పన్నులపై ఆడిట్‌ ఎటు పోయింది?

ABN , First Publish Date - 2022-05-24T10:02:01+05:30 IST

అప్పో రామచంద్రా అంటూ దిక్కులు చూస్తోంది..! అయినా ఇచ్చేవాడు దొరక్క ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది.

పన్నులపై ఆడిట్‌ ఎటు పోయింది?

  • 2018-19 నుంచి జీఎస్టీపై నిర్వహించనే లేదు.. 
  • 2016-17లోని మూడు నెలల వ్యాట్‌ గతీ అంతే
  • ఆడిట్‌ చేస్తే రాబడి పెరిగేందుకు అవకాశాలు!
  • ఎగవేతదారుల బండారం బయటపడుతుంది
  • ఆర్థిక సంక్షోభంలో ఖజానాకు కొంతైనా మేలు
  • కానీ వ్యాపారులు, ఉన్నతాధికారుల మిలాఖత్‌
  • ఆడిటింగ్‌కు సిబ్బందికి ఆదేశాలివ్వనిది అందుకే?

హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): అప్పో రామచంద్రా అంటూ దిక్కులు చూస్తోంది..! అయినా ఇచ్చేవాడు దొరక్క ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఎప్పటివో పన్ను బకాయిల వసూలుకు ‘వన్‌టైం సెటిల్‌మెంట్‌’ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచేసింది. రాబడి కోసం ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయా? అని కూడా అన్వేషిస్తోంది. కానీ, కళ్లెదుటున్న ఆదాయ అవకాశాన్ని విస్మరిస్తోంది. ఇదీ రాష్ట్ర సర్కారు తీరు. రాష్ట్రంలో వసూలయ్యే పన్నులపై ఏళ్ల తరబడి ఆడిటింగ్‌ నిర్వహించకుండా వాణిజ్య పన్నుల శాఖ ఉదాసీనత ప్రదర్శిస్తుండడంతో ఈ పరిస్థితి వస్తోంది.


జీఎస్టీ వచ్చినప్పటి నుంచి..

రాష్ట్రంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)పై ఆడిటింగ్‌ జరగడం లేదు. ఎగవేతదారుల విషయంలో క్షేత్ర స్థాయిలో ఆడిటింగ్‌ నిర్వహిస్తే గుట్టుమట్లు బయటపడతాయి. ముఖ్యంగా వ్యాట్‌, ఇతర పన్నుల నుంచి జీఎ్‌సటీకి మారిన సందర్భంలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. ఆడిటింగ్‌లో ఇవన్నీ దొరికే అవకాశముంది. తద్వారా ప్రభుత్వ ఖజానాకు కొంతైనా ఆదాయం పెరగవచ్చు. కానీ, ఉన్నతాధికారులు దృష్టిపెట్టడం లేదు. రాష్ట్రంలో జీఎ్‌సటీ కింద రిజిస్టర్‌ అయిన డీలర్లు ఐదు లక్షల వరకు ఉన్నారు. జీఎ్‌సటీ, వ్యాట్‌ చట్టాల ప్రకారం ఏటా ఆడిటింగ్‌ జరగాలి. సాధారణంగా డీలర్లు, వ్యాపారులు  నవంబరులో ఫైనల్‌ రిటర్నులు దాఖలు చేస్తుంటారు. స్టేట్‌ ట్యాక్స్‌ కమిషనరేట్‌ కింద ఉండే అసిస్టెంట్‌, డిప్యూటీ, జాయింట్‌ కమిషనర్లు ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వీటిపై ఆడిటింగ్‌ చేస్తుంటారు. అయితే, జీఎ్‌సటీ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఎలాంటి ఆడిటింగ్‌ జరగడం లేదని వాణిజ్య శాఖ వర్గాలు వివరించాయి.


