ఆ రూ.5 లక్షలను ఏం చేశారు

ABN , First Publish Date - 2021-01-12T05:56:33+05:30 IST

వలస కార్మికుల రిలీఫ్‌ సెంటర్‌ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఆ రూ.5 లక్షలను ఏం చేశారు
వలస కార్మికులకు రిలీఫ్‌ సెంటర్‌గా ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాల

  1. రిలీఫ్‌ సెంటర్‌ నిధులు పక్కదారి


ప్యాపిలి, జనవరి 11: వలస కార్మికుల రిలీఫ్‌ సెంటర్‌ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్యాపిలి కేజీబీవీలో వలస కార్మికుల కోసం ప్రభుత్వం రిలీఫ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన దాదాపు వంద మంది వలస కార్మికులకు ఇక్కడ పునారావాసం కల్పించారు. 70 రోజులపాటు ఇక్కడే ఉన్నారు. ఈ సెంటర్‌ను దాతల సహకారంతో నడిపారు. రెవెన్యూ, పోలీస్‌, మండల పరిషత్‌, సంక్షేమశాఖ అధికారులు తమకు తెలిసిన దాతల నుంచి నిత్యావసర వస్తువులను సేకరించారు. వాటితో వలస కార్మికులకు భోజన వసతి కల్పించారు. ఆర్డీటీ వారు కూడా సాయం అందించారు. 


అసలు ఏం జరిగింది?

రిలీఫ్‌ సెంటర్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అధికారులు రూ.6 లక్షల వరకు బిల్లులను తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం రెండు విడతల్లో ఈ బిల్లులు మంజూరు చేసింది. మొదటి విడత అగస్టులో రూ.3.5 లక్షలు, రెండో విడత ఇటీవల రూ.2.5 లక్షలు మంజూరు చేసినట్లు సమాచారం. ఇందులో రూ.లక్ష వరకు డ్రాచేసి వంట మనుషులకు, గ్యాస్‌ ఏజెన్సీలకు, ఇతర ఖర్చులకు చెల్లించారని సమాచారం. మిగిలిన రూ.5 లక్షలు ఏమయ్యాయన్న ప్రశ్న వినిపిస్తోంది. దాతల సాయంతో కేంద్రాన్ని నడిపామని, ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ఏం చేశారని కొందరు అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కలెక్టరు దృష్టికి తీసుకుని వెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు. 


అక్రమాలు జరగలేదు

రిలీఫ్‌ సెంటర్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో అక్రమాలు జరగలేదు. సెంటర్‌ను దాతల సాయంతో నడిపినా, వివిధ శాఖల అధికారులు కొంత ఖర్చు పెట్టారు. మంజూరైన నిధులను డ్రాచేసి అధికారులకు ఇచ్చాం. నిధుల వినియోగానికి సంబంధించి బిల్లులు మా వద్దే ఉన్నాయి. ఎలాంటి విచారణ చేసినా ఇబ్బంది లేదు. - ఫజుల్‌ రెహమాన్‌, ప్యాపిలి ఎంపీడీవో 

Updated Date - 2021-01-12T05:56:33+05:30 IST