీజేపీ, ఆరెస్సెస్ ఆధిపత్యం గణనీయంగా పెరిగింది. హిందూ మనస్సు సంకుచితత్వంలోకి జారిపోవడం ప్రభుత్వ ఉన్నతస్థాయిలో స్పష్టంగా గోచరమవుతోంది. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు వైజ్ఞానిక వాస్తవాల కంటే మూఢ విశ్వాసాలకు ప్రాధాన్యమివ్వడం, స్త్రీల స్వతంత్రతను తిరస్కరించడం, తరచు పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా వాగాడంబరం ప్రదర్శించడం మొదలైన వాటిలో ఆ సంకుచితత్వం ప్రతిబింబిస్తోంది.


ఇక సంఘ్‌పరివార్ అధిక్రమంలోని అట్టడుగుస్థాయిలో ఈ పరిణామం, సమాజంలోని అన్యాయాలను ఎదిరిస్తూ సత్యాలను వెల్లడిస్తున్న పాత్రికేయులు, కళాకారులు, రచయితలు, సినిమాస్రష్టలపై దాడుల రూపేణా వ్యక్తమవుతోంది. విమాన ప్రయాణాలు లేని, ఇంటర్నెట్ కనుగొనబడని 19వ శతాబ్దిలో సహస్ర యోజనాల దూరంలో ఉన్న ఒక దేశంలోని సామాజిక విమోచన ప్రక్రియను అధ్యయనం చేసేందుకు జ్యోతిరావు ఫూలే మానసికంగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు. కాలం, దూరాన్ని అధిగమించి యావత్ప్రపంచమూ సన్నిహితంగా అల్లుకుపోయి ఉన్న ఈ 21వ శతాబ్దిలో భారత ప్రధానమంత్రి మనకు మనం సాంస్కృతిక అంతర్ముఖులం కావాలని కోరుతున్నారు! మనం ఆ విజ్ఞప్తిని లక్ష్యపెట్ట కూడదు.




రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-03-27T06:11:35+05:30 IST