అయినా ఏదీ నిఘా?

ABN , First Publish Date - 2021-01-22T06:48:07+05:30 IST

జిల్లాలో పిఠాపురంలో విగ్రహాల ధ్వంసంతో మొదలైన విధ్వంసం అంత ర్వేదిలో రథం దగ్ధం వరకు కొనసాగింది.

అయినా ఏదీ నిఘా?

జిల్లాలో పలు ఆలయాల్లో కనిపించని సీసీ కెమెరాలు

భానుగుడి(కాకినాడ), జనవరి 21 : జిల్లాలో పిఠాపురంలో విగ్రహాల ధ్వంసంతో మొదలైన విధ్వంసం అంత ర్వేదిలో రథం దగ్ధం వరకు కొనసాగింది. తర్వాత కూడా పలు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం జరుగుతూనే ఉంది. రామతీర్థం ఘటనతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతోపాటు హిందూవాదులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. జిల్లావ్యాప్తంగా జరిగిన సంఘటనలపై కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ నిందితులు ఎక్కడా పట్టుబడలేదు. ఆయా సంఘటనల్లో సీసీ కెమెరాలు ఉంటే దోషులు తేలిగ్గా దొరికిపోయే వారన్న వాదన వినిపిస్తోంది. ఈ ఉదంతాల తర్వా త అయినా దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదు. జిల్లావ్యాప్తంగా దేవదాయశాఖ పరిధిలో 1,851 దేవాలయాలు ఉండగా మిగిలిన 4 వేల దేవాలయాలు ప్రైవేటుపరంగా కొనసాగుతున్నాయి. 6ఏ 39 దేవాలయాలు, 6బీలో 236 దేవాలయాలు, 6 సిలో 451 దేవాలయాలు ఉండగా.. తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలు 726 వర కు ఉన్నాయి. ఇక మొత్తం 1,851 దేవాలయాల్లోనూ 350 ప్రధాన దేవాలయా ల్లో మాత్రమే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. మిగిలిన 1500 దేవాలయాల్లోనూ సీసీ కెమెరాలు లేవు. అయితే వీటితోపాటు 4 వేల దేవాలయాలు దేవ దాయశాఖ పరిధిలో లేకపోయినా ఆయా ఆలయాల కమిటీ సభ్యులు తదితర వ్యక్తులు కూడా ఇప్పటి వరకూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. వీటితో పాటుగా క్రైస్తవ ప్రార్థన మందిరాలు పెద్దవి 150, మిగిలినవి 1000 క్రైస్తవ మందిరాలు మొత్తం 1150 క్రైస్తవ మందిరాలు ఉండగా, మసీదులు కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, మండపేట, జగ్గంపేట ఏరియాలతో కలిపి మొత్తం 36 మసీదులు ఉండగా వీటిని మత పెద్దలు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఎన్నింటికీ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటి పర్యవేక్షణ ఎలా ఉందనే దానిపై ఎలాంటి కసరత్తు జరగలేదు. 

పూర్తి రక్షణ చర్యలు చేపడుతున్నాం....

ఆలయాల్లో ఇప్పటివరకూ ఉన్న సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయనే విషయం పరిశీలించాం. మిగిలిన ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే ఆయా ఆలయాల్లో సీసీ కెమెరాలతో పాటుగా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామాల్లో సచివాలయ సిబ్బంది నుంచి ప్రతీ ఒక్కరినీ అనుసంధానం చేసి ఆలయాలకు పూర్తి రక్షణ చేపట్టడం జరుగుతుంది. - దేవదాయశాఖ డీసీ విజయరాజు

Updated Date - 2021-01-22T06:48:07+05:30 IST