ప్రజాస్వామ్యమా.. ప్రజా కంఠక రాజ్యమా..?

ABN , First Publish Date - 2022-08-18T05:39:50+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన తమను ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యా.. ప్రజా కంఠక రాజ్యమా..? అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే వీలుంటుందని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాళేశ్వరానికి బయల్దేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడితో పాటు కీలక నేతలను బుధవారం భూపాలపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు.

ప్రజాస్వామ్యమా.. ప్రజా కంఠక రాజ్యమా..?
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పార్టీ నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు

కాళేశ్వరం సందర్శనను అడ్డుకోవడం దారుణం
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
కాంగ్రెస్‌ నేతల కాళేశ్వరం టూర్‌కు బ్రేక్‌
భూపాలపల్లిలో అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు


భూపాలపల్లిటౌన్‌, ఆగస్టు 17: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయల్దేరిన తమను ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకోవడం దారుణమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యా.. ప్రజా కంఠక రాజ్యమా..? అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లే వీలుంటుందని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో కాళేశ్వరానికి బయల్దేరిన  కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడితో పాటు కీలక నేతలను బుధవారం భూపాలపల్లిలో పోలీసులు అరెస్టు చేశారు.

ఇటీవల కురిసిన భారీవర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాలతో పాటు నీట మునిగిన కాళేశ్వరం పంపుహౌ్‌సను సందర్శించేందుకు సీఎల్పీ బృందం బుధవారం పర్యటన చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి సీఎల్‌పీ నేతలు బయల్దేరి ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రావాల్సి ఉండగా పోలీసులు అనుమతిని నిరాకరించడంతో వాయిదా వేసుకున్నారు. అక్కడి నుంచి భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం బయల్దేరిన సీఎల్‌పీ నేతలను పోలీసులు వెంబడించారు. అయితే పోలీసుల కళ్లుగప్పి రూట్‌ మార్చి, ములుగు జిల్లా జాకారం నుంచి వెంకటాపూర్‌, లక్ష్మీదేవిపేట నుంచి భూపాలపల్లి జిల్లా ఆరెపల్లి, చెల్పూరు మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సీఎల్పీ నేతలు చేరుకున్నారు. ఈ క్రమంలో భూపాలపల్లి పట్టణంలోని మంజూరునగర్‌ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సీఎల్పీ నేతల రాకతో వందలాది మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా మంజూరునగర్‌కు చేరుకోవటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో మంజూరునగర్‌ వరకు సీఎల్పీ నేతల వాహనాలు రావటంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తీవ్రంగా తోపులాట జరిగింది. దీంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు బారీకేడ్లు తొలిగించే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది.

ఈ క్రమంలో సీఎల్పీ నేతలు భట్టి  విక్రమార్క, మంథని ఎమ్మెల్యే దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. తమకు అనుమతి ఇవ్వాల్సిందేనని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతలుగా తమపై ఉందని పట్టుబట్టారు. కాళేశ్వరంలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, పంపుహౌస్‌ వద్ద ఎవరి పర్యటనలకూ అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో కాంగ్రెస్‌ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తు మంజూరునగర్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. తమకు కాళేశ్వరం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సుమారు గంటపాటు రోడ్డుపై కాంగ్రెస్‌ నేతలు బైఠాయించటంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో భూపాలపల్లి డీఎస్పీ రాములు, సీఐ రాజిరెడ్డి నేతృత్వంలో పోలీసులు భట్టి విక్రమార్క, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడితో పాటు కాంగ్రెస్‌ నేతలను బలవంతగా అరెస్టు చేసి గణపురం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

భూపాలపల్లిలో రోడ్డుపై బైఠాయించిన సందర్భగా భట్టి విక్రమార్క మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి బయటపడుతుందనే తమను వెళ్లకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కాళేశ్వరం కట్టినప్పుడు బస్సుల్లో తీసుకెళ్లి చూపించిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు తమనెందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. వేలాది కోట్ల అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందని ఆరోపించారు. ప్రాజెక్టు కట్టిన మూడేళ్లకే కూలిపోయిందని, దీనిపై విచారణ జరిపించాలని  డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఎక్కడికైనా వెళ్లి పరిశీలించే హక్కు తమకు ఉందని, కానీ ఈ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఽధ్వజమెత్తారు.  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం తాము ముందే  ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ కూడా ఇచ్చామని చెప్పారు. పోలీసులు మాత్రం  తమను అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు.  రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టును ఎందుకు సందర్శించొద్దో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

నిషేధిత పార్టీనా..
కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తామని గత వారమే పోలీసులకు సమాచారం ఇచ్చామని, అయినా తమను అడ్డుకోవటం ఏమిటని  ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మండిపడ్డారు. కాంగ్రెస్‌ నిషేధిత పార్టీనా..? అని ప్రశ్నించారు. సీఎల్పీ బృందం కాళేశ్వరం వెళ్తే తప్పిదాలు  బయట పడుతాయనే ఉద్దశంతోనే ప్రభుత్వం అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ ప్రాంతంలోని ఒక్క ఎకరానికి కూడా సాగునీరందడం లేదని అన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ తప్పిదాలు లేకుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ప్రశ్నించారు. ప్రాజెక్టులు నిర్మాణం కోసం వేల కోట్ల వెచ్ఛిస్తున్న ప్రభుత్వంపై ఆ నిధులు ఏమేరకు ఉపయోగపడుతున్నాయో కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పక్కా అవినీతి జరిగిందని ఆరోపించారు. సీఎల్పీ బృందం రాష్ట్రంలోని ప్రాజెక్టుల సందర్శనతో పాటు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు వెళ్తుంటే అడ్డుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టు చూడడానికి కర్ణాటక నుంచి ఓ రైతు వచ్చి గుండెపోటుతో మృతి చెందాడని, ఆయన కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించిన ప్రభుత్వం.. ఈ ప్రాంత ప్రజలు వరదలు, ప్రాజెక్టు వల్ల నష్టపోయినా న్యాయం చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయిత ప్రకాశ్‌రెడ్డి, నాయకులు రమేష్‌, ధర్మారావు, సీతారాములు, శ్రీనివాస్‌, అర్జున్‌, అశోక్‌ సమ్మయ్య, దేవన్‌, భట్టు కర్ణాకర్‌, సురేష్‌, రజినికాంత్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-08-18T05:39:50+05:30 IST