సమన్వయం ఎక్కడ?

ABN , First Publish Date - 2021-05-07T08:59:28+05:30 IST

కొవిడ్‌ నియంత్రణలో ఉన్నతాధికారులకు, క్షేత్రస్థాయి ఉద్యోగులకు మధ్య సమన్వయలోపం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వివిధ స్థాయుల్లో అధికారులను సమన్వయం చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర

సమన్వయం ఎక్కడ?

మార్గదర్శకాలు రూపొందించండి.. పడకల కొరత లేదని సర్కారు అంటోంది

150 మంది వెయిటింగ్‌ అని కలెక్టర్‌ జవాబు.. 22 మంది నోడల్‌ అధికారుల ఫోన్‌ సైలెన్స్‌

పడకలు లేవని మరో 34 మంది సమాధానం.. 15 నిమిషాలు చేసినా స్పందించని 104

మూడోవేవ్‌ పొంచి ఉంది.. చేతులు ముడుచుకుని కూర్చోరాదు.. పరిస్థితి చక్కదిద్దండి: హైకోర్టు


అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ నియంత్రణలో ఉన్నతాధికారులకు, క్షేత్రస్థాయి ఉద్యోగులకు మధ్య సమన్వయలోపం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. వివిధ స్థాయుల్లో అధికారులను సమన్వయం చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని ప్రభుత్వం చెబుతుంటే...విజయవాడ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి ఫోన్‌ చేస్తే పడకలు లేవని.. 150 మంది వేచి ఉన్నారని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఆస్పత్రుల్లో కొవిడ్‌ బాధితులకు సహకారం అందించేందుకు ఏర్పాటుచేసిన నోడల్‌ ఆఫీసర్లు సక్రమంగా స్పందించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. విజయవాడలోని 56 కొవిడ్‌ ఆస్పత్రులకు ఫోన్‌ చేస్తే... 22 ఆస్పత్రుల్లో నోడల్‌ ఆఫీసర్లు కనీసం ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. మిగిలిన 34మంది ఆస్పత్రుల్లో బెడ్లు లేవని చెప్పడం ఏంటని నిలదీసింది. ఇలాంటి అధికారులపై విచారణ జరిపి తదుపరి విచారణ నాటికి కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  కొన్ని ఆస్పత్రుల్లో నోడల్‌ ఆఫీసర్లుగా డాక్టర్లను నియమించడంపై  విస్మయం వ్యక్తం చేసింది. 104 కొవిడ్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే 15 నుంచి 20 నిమిషాలుపాటు స్పందించడం లేదంటూ అమిక్‌సక్యూరీ లేవనెత్తిన అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ప్రభుత్వం ఈ విషయం పై దృష్టి పెట్టి వ్యవస్థను చక్కదిద్దాలని పేర్కొంది. క్షేత్రస్థాయిలో ఉన్న పలు లోపాలను ఎత్తిచూపింది . కరోనా రోగులసంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో బెడ్లు, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ల సంఖ్య పెంచడం పై దృష్టి పెట్టాలని పేర్కొంది. ఆక్సిజన్‌ కొరత వల్ల అనంతపురంలో కరోనా బాధితులు మరణించారని పత్రికల్లో వార్తలు వచ్చినట్లు అమికస్‌ చెబుతున్నారని గుర్తు చేసింది. ఆ మరణాలు ఆక్సిజన్‌ కొరత వల్ల కాదని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి చెబుతున్నారని పేర్కొంది. 


ఈ నేపథ్యంలో అనంతపురం మరణాలపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రజలకు అందుబాటులో ఉండేలా కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆక్సిజన్‌ సరఫరా పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఙప్తిపై ఏమి చర్యలు తీసుకున్నది చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొవిడ్‌ పరీక్షా  ఫలితాలు వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కొవిడ్‌ పరీక్షాకేంద్రాలు పెంచడం పై దృష్టి పెట్టాలని సూచించింది. కరోనా మూడోవేవ్‌ పొంచి ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోకూడదని స్పష్టం చేసింది. కరోనా బారినపడిన గర్భిణీలకు ప్రసూతి ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుపై కోర్టుకు వివరాలు సమర్పించాలని కోరింది. వ్యాజ్యాలపై వేసవి సెలవుల ప్రత్యేక బెంచ్‌ విచారిస్తుందని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి. ప్రవీణ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలిచ్చింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజుల వసూలు చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్‌ తోట సురేశ్‌బాబు గత ఏడాది సెప్టెంబరులో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అలాగే కరోనా కట్టడికి ఈ ఏడాది మార్చి 23న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఏపీ పౌరహక్కుల అసోసియేషన్‌(ఏపీసీఎల్‌ఏ) జాయింట్‌ సెక్రెటరీ  బి.మోహనరావు  హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ఈ వ్యాజ్యాలు గురువారం మరోసారి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. 


ఆర్థిక బలముంటేనే బెడ్లు..

