గాంధీ నడిచిన చోట

ABN , First Publish Date - 2022-08-08T06:35:16+05:30 IST

మహాత్మాగాంధీ ఒక స్వేచ్ఛానినాదం. ఒక స్వతంత్య్ర భావన. పరాయి పాలకులను నిరాయుధంగా ఎదిరించి పోరాడిన స్ఫూర్తి. అసేతు హిమాచలం ఒక్క తాటిపై భారతీయులను నడిపిన ఉక్కు పిడికిలి. దాదాపు వంద సంవత్సరాల క్రితం ఆ మహాత్ముడు మన ప్రాంతంలో పర్యటించాడు.

గాంధీ నడిచిన చోట

మహాత్మాగాంధీ ఒక స్వేచ్ఛానినాదం. ఒక స్వతంత్య్ర భావన. పరాయి పాలకులను నిరాయుధంగా ఎదిరించి పోరాడిన స్ఫూర్తి. అసేతు హిమాచలం ఒక్క తాటిపై భారతీయులను నడిపిన ఉక్కు పిడికిలి. దాదాపు వంద సంవత్సరాల క్రితం ఆ మహాత్ముడు మన ప్రాంతంలో పర్యటించాడు. జిల్లావాసుల్లో స్వేచ్ఛా పిపాస రగిలించాడు. 1921, 29, 33 లో రాయలసీమలో, అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గాంధీ పర్యటనల విశేషాలను ఆజాదీ కా అమృతోత్సవాల సందర్భంగా ఆంధ్రజ్యోతి పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం...           - తిరుపతి (కల్చరల్‌)


1921 సెప్టెంబర్‌ 28 : తిరుపతి పట్టణం పులకించిపోయిన రోజు అది. పట్టణంలో ప్రధాన వీధుల్లో నడిచి సాగిపోతున్న గాంధీ వెంట ప్రజలంతా ఉద్వేగంగా ఉత్సాహంగా నడిచారు. ఆయన స్ఫూర్తితో ఉద్యమంలో భాగం అయ్యారు. ఆ రోజు తిరుపతిలో భారీ సభ జరిగింది. సభలో గాంధీ పిలుపు మేరకు ఉద్యమం కోసం  రూ. 17,990 విరాళంగా వసూలైంది. తిరుపతికి చెందిన రంగసాయిశెట్టి 15 వేలు, సి.వి. రంగంశెట్టి 2 వేలు, చిత్తూరు ప్రతినిధులు రూ.750, మంగళంపేట వాసులు రూ. 180 విరాళంగా అందించారు. 

1929 మే : జిల్లాలో పలు ప్రాంతాలను  గాంధీ సందర్శించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, అంటరానితనాన్ని విడనాడాలని పిలుపునిచ్చారు. పలువురు గాంధీకి విరాళాలు ఇచ్చారు. శ్రీకాళహస్తిలో జరిగిన సభలో రూ.1432, తిరుపతి నుంచి రూ. 1099, రేణిగుంటలో రూ.67, చిత్తూరు ప్రజలు రూ. 511, పలమనేరు నుంచి రూ. 138, పుంగనూరు నుంచి రూ. 536, మదనపల్లె నుంచి రూ. 2475 వసూలయ్యాయి. 

1933 డిసెంబరు : ఈ పర్యటనలో గాంధీ హరిజనోద్ధరణకోసం నిధిని కోరారు. వెంటనే తిరుపతికి చెందిన పుల్లయ్య శెట్టి ఒక వెండి పాత్రను బహూకరించారు. దీనజనోద్యమ నిధికి ఆరోజు రూ.1424 సమకూరాయి. తిరుమలకు హరిజనులను అనుమతించాలని అప్పటి దేవస్ధాన కమిటీ సభ్యులతో గాంధీ చర్చించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని దేవస్ధాన కమిషనర్‌ సీతారామి రెడ్డి మహాత్ముడికి హామీ ఇచ్చారు. 

గాంధీని అరెస్ట్‌ చేయడంతో 1930అక్టోబర్‌ 2న జిల్లాలో పెద్దఎత్తున ఆందోళన ప్రబలింది. విద్యార్థులు వాడవాడలా ఊరేగింపులు తీశారు. పరీక్షలు రాసేది లేదు పొమ్మన్నారు. శ్రీకాళహస్తిలో సంపూర్ణ బంద్‌ జరిగింది. బ్రిటిష్‌ అటవీ అధికారులపై గ్రామీణులు తిరగబడ్డారు.

సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా గాంధీ పిలుపునివ్వగానే జిల్లా స్పందించింది.ముఖ్యంగా విద్యార్ధులు బడులు, కళాశాలలు వదిలి పెట్టి పోరుబాట పట్టారు. వీరికి న్యాయవాదులు జత కలవడంతో జిల్లాలో సహాయ నిరాకరణ ఉద్యమం దావానలంలా వ్యాపించింది. పలువురు ప్రముఖులు కూడా అప్పటి బ్రిటీష్‌ పాలకులు తమకిచ్చిన గౌరవాలను, బిరుదులను తిరస్కరించారు. 

మహాత్ముడి పిలుపుతో జిల్లావాసులు 1920 ప్రొవియన్షిల్‌ ఎన్నికల్లో పాల్గొనలేదు. అప్పటికి జిల్లాలో 38,666 ఓట్లుండగా కేవలం 7, 746 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. చిత్తూరులో 534మంది ఓటర్లుండగా కేవలం 135 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. జాతీయ కాంగ్రెస్‌ పార్టీ ఆ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో, జస్టిస్‌ పార్టీ విజయం సాధించి మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారం చేపట్టింది గానీ ఎక్కువ కాలం పాలించలేదు.

శాసనోల్లంఘన ఉద్యమకాలంలో ప్రముఖంగా పనిచేసిన ఎం.దూర్వాసులునాయుడు, కె.మల్లిరెడ్డి, పి.రామచంద్రారెడ్డి, పి.తిమ్మారెడ్డి, వజ్రవేలుశెట్టి, వెంకటేశయ్య వంటి వారు ఎందరో చదువుమానుకుని గాంధీ బాటలో 

నడిచారు.

తిరగబడ్డ తెల్లపులి అనిబిసెంట్‌

         ‘‘స్వేచ్ఛలేని బతుకు చావుతో సమానం, దీక్షపూనండి, ఉద్యమించండి మౌనమో, త్యాగమో తేల్చుకోండి’’ 1916 మార్చిలో చిత్తూరులో జరిగిన సభలో అనిబిసెంట్‌ ఇచ్చిన పిలుపు ఇది. తెల్లదొరల పాలనపై తిరగబడండి అంటూ తెల్ల మహిళ భారతీయులకు ఇచ్చిన ఈ పిలుపు చిత్తూరు జిల్లా ప్రజలను తట్టిలేపింది.బ్రిటన్‌లో జన్మించి, దివ్యసమాజం కోసం భారత్‌లో అడుగుపెట్టిన స్త్రీ అనిబిసెంట్‌.  ఇక్కడి పరిస్థితులను కళ్లజూసి కదిలి కదనరంగంలోకి దిగారు ఆమె. స్వపరిపాలన లేని దేశంలో పేదరికంపై పోరాటం వృధా అనే భావనతో అనిబిసెంట్‌ భారత స్వతంత్ర ఉద్యమంలో కీలకభూమిక వహించారు. ప్రజలతో మమేకమై ఉద్యమానికి అండగా నిలిచారు. ఈ అనితరసాధ్యమైన ధిక్కారస్వరానికి వేదికగా మదనపల్లె నిలవడం ఈ జిల్లా అదృష్టంగా చెప్పవచ్చు. అనిబిసెంట్‌ ప్రారంభించిన న్యూ ఇండియా, కామన్‌ వీల్‌ అనే పత్రికలు జాతీయోద్యమ ప్రచారంలో కరపత్రాలుగా ఉపకరించాయి. హోమ్‌ రూల్‌ ఉద్యమకాలంలో అనిబిసెంట్‌ అవిశ్రాంతంగా శ్రమించారు. దీంతో బ్రిటీష్‌ ప్రభుత్వం ఆమెను 1917 జూన్‌ 16వ తేదీన అరెస్ట్‌ చేసింది. బ్రిటీష్‌ మహిళను అరెస్ట్‌ చేయడం పట్ల ఇంగ్లండులో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో 1917 సప్టెంబరు 17న 93 రోజుల నిర్బంధం తరువాత ఆమెను విడుదల చేశారు.అనిబిసెంట్‌ 1917 డిసెంబరులో భారతజాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమెకు జిల్లాతో ఉన్న అనుబంధం కారణంగా ప్రజల్లో ఆమె మాటకు తిరుగుండేది కాదు. 1915 తరువాత జిల్లాలో పోరాట ఉధృతి పెరగడానికి అనిబిసెంట్‌ ఒక ప్రధాన కారణం. అప్పట్లో అనిబిసెంట్‌ ఉద్యమానికి ఊతమిస్తున్నందున మదనపల్లెలోని బీటీ కళాశాలకు బ్రిటిష్‌ ప్రభుత్వం గుర్తింపు రద్దుచేసింది. 


Updated Date - 2022-08-08T06:35:16+05:30 IST