పెద్ద కొప్పెర్ల ఎక్కడ?

ABN , First Publish Date - 2022-05-27T05:58:41+05:30 IST

పెద్ద కొప్పెర్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మర్చిపోయింది.

పెద్ద కొప్పెర్ల ఎక్కడ?
ఎత్తిపోతల పథకానికి సాగునీరు అందించే కుందూనది

 పదేళ్లుగా ప్రభుత్వం మర్చిపోయిన ఎత్తిపోతల పథకం

 రూ.4.50 కోట్లు నిధులు వృథా 


పెద్ద కొప్పెర్ల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. అది ఎక్కడుందో కూడా ఇప్పుడు తెలియకపోవచ్చు.   దీని కోసం ప్రభుత్వం గతంలో రూ. 4.50 కోట్లు ఖర్చు పెట్టింది.  ఇప్పటికి ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు. ఈ పథకాన్ని అర్ధాంతరంగా వదిలేశారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇంత చిన్న పథకాన్ని పూర్తి చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. 


కోవెలకుంట్ల, మే 26: కోవెలకుంట్ల మండలం పెద్దకొప్పెర్ల వద్ద ఎత్తిపోతల పథకానికి 2012 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. ఏడాదిపాటు పనులు నడిచాయి. రూ.4.50 కోట్లు ఖర్చు పెట్టారు. కుందూనదిని ఆనుకొని పెద్దకొప్పెర్ల ఎత్తిపోతల పథకం వల్ల పెద్దకొప్పెర్ల, కలుగొట్ల గ్రామాల్లోని 850 ఎకరాల మెట్ట పంటలకు సాగునీరు అందించడం లక్ష్యం.  మెట్ట రైతులు కరువు బారిన పడకుండా కుందూ నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు సాగు చేసుకోవడానికి వీలుగా ఈ పథకాన్ని ప్రారంభించారు. వర్షాభావం వల్ల ఈ గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పక్కనే కుందూనది ఉన్నా సాగు నీరు అందకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వం రెండు గ్రామాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో కుందూ నది ఒడ్డున ఈ ఎత్తిపోతల పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. 2013 నాటికే ఈ పథకం పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికి 9ఏళ్లు పూర్తయినా నేటికీ పథకం అసంపూర్తిగానే ఉండిపోయింది. ఇప్పటి వరకు ఖర్చు చేసిన రూ.4.50 కోట్లు వృఽథా అయినట్లే అని రైతులు అంటున్నారు. అసలు ప్రభుత్వానికి ఈ పథకం గుర్తుందా? అని విమర్శిస్తున్నారు. కుందూ నదిలో పారే నీటిని ఎత్తిపోసి రైతుల పొలాలకు ఇవ్వడానికి మరే ఇతర ఆటంకాలు లేవు. కేవలం నిర్లక్ష్యం తప్ప. దీని వల్ల పైపులైన్‌ పనులు అలాగే వదిలేశారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 20 శాతం పనులను వదిలేశారు. ఇంకా ఫేజ్‌-2 కింద పంపుహౌస్‌, పైపులైన్‌ పనులు చేయాలి. సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఇరిగేషన్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులు కాంట్రాక్టరుకు నోటీసులు పంపారు. గతంలో అనేకసార్లు నోటీసులు పంపినా లెక్క చేయకపోవడంతో కాంట్రాక్టును రద్దు చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రభుత్వం దీనికి కూడా స్పందిస్తుందో లేదోనని పలువురు అంటున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పెద్ద కొప్పెర్ల ఒక ఉదాహరణ. దీని వల్ల ఇప్పటికి రూ. 4.50 కోట్ల ప్రభుత్వ నిధులు మట్టి పాలయ్యాయి. 


 పథకం పూర్తి చేసి ఆదుకోండి


ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి. ఈ పథకం పూర్తయితే  పెద్దకొప్పెర్ల, కలుగొట్ల గ్రామాల్లో కరువు కాటకాలు ఉండవు. ఈ గ్రామాలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ పథకం పనులు పూర్తయితే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. 


 -రామసుబ్బారెడ్డి రైతు, పెద్దకొప్పెర్ల 


పనులు త్వరగా పూర్తి చేయాలి


20 శాతం పనులు ఆగిపోయాయి. వాటిని త్వరగా పూర్తి చేస్తే రైతులకు సాగునీరు అందుతుంది. కరువు పీడిత పల్లెల్లో పంటలు సాగవుతాయి. 

 

- తలారి బాల సుబ్బరాయుడు, రైతు, పెద్దకొప్పెర్ల  

Updated Date - 2022-05-27T05:58:41+05:30 IST