మీ ముఖమెక్కడ పెట్టుకుంటారు?

ABN , First Publish Date - 2022-07-21T08:41:57+05:30 IST

మీ ముఖమెక్కడ పెట్టుకుంటారు?

మీ ముఖమెక్కడ పెట్టుకుంటారు?

అసమర్థ ప్రభుత్వమని కేంద్రం కడిగేసింది

పోరాడి సాధించుకున్న పోలవరాన్ని జగన్‌ సర్వనాశనం చేశారు

టీడీపీ నేత బొండా ఉమ ధ్వజం

యావజ్జాతికి జగన్‌ జవాబు చెప్పాలి

మాజీ మంత్రి దేవినేని ఫైర్‌


అమరావతి/జంగారెడ్డిగూడెం, జూలై 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు మొత్తం పరిస్థితిని తేటతెల్లం చేశాయని, జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు ముఖం ఎక్కడ పెట్టుకుంటుందని టీడీపీ ప్రశ్నించింది. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఈ ప్రాజెక్టును జగన్‌ సర్కారు సర్వనాశనం చేసిందని, నదుల అనుసంధానానికి వెన్నెముక వంటి ఈ ప్రాజెక్టును నాశనం చేసి మొత్తం రాష్ట్రానికే పెద్ద ద్రోహం చేసిందని విమర్శించింది. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బుధవారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘పోలవరం నిర్మాణంలో జగన్‌ ప్రభుత్వానికి ప్రణాళిక, ఆలోచన లేవని, ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో అంతా అగమ్యగోచరంగా ఉందని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. మేం గత కొంత కాలంగా ఏం చెబుతున్నామో కేంద్రం ఇప్పుడదే కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్టు నిర్మాణమూ జరగనంత వేగంగా చంద్రబాబు ప్రభుత్వం దీనిని పరుగులు తీయించింది. ఐదేళ్లలో 70 శాతం పనులు పూర్తి చేయించింది. జగన్‌రెడ్డి రావడం పోలవరానికి పెద్ద శాపంగా మారింది. మూడేళ్లలో కనీసం ఆరు శాతం పనులు కూడా చేయలేని అసమర్థతను కేంద్రం పార్లమెంటులో కడిగేసింది. బాగా పనిచేస్తున్న కాంట్రాక్టరును మార్చవద్దని కేంద్రం చెప్పినా వినకుండా మార్చి కొత్త కాంట్రాక్టరును తెచ్చి పెట్టారు. పనులు నడుస్తున్న సమయంలో వాటిని నిలిపివేయడంతో భారీగా వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్‌ దెబ్బతింది. ఇప్పుడేం చేయాలో తెలియక చేతులు పిసుక్కొంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. నిర్వాసితుల కోసం రూ.500 కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చూపిస్తున్నారని, అవి ఎక్కడ ఖర్చు పెట్టారో క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు. ‘పాదయాత్ర సమయంలో జగన్‌ ఊరూరా తిరిగి ఎకరానికి రూ.19లక్షల పరిహారమిస్తామని, గతంలో పరిహారం పొందిన వారికి కూడా ఎకరానికి రూ.పది లక్షలు అదనంగా ఇస్తామని నోటికొచ్చినట్లు వాగ్దానాలు చేసి ఓట్లు వేయించుకున్నారు. పునరావాస కాలనీలు కట్టలేదు. వరదల్లో మునిగిపోయిన నిర్వాసితులకు నాలుగంటే నాలుగు టమాటాలు, నాలుగు ఆలుగడ్డలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వరదల్లో రోజుల తరబడి చిక్కుకున్నవారికి కనీసం భోజనం కూడా పెట్టలేని అసమర్థత’ అని వ్యాఖ్యానించారు. గద్దెనెక్కాక పోలవరం నిర్మాణానికి ఎంత వ్యయం చేశారో.. నిర్వాసితులకు ఎంత సాయం చేశారో.. ఏ మేరకు పునరావాసం కల్పించారో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.


అసమర్థుడి చేతిలో పోలవరం: దేవినేని

‘జాతీయ ప్రాజెక్టును ఒక అసమర్థుడి చేతిలో పెట్టారు. గడచిన 37 నెలలుగా పోలవరం పనులెక్కడ జరిగాయి.. ఎంత మట్టి తవ్వారు.. ఏ స్థాయిలో పనులు జరిగాయి.. పునరావాస కాలనీ పనులు, నిర్వాసితుల పరిహారం మొదలైనవాటిపై ముఖ్యమంత్రికి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్‌ విసిరారు. బుధవారం జంగారెడ్డిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఎన్నికల్లో డబ్బులు తెచ్చుకుని పోలవరం ప్రాజెక్టును పండపెట్టడానికి ఒప్పుకొన్నారు. అమరావతిని చంపేయడానికి ఒప్పుకొన్నారు. దీనివల్లే పోలవరంపై అనిశ్చితి.. అమరావతి రైతుల 950 రోజుల నిరసనలు. దేవాలయం మునుగుతుందని.. పోలవరం ఎత్తు ఒకట్రెండు అడుగులు తగ్గించాలని జగన్‌ను అడిగితే ఆయన సానుకూలంగా స్పందించారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలోనే మాట్లాడితే 30 నెలలుగా నోరు ఎందుకు మూసుకున్నారు’ అని మండిపడ్డారు. ‘రూ.280 కోట్ల డ్రెడ్జింగ్‌ కాంట్రాక్టును సీఎం సన్నిహితుడికి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో ధవళేశ్వరంలో పనిచేస్తున్న ఒక అధికారి దానికి అంగీకరించలేదు. అర్హతలేని వారికి కట్టబెడితే తన ఉద్యోగం పోతుందని, భవిష్యత్‌లో ఇబ్బంది వస్తుందన్న ఆ ఉద్యోగిని ప్రభుత్వం జూన్‌ మూడో వారంలో సెలవు పెట్టించి పంపించింది. 


దిగువ కాఫర్‌ డ్యాం పనులు పూర్తి చేయకపోవడంతో వరద నీటితో ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నడుమ ఒక జలాశయం తయారైంది. ఆ నీళ్లు ఎప్పడు ఎత్తిపోస్తారు.. డయాఫ్రం వాల్‌ పనులు ఎప్పుడు పూర్తవుతాయి.. దానిపై ఎర్త్‌కం రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది.. అసలు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమనే అనిశ్చితి పరిస్థితికి తీసుకెళ్లారు’ అని మండిపడ్డారు. వరద బీభత్సానికి తిండి లేక పిల్లలు, మహిళలు బతుకు జీవుడా అంటూ బిక్కుబిక్కుమంటుంటే కనీ సం వారికి దైర్యం చెప్పే స్థితిలో ముఖ్యమంత్రి లేన్నారు. అసలు వరద నష్టపరిహారం ఎవరికిచ్చారో లెక్కలున్నాయా అని నిలదీశారు.



Updated Date - 2022-07-21T08:41:57+05:30 IST