ప్రభుత్వానికి ఆ అధికారం ఎక్కడిది?

ABN , First Publish Date - 2022-08-19T07:54:10+05:30 IST

సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన పంచగ్రామాల భూములను ఆక్రమణదారుల పేరు మీద క్రమబద్ధీకరిచే నిమిత్తం చట్టం తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వానికి ఆ అధికారం ఎక్కడిది?

  • మీదికాని ఆస్తిని వేరొకరికి పంచేందుకు చట్టం ఎలా చేస్తారు?
  • పంచగ్రామాల భూముల క్రమబద్ధీకరణపై నిలదీసిన హైకోర్టు

అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన పంచగ్రామాల భూములను ఆక్రమణదారుల పేరు మీద  క్రమబద్ధీకరిచే నిమిత్తం చట్టం తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని హైకోర్టు ప్రశ్నించింది. ‘మీదికాని ఆస్తిని వేరొకరికి పంచేందుకు చట్టం ఎలా చేస్తారు?’ అని ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిని అనుమతిస్తే రేపు పేదలకు పంచుతున్నామనే పేరుతో ప్రైవేటు వ్యక్తుల భూములను సైతం స్వాధీనం చేసుకొని, పరిహారం చెల్లించామని చెప్పే ప్రమాదం ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. వ్యాజ్యాలపై తుదివాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. 


విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. పంచగ్రామాల భూములను ఆక్రమణదారుల పేరిట క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన చట్టం(19/2019)ను విజయవాడకు చెందిన రామనాథం రామచంద్రరావు హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆక్రమణల క్రమబద్ధీకరణకు రుసుమును ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 229ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.  విచారణ జరిపిన హైకోర్టు భూముల క్రమబద్ధీకరణపై యథాతథస్థితి పాటించాలని 2019 ఏప్రిల్‌ 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపించారు. ‘దేవాలయాల భూములను విక్రయించడానికీ, క్రమబద్ధీకరించడానికీ వీల్లేదని హైకోర్టు 2005లో తీర్పు ఇచ్చింది. ఆ ఆదేశాలను అధిగమించేందుకు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దేవస్థానం కోల్పోయే భూములకు తగినంత పరిహారం లభించడం లేదు. చట్టాన్ని రద్దు చేయండి’ అని కోరారు. 


దీనిపై ఏజీ స్పందిస్తూ... గత 30 ఏళ్లుగా ఆ భూములు ఆక్రమణలో ఉన్నాయని, ఆక్రమణదారులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, ఆ భూముల నుంచి దేవస్థానానికి ఎలాంటి ఆదాయమూ లేదని తెలిపారు.  భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని, తద్వారా వచ్చే సొమ్మును దేవస్థానానికి జమ చేస్తామని వివరించారు. దేవస్థానం కోల్పోతున్న భూమికి ప్రత్యామ్నాయం మరోచోట భూమిని ఇస్తామన్నారు. సింహాచలం దేవస్థానం ఈవో తరఫు న్యాయవాది కె.మాధవరెడ్డి వాదనలు వినిపిస్తూ... ఆక్రమణదారులను భూముల నుంచి ఖాళీ చేయించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో దేవస్థానానికి ఆదాయం వస్తుందని చెప్పారు. భూముల క్రమబద్ధీకరణ నిమిత్తం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు. ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. క్రమబద్ధీకరణ పేరుతో దేవస్థానానికి చెందిన విలువైన భూములను వేరేవారికి కట్టబెట్టే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రత్యామ్నాయంగా తక్కువ విలువ ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం, దేవస్థానం.. ఇరుపక్షాలు కమ్మక్కు అయ్యారా? అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉందన్నారు. వాజ్యంపై తుదివిచారణ జరుపుతామంటూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - 2022-08-19T07:54:10+05:30 IST