నీరు వెళ్లే దారేది...?

ABN , First Publish Date - 2022-06-27T07:29:31+05:30 IST

ఉమ్మడి జిల్లాలో 1776 చెరువులు ఉండేవి. ఆయకట్టు 99,239 ఎకరాలు ఉండగా... వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండే చెరువులు 234 ఉన్నాయి. వీటి పరిధిలో 66945 ఎకరాలు ఉంది. ఇక వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉండే చెరువులు

నీరు వెళ్లే దారేది...?
బద్వేలు చెరువు నుంచి చిన్న తూముకు వెళ్లే పంట కాలువ దుస్థితి

కంప చెట్లు, పూడికతో నిండిన కాల్వలు

చెరువుల నుంచి ఆయకట్టకు అందని నీరు

పంటల సాగుకు నోచుకోని భూములు

పట్టించుకోని ప్రభుత్వం

ఉమ్మడి జిల్లాలో 1776 చెరువులు, 99260 ఎకరాలు ఆయకట్టు


రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వనరులపై తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. గ్రామీణుల వ్యవసాయానికి దిక్సూచిగా ఉండే చెరువులను గాలికి వదిలేసింది. అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుని నోట్లో శని అన్న చందంగా చెరువుల్లో నీరున్నప్పటికీ వాటిని పంట పొలాలకు ఉపయోగించుకోలేని దుస్థితి. వెరశి గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల నుంచి చివరి ఆయకట్టు సంగతిని వదిలేస్తే... కనీసం చెరువు దగ్గరగా ఉన్న ఆయకట్టుకు కూడా నీరందని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నామని గొప్పలు చెబుతుంటుంది. చెరువులను పునరుద్ధరిస్తున్నామని చెప్పుకొస్తోంది. చెరువుల పునరుద్దరణ సరే.. మరి ఆ చెరువుల నుంచి పొలాలకు నీరు వెళ్లే కాల్వల పరిస్థితి ఏంటి.. వాటిని పట్టించుకోకుండా వదిలేయడంతో కంప చెట్లు, పూడికతో నిండిపోయాయి. కొన్ని చోట్ల దట్టంగా ముళ్ల పొదలు వ్యాపించడంతో అసలు ఇక్కడ కాల్వ ఉందా అన్న అనుమానం కలుగుతుంది. 


(కడప - ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో 1776 చెరువులు ఉండేవి. ఆయకట్టు 99,239 ఎకరాలు ఉండగా... వంద ఎకరాలకు పైగా ఆయకట్టు ఉండే చెరువులు 234 ఉన్నాయి. వీటి పరిధిలో 66945 ఎకరాలు ఉంది. ఇక వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉండే చెరువులు 1542 ఉన్నాయి. ఇక్కడ మొత్తం 32294 ఎకరాలు ఉన్నాయి. అన్నీ చెరువులను కలిపితే 6టీఎంసీల నీటి సామర్ధ్యం ఉంది. చెరువుల్లో నీరు సమృద్ధిగా ఉంటే డైరెక్టుగా  దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే భూగర్భ జలాలు పెంపొందడం వల్ల అదనంగా సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని చెబుతున్నారు. 


చెరువుల ఆధారంగా వ్యవసాయం

గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల ఆధారంగా రైతులు వరి, పత్తి, సజ్జ ఇతర పంటలు సాగు చేస్తుంటారు. అయితే చెరువుల నిర్వహణపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఏటా వర్షాకాలం లోపు చెరువులను పరిశీలించి తూములు దెబ్బతిన్నాయా... కట్ట బలహీనంగా ఉందా... తూము షట్టర్లు, పంట కాల్వలు పరిశీలించి చెరువులను సిద్ధం చేస్తే.. వర్షం నీటిని ఒడిసి పట్టుకుంటారు. అనంతరం చెరువుల నుంచి పొలాలకు నీరందించుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదు. కొన్ని చెరువులను జపాన్‌, ఇతర నిధులతో అభివృద్ధి చేస్తున్నారు తప్ప కాల్వలు, దెబ్బతిన్న తూముల విషయం విస్మరించారు. ఉపాధి ద్వారా కాల్వ పనులు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ... అవి చాలా చోట్ల జరగడం లేదు. దీంతో కాల్వలు కంప చెట్లు, పూడికతో  నిండిపోయి చెరువులో నీరున్నా కూడా పొలాలకు అందని దుస్థితి నెలకొంది. 


