పొదుపు సంఘాలకు ప్రోత్సాహమేదీ ?

ABN , First Publish Date - 2020-12-01T06:06:27+05:30 IST

గ్రామీణాభివృద్ది పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా మహిళలకు చేయూతనందించి వారిని ఆర్థిక పురోగాభివృద్ది వైపు పయనింపజేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న పథకాలన్నీ లక్ష్యసాధనలో విఫలమవుతున్నాయి.

పొదుపు సంఘాలకు ప్రోత్సాహమేదీ ?

ఆర్భాటంగా లక్ష్యాల నిర్ధారణ 

అందనంత దూరంలో ఆచరణ 

లక్ష్యసాధనలో నత్తనడకన.. 

వంద కోట్ల సహాయంపై సందిగ్ధం 

బ్యాంకు లింకేజీపై గందరగోళం 

అందని ద్రాక్షగా స్వయం ఉపాధి 

నిర్మల్‌ , నవంబరు 30 (ఆంధ్రజ్యోతి)  : గ్రామీణాభివృద్ది  పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా మహిళలకు చేయూతనందించి వారిని ఆర్థిక పురోగాభివృద్ది వైపు పయనింపజేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న పథకాలన్నీ లక్ష్యసాధనలో విఫలమవుతున్నాయి. పొదుపుసంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ పేరిట అందిస్తున్న ఆర్థికసహాయం అరకొరగా సాగుతుండడం మహిళల స్వయం సం మృద్ధికి శాపమవుతోందంటున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రతీగ్రామంలో గ్రామసంఘాలు, స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశాయి. మహిళల పొదుపునకు తోడుగా ప్రభుత్వం వారికి ఆర్థిక పరమైన ప్రోత్సాహం అందించి వారిని ఆదుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బ్యాంకుల ద్వారా ఆర్థికపరమైన సబ్సిడీ ప్రోత్సాహకాలను అందించి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధికల్పించాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. అయితే ఈ సంవత్సరం ఈ పొదుపు సంఘాల మహిళల కోసం కేటాయిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో అందించకపోతుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 504 గ్రామసంఘాలను ఏర్పాటు చేయగా, మరో 10,590 స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘాల్లో మొత్తం 1,18, 654 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ప్రతీయేటా మహిళ స్వయం సహాయక సంఘాలకు సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఆర్థిక సహాయాన్ని వారి పొదుపుడబ్బులతో కలిపి అందిస్తుంటారు. ముఖ్యంగా తక్కువ వడ్డీతో బ్యాంకు రుణాలను అందిస్తున్నారు. అయితే ఈ రుణాల పంపిణీ వెనక సంబంధిత సిబ్బంది చేతివాటం కొనసాగుతోందన్న ఫిర్యాదులున్నాయి. దీనికి తోడుమహిళా సంఘాల లీడర్లు సైతం కొన్ని గ్రామాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బ్యాంకులింకేజీ ద్వారా అందించే ఆర్థిక సహకారానికి సంబందించిన లక్ష్యాన్ని ప్రతియేటా చేరుకోపోతుండడం మహిళ ఆర్థికాభివృద్ధికి శాపమవుతోంది. 2020- 2021 సంవత్సరానికిగాను జిల్లాలోని 8,577 సంఘాలకు రూ. 201 కోట్లను బ్యాంకులింకేజీ ద్వారా అందించాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. అయితే ఇప్పటి వరకు కేవలం 3,044 సంఘాలకు రూ.110 కోట్లను మాత్రమే అందించారు. మరో రూ.100 కోట్లను మిగతా సంఘాలకు అందించాల్సి ఉంది. అయితే ఆర్థికసంవత్సరం గడువు సమీపిస్తున్నప్పటికీ ఈ నిధుల చెల్లింపు విషయంలో ఆశించిన మేరకు ప్రగతి కనిపించడం లేదంటున్నారు. దాదాపు 4వేల సంఘాలకు ఈ నిధులను అందించాల్సి ఉంది. గ్రామీణాభివృద్ది శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది మహిళాసంఘాల ఆర్థిక కార్యకలాపాల వ్యవహారంలో స్పష్టమైన నివేదికలు అందించకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమవుతోందంటున్నారు. మహిళ సంఘాలను ఆదుకుంటామంటూ అటు అధికారులు ఇటు ప్రజా ప్రతినిధులు చేస్తున్న ప్రకటనలన్నీ బుట్ట దాఖలవుతున్నాయన్న విమర్శలున్నాయి. కేవలం ఓట్ల కోసమే మహిళలను ఆకర్షించేందుకు ఆర్థిక సహకారం పేరిట ఇలాంటి ఎత్తుగడలు అమలు చేస్తూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. 

