ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలెక్కడ?

ABN , First Publish Date - 2022-06-10T09:08:13+05:30 IST

‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోంది.

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలెక్కడ?

మీ అసమర్థతో ఉన్న ఉద్యోగాలకు గండి!

నోట్ల రద్దు, లాక్‌డౌన్‌ నిర్ణయాలతో ఉద్యోగ అవకాశాలపై దెబ్బ

కేంద్ర పరిధిలోని 16 లక్షల కొలువులు భర్తీ చేయాలని డిమాండ్‌

యువతతో కలిసి ఉద్యోగాల భర్తీ జరిగే దాకా ఉద్యమిస్తాం..

ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్‌ ఘాటు లేఖ

బోయింగ్‌ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ భేటీ


హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోంది. మీ అసమర్థ నిర్ణయాలు, అర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారు. మీరు తీసుకున్న నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్‌ వంటి అనాలోచిత నిర్ణయాలతో దేశ ప్రజల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది’’ అని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ గురువారం ప్రధానికి ఘాటుగా లేఖ రాశారు. ఉద్యోగాలకు సంబంధించి తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వమన్నారు. కేటీఆర్‌ ఇంకా ఏమన్నారంటే.. 


పకోడి ఉద్యోగాలే మిగిలాయ్‌.. 

మీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఉన్న ఉద్యోగాలు పోయి కేవలం పకోడి ఉద్యోగాలే మిగిలాయన్నది వాస్తవం. భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విదేశీ పరిశ్రమలను దేశానికి రప్పించే విషయంలో మీకు స్పష్టమైన విధానం లేదనడంలో నాకెలాంటి సందేహం లేదు. వ్యవసాయ రంగం, దాని తర్వాత అత్యధికంగా ప్రజలు ఆధారపడిన టెక్స్‌టైల్‌ రంగాభివృద్ధిపై మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అసలే లేదు. అందుకే పొరుగున ఉన్న చిన్న దేశాలకన్నా తక్కువ మందికి ఈ రంగంలో ఉపాధి లభిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఈ రెండు రంగాలను మీరు కావాలని విస్మరించడంతోనే ఇప్పుడు దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయన్నది నిజం. మీ ఈ విధానాలతోనే గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్న భారత ప్రభుత్వ గణాంకాలే తిరుగులేని సాక్ష్యం. 


ఖాళీల భర్తీ ఎప్పుడు? 

 దేశానికి పెట్టుబడులను భారీగా రప్పించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమైన మీరు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిద్రపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఖాళీలతోపాటు పబ్లిక్‌ సెక్టార్‌లోని అనేక కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. ఉద్యోగాలను భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్న మీరు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను అందినకాడికి అమ్ముతూ లక్షలాది ఉద్యోగాలను రద్దు చేస్తున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఖాళీగా ఉన్న 16 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను మీ నాయకత్వంలోని సర్కార్‌ ఎప్పుడు భర్తీ చేస్తుందన్నది భేతాళ ప్రశ్నగా మిగిలిపోయింది. 


విద్వేష రాజకీయాలతో ప్రమాదం

సబ్‌కా సాథ్‌ సబ్‌కా వికాస్‌ అని మీరు ఓ వైపు గప్పాలు కొడుతుంటే... మీ పార్టీ నేతలు మాత్రం ‘సబ్‌ కో సత్తేనాశ్‌ కరో’ (అందరినీ సర్వనాశనం చేయండి) అన్నట్టే వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరితో దేశంలోనేకాకుండా విదేశాల్లోని భారతీయుల ఉపాధికి ప్రమాదం ఏర్పడుతోంది. పార్టీ విద్వేష రాజకీయాలతో పారిశ్రామికంగా వెనుకబడే ప్రమాదంలోకి మన దేశం వేగంగా వెళుతోంది. ఫలితంగా కోట్లాది మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. మీరు గతంలో తెలంగాణకు వచ్చి తియ్యగ, పుల్లగ మాట్లాడిన్రు. కానీ పైసా సాయం చెయ్యలేదు. కనీసం ఇప్పుడైనా తెలంగాణ గడ్డ నుంచి దేశ యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనపై మీ వైఖరి స్పష్టం చేయండి. దేశ యువత ఉద్యోగాలపై నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వండి. కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పండి. లేకుంటే తెలంగాణ యువతతో కలిసి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా ఉద్యోగాల భర్తీ జరిగే దాకా ఉద్యమిస్తాం.


ఈ ప్రశ్నలకు బదులివ్వండి? 


కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారు?

మీరు ఇస్తామన్న రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి చేపట్టిన చర్యలు ఏంటి?

మీరు ఇస్తామన్న యేటా రెండు కోట్ల ఉద్యోగాల్లో తెలంగాణ యువతకు దక్కే, దక్కిన ఉద్యోగాలెన్ని?

ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడంతో జరుగుతున్న ఉద్యోగాల నష్టంపై మీసమాధానం ఏమిటి?

ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌పరం చేస్తే ఆయా సంస్థల్లో రిజర్వేషన్‌ అమలు కాదు. ఫలితంగా కోట్లాది దళిత, గిరిజన, బీసీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు దక్కవు. దీనిపై ఆయావర్గాల యువతకు మీరేం సమాధానం చెబుతారు?

ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా చేయూతనిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇవ్వాలనుకుంటున్న ప్రాధాన్యం ఏమిటి?

ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ఇక్కడి యువత కు మీరు ఏం చెబుతారు?

హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయంగా మరో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని 8 ఏళ్లుగా తెలంగాణ యువత తరఫున మేం చేస్తున్న డిమాండ్‌పై మీ దగ్గర సమాధానం ఉందా? 

Updated Date - 2022-06-10T09:08:13+05:30 IST