సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్, పాల్గొన్న జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ సీఈవో ప్రియాంక
- చూపిస్తే రాజీనామా చేస్తాం...
- అధికారులకు సవాల్ విసిరిన జడ్పీటీసీ సభ్యులు
- వాడీవేడిగా జడ్పీ అత్యవసర సర్వసభ్య సమావేశం
కరీంనగర్ టౌన్, మార్చి 26: జిల్లాలోని 15 మండలాల్లోని 492 ఆవాసాల్లో మిషన్ భగీరథ ద్వారా రోజు నీటి సరఫరా చేస్తున్నామని మిషన్ భగీరథ అధికారులు ప్రకటించడంతో జడ్పీలో ఒక్కసారిగా వేడి రగులుకున్నది. జిల్లాలో మూడు ఆవాసాలు మినహా అన్ని చోట్ల రోజూ మంచినీటిని అందిస్తున్నామని చెబుతున్న అధికారులు తమ మండలానికి రావాలని, ఎక్కడ రోజూ నీరు ఇస్తున్నారో చూపించాలని అధికార టీఆర్ఎస్ పార్టీ జడ్పీటీసీలు మూకుమ్మడిగా అధికారులపై విరుచుకుపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ఇస్తున్నట్లు చూపిస్తే తాము రాజీనామా చేస్తామని సవాల్ విసరడంతో అధికారులు నీళ్లు నమిలారు. శనివారం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన జడ్పీ సమావేశ మందిరంలో అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ, వ్యవసాయం, విద్య, వైద్యం, డీఆర్డీఏ శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది. మిషన్ భగీరథ అధికారులు మాట్లాడుతూ 494 ఆవాసాల 492 భగీరథ నీళ్లు అందిస్తున్నామని అన్నారు. దీనిపై జడ్పీటీసీలు మండిపడ్డారు. కాకిలెక్కలు చెబుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానకొండూరు జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, గన్నేరువరం జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, చిగురుమామిడి జడ్పీటీసీ గీకురు రవీందర్, హుజురాబాద్ జడ్పీటీసీ పి. బక్కారెడ్డి, కేశవపట్నం జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి అధికారుల తీరును తప్పుబట్టారు. తమ మండలంలో ఏ ఊర్లలో నీళ్ళు ఇస్తున్నారో చెప్పాలని, అది నిజమైతే తాము రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. దీంతో జడ్పీ చైర్పర్సన్ కె విజయ, సీఈవో ప్రియాంక జోక్యం చేసుకొని మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత మంది జడ్పీటీసీలు తమ మండలాల్లో మంచినీరు రావడం లేదని చెబుతుంటే మీరు ఎలా లెక్కలు చూపుతారని నిలదీశారు. ప్రశ్నించిన జడ్పీటీసీలతో కలిసి వారంరోజుల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో సభ్యులు శాంతించారు.
వైకుంఠధామాలు, పల్లె ప్రకృతివనాల్లో నీటి సౌకర్యం కల్పించండి
చొప్పదండి, కరీంనగర్ ఎంపీపీలు చిలుక రవీందర్, తిప్పర్తి లక్ష్మయ్య మాట్లాడుతూ. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలకు నీటి సౌకర్యం కల్పించక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్లు ఇవ్వాలని కోరారు. గ్రామ చివరన నిర్మించినందున నల్లా నీరు ఇవ్వని ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడు షుక్రుద్దీన్ మాట్లాడుతూ అధికారులు జవాబుదారిగా వ్యవహరించడం లేదని, ప్రగతి నివేదికలు సరిగా ఇవ్వకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
- కనుమల్ల విజయ, జడ్పీ చైర్పర్సన్
జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ మాట్లాడుతూ ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జిల్లా పరిషత్ ద్వారా అందిన నిధులు వాటి వినియోగం, గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలను ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకరు ఏర్పాటు చేసుకున్నామని, వాటి ద్వారా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ సీఈవో ప్రియాంక, డీఆర్డీవో శ్రీలత, డీఎంహెచ్‌వో జువేరియా, డీపీవో వీరబుచ్చయ్య, జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, డీఈవో జనార్దన్‌రావు, జడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.