అందని పూర్తి ప్రొత్సాహం

కాగా పొదుపు సంఘాల మహిళలను ఆదుకుంటామంటూ సర్కారు చేస్తున్న ప్రకటనలన్నీ బుట్టదాఖలవుతున్నాయన్న విమర్శలున్నాయి. ప్రతీయేటా పొదుపు సంఘాల మహిళలకు ఆర్థికపరమైన చేయూతను అందించేందుకు గాను భారీ గా లక్ష్యాలను నిర్దేశించడం, మొదట ఆర్భాటంగా ఈ లక్ష్యాలసాధనకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం ఆ తరువాత ఆ లక్ష్యసాధనను విస్మరించడం రివాజుగా మారుతోందన్న ఆరోపణలున్నాయి. ప్రతీ ఆర్థిక సంవత్సరంలో సంఘా ల వారీగా ఆర్థిక సహకారం టార్గెట్‌లను నిర్ధారిస్తుంటారు. ఆ సంఘాల ఆర్థిక పరమైన పురోగతిని పరిగణలోకి తీసుకొని దాని ఆధారంగా టార్గెట్‌లను నిర్దేశిస్తారు. అయితే టార్గెట్‌లను నిర్ధారించడం, కేటాయింపులు జరుపుతుండడం ఓ తంతుగా మారుతోందన్న ఫిర్యాదులున్నాయి. జిల్లాలోని 10,590 సంఘాలకు గాను ప్రతీయేటా సగంకు పైగా సంఘాలను ఆర్థిక సహకారం కోసం ఎంపిక చేస్తారు. ఈ సంఘాల పనితీరు అలాగే బ్యాంకు ఆర్థిక లావాదేవీలు, క్షేత్రస్థాయి కార్యకలాపాలను అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. క్షేత్రస్థాయి సిబ్బంది అందించే నివేదికలను ఆధారంగా చేసుకొని ఆర్థిక సహకారం కోసం ఈ స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేస్తారు. అయితే రాజకీయంగా పలుకుబడి పరపతి ఉన్న కొంతమంది తమ పరపతిని అడ్డం పెట్టుకుని ఆర్థికసహాయం పొందుతున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఇటు అదికారులు అటు ప్రజా ప్రతినిధులు అర్హులైన మహిళ సంఘాల సభ్యులకు అరచేతిలో వైకుంఠం చూపుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. 

ఈసారి కూడా నత్తనడకే..

కాగా 2020 - 2021 సంవత్సరానికి గాను బ్యాంకులింకేజీ కింద మొత్తం 10,590 స్వయం సహకార సంఘాలను గాను 8,577 సంఘాలను ఎంపిక చేసి ఈ సంఘాలకు దాదాపు రూ. 201 కోట్లను ఆర్థిక సహకారంగా అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఇప్పటి వరకు సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయ లోపంతో ఈ లక్ష్యసాధన  నత్తనడకను తలపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం 3,044 సంఘాలకు మాత్రమే ఆర్థిక సహకారాన్ని అందించారు. రూ.110 కోట్లను మాత్రమే ఈ సంఘాలకు అందించిన అధికారులు మిగతా 5,500 సంఘాలకు రూ.110 కోట్లను అందించాల్సి ఉంది. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపుకు మరో రెండు, మూడు నెలలు మాత్రమే మిగిలి ఉండడంతో అంతలోగా ఈ రూ.110 కోట్లను 3044 సంఘాలకు అందించడం కష్టసాధ్యమేనంటున్నారు. క్షేత్రస్థాయిలో ఒత్తిడులు, అలాగే సిఫార



సులు , దీనికి తోడుగా నిబంధనలు లక్ష్య సాధనకు ఆటంకమవుతున్నాయన్న విమర్శలున్నాయి. అయితే కేవలం ఆసరా పెన్షన్‌ల పంపిణీలో మాత్రమే గ్రామీణాభివృద్ది శాఖ తన ప్రగతిని కనబరుస్తూ మహిళ స్వయం సహాయక సంఘాలకు సంబందించి లక్ష్యసాధనలో ఆశించిన మేరకు ప్రగతి కనబర్చడం లేదన్న విమర్శలున్నాయి. 

రాజకీయాలకు అస్త్రంగా..

పొదుపు సంఘాల మహిళలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఓ అస్త్రంగా మారుతున్నాయన్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న మహిళ పొదుపు సంఘాల సభ్యుల ఓట్లను టార్గెట్‌ చేసుకుంటుండడం రివాజుగా మారింది. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే మహిళ పొదుపు సంఘాల సభ్యులను ఆర్థిక పరంగా ఆదుకుంటామని పెద్ద మొత్తంలో సబ్సిడీరుణాలు అందించి స్వయం ఉపాధి దిశగా ప్రొత్సహిస్తామంటూ ప్రకటిస్తాయి. అలాగే ప్రతి అధికారిక కార్యక్రమానికి పొదుపు సంఘాల మహిళలను తరలించడం సహజంగా మారిందంటున్నారు. గ్రామీణప్రాంతాల్లో ఎలాంటి అధికారిక కార్యక్రమం నిర్వహించాలన్నా పొదుపుసంఘాల మహిళల హాజరు తప్పనిసరిగా చేస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది పొదుపు సంఘాల సభ్యులను ప్రభుత్వ కార్యకలాపాలకు అలాగే అధికారిక కార్యకలాపాలకు తీసుకువెళుతుండడంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు లక్ష్యాన్ని నిర్దేశిస్తుండగా ఈ క్షేత్రస్థాయి సిబ్బంది మహిళ సంఘాల గ్రూపు లీడర్లకు టార్గెట్‌లు విధిస్తూ సమీకరణ సాధనకు తోడ్పడుతున్నారన్న విమర్శలున్నాయి. అయితే మహిళ సంఘాల సభ్యులకు అరచేతిలో వైకుంఠం చూపి అన్ని కార్యక్రమాలకు వారి తోడ్పాటును తీసుకుంటున్న పాలకులు ఆ తరువాత వారిని విస్మరిస్తున్నారన్న విమర్శలున్నాయి. 

Updated Date - 2020-12-01T06:06:27+05:30 IST