విచారణ ప్రారంభమైన వెంటనే అమికస్‌ క్యూరీ సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ స్పందిస్తూ....‘‘కరోనా కట్టడికి ప్రభుత్వం చెబుతున్న వివరాలకు...వాస్తవ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వం కొవిడ్‌ నియంత్రణకు పలు ఉత్తర్వులు జారీ చేస్తున్నా...క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదు. సహాయకుడైన న్యాయవాది అశ్వనీకుమార్‌ విజయవాడలోని కొవిడ్‌ ఆస్పత్రులో ఖాళీ బెడ్ల వివరాల కోసం నోడల్‌ ఆఫీసర్లకు ఫోన్‌ చేస్తే...కేవలం 34 మంది మాత్రమే సమాధానం ఇచ్చారు. ఆస్పత్రుల్లో బెడ్లు లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. మరో 22 మంది కనీసం ఫోన్లు కూడా ఎత్తలేదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో అధికఫీసులు వసూలు చేస్తున్నారు. బెడ్ల లభ్యత విషయంలో ప్రభుత్వ మెమోకు, అఫిడవిట్‌లో సమర్పించిన వివరాలకు మధ్య పూర్తిగా వ్యత్యాసం ఉంది. కొవిడ్‌ పరీక్ష ఫలితం లేదనే కారణంతో చాలా మంది బాధితులను ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదు. పరీక్ష ఫలితంతో సంబంధం లేకుండా పడకలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వండి. తేలకపాటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా బలమైనవారికి ఆస్పత్రులో బెడ్లు లభిస్తున్నాయి. కొవిడ్‌ లక్షణాలు తీవ్రంగా ఉన్నా...సాధారణ ప్రజలకు బెడ్లు దొరకడం లేదు. కొవిడ్‌ ఆస్పత్రుల్లో నోడల్‌ ఆఫీసర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు.


ఆక్సిజన్‌ నిల్వల పరిస్థితి ఏమిటి? 

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం, అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌ రెడి,్డ ప్రభుత్వ న్యాయవాది(జీపీ) సి.సుమన్‌ వాదనలు వినిపించారు. ఫోన్లు ఎత్తని నోడల్‌ అధికారుల వివరాలు అందిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సి.సుమన్‌ పేర్కొన్నారు. బెడ్ల సంఖ్య పెంచేందుకు కొత్తగా ప్రైవేటు ఆస్పత్రులను గుర్తిస్తున్నామని చెప్పారు. ధర్మాసనం కలగజేసుకుంటూ...ఆక్సిజన్‌ నిల్వల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ స్పందిస్తూ... ‘‘రాష్ట్రానికి ప్రస్తుతం 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా అవుతోంది. ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదు. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ కోసం కేపిటివ్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఇతర ఆస్పత్రుల్లో కూడా ప్లాంట్లు ఏర్పాటు చేయవచ్చుకదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది సుమన్‌ స్పందిస్తూ... ‘‘ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేపిటీవ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 42 క్యాపిటివ్‌ ఆక్సిజన్‌ ఫ్లాంట్లు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం. అలాగే నాలుగువేల ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు అందించాలని ఏప్రిల్‌ 28న కేంద్రానికి లేఖ రాశాం. వచ్చే వారం రోజుల్లో 800 టన్నుల ఆక్సిజన్‌ అవసరమని అధికారులు అంచనా వేశారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి 300 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేయాలని ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశాం’’ అని పేర్కొన్నారు. 


ప్రసారమాధ్యమాలను అడ్డుకోం

అనంతపురంలో ఆక్సిజన్‌ కొరత వల్ల మరణాలు సంభవించాయన్న వార్తలపై విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఆ మరణాలు ఆక్సిజన్‌ కొరత వల్ల సంభవించలేదని అడిషనల్‌ ఏజీ కోర్టుకు వివరించారు. ఇలాంటి వార్తలు ప్రచురించకుండా ప్రసారమాధ్యమాలను నిలువరించాలని కోరారు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం.. బయట జరుగుతున్న లోపాలు కోర్టు దృష్టికి రావాల్సిందేనని స్పష్టం చేసింది. టీకా ప్రక్రియ పై ధర్మాసనం ఆరా తీసింది. 18 ఏళ్లు పైబడి, 45ఏళ్ల లోపువారి ఎప్పుడు వ్యాక్సిన్‌ వేస్తారని ప్రశ్నించింది. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏజీ బదులిచ్చారు. ఆ తరువాతే 18 ఏళ్ల పైబడినవారికి టీకా వేస్తామని తెలిపారు. 


ట్రాకింగ్‌ విధానం లేకే ఇన్ని కేసులు..

పిటిషనర్ల తరఫు న్యాయవాదులు నర్రా శ్రీనివాసరావు, పి. సురేశ్‌కుమార్‌ స్పందిస్తూ... ‘కొవిడ్‌ బాధితులను గుర్తించేందుకు సమర్థ ట్రాకింగ్‌ విధానంలేదు. తేలికపాటి లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్‌ కేంద్రాలకు తరలించకపోవడం వల్ల కుటుంబసభ్యులు కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారు. దీనివల్ల ఆస్పత్రుల్లో బెడ్స్‌ అవసరం పెరుగుతోంది. బెడ్ల కోసం విజయవాడ కలెక్టర్‌ క్యాంపు కార్యాలయానికి ఫోన్‌ చేస్తే 100నుంచి 150మంది వెయిటింగ్‌లో ఉన్నట్లు సమాచారం ఇచ్చారు’’ అని తెలిపారు.

Updated Date - 2021-05-07T08:59:28+05:30 IST