ఇన్వెస్టర్ల ఈ డబ్బు ఎటు పోతోంది ?

ABN , First Publish Date - 2022-01-28T02:02:39+05:30 IST

కుప్పకూలిన స్టాక్ మార్కెట్., ఇన్వెస్టర్ల సంపద ఆవిరి... ఈ తరహా వార్తలు తరచూ వింటుంటాం. కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్‌లో వరుస పతనాల కారణంగా మరోసారి ఇదే జరుగుతోంది.

ఇన్వెస్టర్ల ఈ డబ్బు ఎటు పోతోంది ?

మార్కెట్ వరస పతనాలు... 

నిత్యం అప్రమత్తంగా ఉండడమే బెటర్... 

ముంబై : కుప్పకూలిన స్టాక్ మార్కెట్., ఇన్వెస్టర్ల సంపద ఆవిరి... ఈ తరహా వార్తలు తరచూ వింటుంటాం. కొద్దిరోజులుగా స్టాక్ మార్కెట్‌లో వరుస పతనాల కారణంగా మరోమారు ఇదే జరుగుతోంది. ఇది సరే... మరి ఇన్వెస్టర్లు నష్టపోయిన ఈ డబ్బు ఎక్కడికి వెళుతుంది ? ఎవరికి లాభంగా మారుతుంది ? వాస్తవానికి షేర్ విలువ అన్నది సంబంధిత కంపెనీ పనితీరు, నష్టం, లాభాలను  అంచనా వేయడంపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో కంపెనీ మెరుగైన పనితీరును కనబరుస్తుందని పెట్టుబడిదారులు, మార్కెట్ విశ్లేషకులు భావిస్తే...  షేర్ల కొనుగోలు పెరుగుతుందన్న విషయం తెలిసిందే.


మార్కెట్‌లో డిమాండ్ కూడా పెరుగుతుంది. అలాగే... ఏదైనా కంపెనీకి భవిష్యత్తులో లాభాలు తగ్గుతాయని, లేదా...  వ్యాపారంలో మందగమనం ఉంటుందని అంచనా వేసినట్లయితే... దాని షేర్ల ధరలు తగ్గిపోతాయి. మార్కెట్... ‘డిమాండ్ సరఫరా’ సూత్రంపై పనిచేస్తుందన్న విషయం విదితమే. ఈ క్రమంలో... రెండు సందర్భాల్లో షేర్ల విలువ పెరగడం, లేదా ... తగ్గడం జరుగుతుంటుంది. ఈ కథనానికి సంబంధించి మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


మార్కెట్‌లో నిజమైన డబ్బు ఉండదు. స్టాక్ విలువ మాత్రమే ఉంటుంది.. ఈ రోజు రూ. 100 పెట్టి కొనుగోలు చేసిన షేరు విలువ రూ. 80 కు తగ్గితే...  రూ.  20 నష్టం వాటిల్లుతుంది. ఈ షేర్లను విక్రయించినప్పుడు నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. అయితే వాటిని కొనుగోలు చేసిన వ్యక్తికి నేరుగా ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదు. ఆ షేర్ విలువ మళ్లీ మళ్లీ రూ. 100 కు పెరిగినపక్షంలో మాత్రమే... కొనుగోలుదారునికి రూ.  20 లాభం వస్తుంది.


స్టాక్ మార్కెట్ అనేది సెంటిమెంట్ గేమ్ అని అంటుంటారు. ఉదాహరణకు ఒక కంపెనీ క్యాన్సర్ ఔషధం తయారీకి పేటెంట్ పొందినట్లయిత... భవిష్యత్తులో దాని వ్యాపారం, ఆదాయాలు ఖచ్చితంగా పెరుగుతాయన్న పెట్టుబడిదారుల ఈ నమ్మకం కారణంగా ఆ కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం జరుగుతుంటుంది. మార్కెట్‌లో డిమాండ్ పెరగడంతో ధరలు పెరగడం మొదలవుతాయి.


సరే... ఇక మార్కెట్ కుప్పకూలిన సందర్భాల నేపథ్యంలో... డబ్బు ఎవరి జేబుల్లోకో  కాకుండా... కంపెనీల వాల్యుయేషన్ తగ్గినందున  ఈ సొమ్ము గాలిలో కలిసిపోయినట్లే. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ విలువ జనవరి 17 న రూ. 280.02 లక్షల కోట్లు కాగా, జనవరి 25 నాటికి రూ. 262.78 లక్షల కోట్లకు తగ్గిపోయింది. 

Updated Date - 2022-01-28T02:02:39+05:30 IST