ఈ చిత్రంలో కనిపిస్తున్నది కలసపాడు మండలం, ఎగువ రామాపురం సమీపంలోని తడుకు చెరువు. దీని కింద ఎగువ రామాపురం, ఎగువ తంబళ్లపల్లెకు సంబంధించి సుమారు 1200 ఎకరాల దాకా ఆయకట్టు ఉంది. చెరువులో నీరుంటే వ్యవసాయ బోర్లలో భూగర్భ జలాలు పెరిగి.. తద్వారా మరో వెయ్యి ఎకరాలకు సాగునీరందుతుంది. అయితే గత ఏడాది కురిసిన వర్షాలకు తూము దగ్గర గండి పడింది. నీరు వృథాగా పోకుండా తాత్కాలికంగా గండి పూడ్చారు. శాశ్వత పనులు చేపట్టలేదు. ఎగువ రామాపురం పరిధిలో వ్యవసాయ భూములకు వెళ్లే పంట కాల్వలో కంప చెట్లు పెరిగి.. పూడికతో పూడి పోయింది. అసలు అక్కడ కాల్వ ఉందా అన్న అనుమానం కలుగుతుంది. 


ఇది బద్వేలు పెద్ద చెరువు. బద్వేలు, గోపవరం మండలాలోని కొన్ని గ్రామాలకు ఇదే ప్రధాన సాగునీటి వనరు. చిన్న తూము పరిధిలో అధికారికంగా 1850 ఎకరాలు, పెద్ద తూము కింద 2150 ఎకరాల ఆయకట్టు ఉంది. అనధికారికంగా అయితే పది వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే తూముల పరిధిలో పంట కాల్వల్లో కొన్ని చోట్ల పెద్ద ఎత్తున ముళ్ల పొదలు ఏపుగా పెరిగిపోయాయి. పూడిక పేరుకుపోయింది. దీంతో పంట కాల్వల ద్వారా సాగునీరందని పరిస్థితి. ఇక్కడ వరి సాగు చేస్తారు. కాల్వలను పట్టించుకోకపోవడంతో ఈ సారి పంటలు సాగు చేస్తామా, లేదా అన్న ఆందోళన రైతాంగం ఉంది. 


ఈ చిత్రంలో కనిపిస్తున్నది బి.కోడూరు మండలంలోని గోవిందాయపల్లె చెరువు. దీని కింద 300 ఎకరాలు ఆయకట్టు ఉంది. పేరమ్మగారిపల్లె, రెడ్డివారిపల్లె, గోవిందయ్యగారిపల్లెకు చెందిన రైతుల పొలాలు ఉన్నాయి. చెరువుల్లో నీరు ఉంది. అయితే తూము దెబ్బతినడంతో నీరు వృథాగా పోకుండా పూడ్చారు. కాల్వలు ముళ్లకంపలతో అల్లుకుపోయాయి.


ఇది మైదుకూరు సమీపం నుంచి కొండపేట వెళ్లే కేసీ కెనాల్‌ ఉప కాలువ. ఈ కాలువ పరిధిలో సుమారు 20వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే అక్కడక్కడా పూడిక పేరుకుపోయింది. మొక్కలు కూడా మొలిచాయి. కంపచెట్లు కూడా పెరిగాయి. 


కాలువ బాగు చేయాలి  

- సుబ్బరత్నం, రైతు, ఎగువ రామాపురం, కలసపాడు మండలం 

తడుకు చెరువు కింద నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. చెరువులో నీళ్లున్నా కూడా పంటలకు నీరందని పరిస్థితి. వర్షాధారంగా పంటలు వేస్తాం. మా ఊరి పొలాలకు వచ్చే కాలువ పూడిపోయింది. చెట్లు, మట్టితో నిండిపోయింది. చెరువుల్లో నీరున్నా అందకపోవడంతో సాగు చేయలేని పరిస్థితి దాపురించింది.


చెరువు ద్వారా సాగునీరందించాలి  

- వై.బాల అంకిరెడ్డి, రైతు, ఎగువ రామాపురం  

తడుకు చెరువులో నీరున్నా కూడా మా ఊరి పొలాలకు సాగునీరు అందదు. మా కాలువ పూర్తిగా చెట్లు, ముళ్ల కంపలతో నిండిపోయింది. గత వర్షాకాలంలో తూముకు గండి పడింది. తాత్కాలిక పనులు చేపట్టారు. రాబోయేది వర్షాకాలం. ఆ సమయానికి గండికి శాశ్వత మరమ్మతులు చేసి మా ఊరి కాల్వను సాగులోకి వచ్చేలా చేయాలి.

Updated Date - 2022-06-27T07:29:31+05:30 IST