మార్పు క్రమంలో భారీగా అక్రమ క్లెయిమ్‌లు

వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ (వ్యాట్‌) నుంచి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ)ను జీఎ్‌సటీకి మార్చుకునే క్రమంలో గతంలో ఎక్కువ మొత్తంలో క్లెయిమ్‌ చేశారని చెబుతున్నారు. వీటితోపాటు ఒక వ్యాపారి సంవత్సరం మొత్తంలో జరిపిన వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలు, రిజిస్టర్లను, బ్యాలెన్స్‌ షీట్లను ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది. జీఎ్‌సటీ నిబంధనల ప్రకారం ఒక వ్యాపారి స్వయంగా అన్ని వివరాలను పరిశీలించుకుని రిటర్నులు ఫైల్‌ చేయాలి. ఏవైనా అవకతవకలు జరిగి, పన్ను చెల్లింపుల్లో తేడాల అనుమానాలుంటే ఆడిటింగ్‌ నిర్వహించాలి. తక్కువ మొత్తంలో తేడాలుంటే వ్యాపారిని కార్యాలయానికి పిలిపించి, రికార్డులను పరిశీలించాలి. ఎక్కువ మొత్తం అయితే.. అధికారులు ఆ వ్యాపార సంస్థ వద్దకే వెళ్లి రిటర్నులు, పన్ను చెల్లింపు రసీదులు, అమ్మకాలు, కొనుగోళ్ల బిల్లులు, ఇన్వాయి్‌సలు, వే-బిల్లులు, ఐటీసీ క్లెయిమ్‌లను సరిచూడాలి. షోకాజ్‌ జారీ చేయాలి. ఎగవేసినట్లు తేలితే చర్యలు తీసుకోవాలి. పన్ను చెల్లించేవరకు నోటీసులు పంపించాలి. తద్వారా ఆదాయం పెరుగుతుంది. ఇదంతా క్షేత్ర స్థాయిలో జరగాలి. అయితే, జీఎ్‌సటీకి సంబంధించి ఇలాంటి క్షేత్ర స్థాయి ఆడిటింగ్‌ జరగడం లేదు. 


2017 జూలైకి ముందు వ్యాట్‌ రిటర్నులపైనా..

ఏదేని ఒక సంవత్సరంలో ఆడిటింగ్‌ జరగకపోతే.. నాలుగేళ్ల లోపు ఎప్పుడైనా నిర్వహించాల్సి ఉంటుంది. 2017-18 రిటర్నుల గడువును 2019 నవంబరు నాటికి పొడిగించినందున.. నాలుగేళ్ల గరిష్ఠ వ్యవధి మేరకు వచ్చే నవంబరులోపు ఆడిటింగ్‌ నిర్వహించాలి. అయితే, ఈ ఒక్క సంవత్సరం రిటర్నులనే కాదు.. ఆ తర్వాతి సంవత్సరాల రిటర్నులపైనా ఆడిటింగ్‌ లేదని వాణిజ్య పన్నుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి. ఇక జీఎ్‌సటీ అమల్లోకి వచ్చే ముందు.. అంటే 2017 ఏప్రిల్‌, మే, జూన్‌కు సంబంధించిన వ్యాట్‌ రిటర్నులపైనా ఆడిటింగ్‌ జరగలేదు. ఈ పరిస్థితి తెలంగాణలోనే నెలకొందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా జీఎస్‌టీపై ఆడిటింగ్‌ నిర్వహిస్తోంది. పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాలు కూడా ఏటా ఆడిటింగ్‌ చేస్తున్నాయి. ఇక్కడే ఎందుకు చేయడం లేదన్న సందేహాలున్నాయి.

 

అక్రమాలు బయటపడతాయనే...

అక్రమాలు, అవకతవకలు బయటపడతాయనే కారణంతోనే ఆడిటింగ్‌ జరగకుండా కొంతమంది ఉన్నతాధికారులు అడ్డుకుంటున్నట్లు తెలిసింది. వ్యాట్‌ నుంచి జీఎ్‌సటీకి మారినప్పుడు పెద్దమొత్తంలో క్లెయిమ్‌ చేసిన ఐటీసీ బయటపడకుండా డీలర్లు కొంతమంది ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే ఆడిట్‌ చేయాలంటూ కిందిస్థాయి అధికారులకు వారు ఆదేశాలివ్వడం లేదని తెలిసింది.

Updated Date - 2022-05-24T10:02:01+05:30 IST