ఆయిల్‌పామ్‌ సాగుకు చోటేది?

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనరేట్‌ కార్యాలయం రూపొందించిన వార్షిక ప్రణాళికలో ఆయిల్‌పామ్‌ సాగులో మెదక్‌ జిల్లాకు చోటు లభించలేదు

ఆయిల్‌పామ్‌ సాగుకు చోటేది?
నిజాంపేటలో ఆయిల్‌పాం మొక్కలను పరిశీలిస్తున్న అధికారులు (ఫైల్‌)

ఉద్యాన శాఖ యాక్షన్‌ప్లాన్‌లో మెదక్‌ జిల్లాకు మొండిచేయి


మెదక్‌, మే 20 : రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనరేట్‌ కార్యాలయం రూపొందించిన వార్షిక ప్రణాళికలో ఆయిల్‌పామ్‌ సాగులో మెదక్‌ జిల్లాకు చోటు లభించలేదు. ఒక్కో జిల్లాలో కొంత మేర ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేయాలని ప్రభుత్వం భావించగా మెదక్‌ జిల్లాను మాత్రం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ తోటలకు పలు రకాల రాయితీలు, సబ్సిడీలు అందిస్తున్నారు. సబ్సిడీ ధరలతో మొక్కలను పంపిణీ చేయడంతో పాటు ఎరువులను కూడా ఇస్తుంది. డ్రిప్‌ ఇరిగేషన్‌ కోసం హెక్టార్‌ భూమికి రూ.53,465 సబ్సిడీని అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, బీసీ, చిన్నకారు రైతులకు 90 శాతం, ఓసీలకు 80 శాతం సబ్సిడీని అందిస్తున్నారు. 

జిల్లాలో పర్యటించిన ఆయిల్‌ ఫెడ్‌ బృందం 

గత ఫిబ్రవరిలో కేంద్ర ఆయిల్‌ ఫెడరేషన్‌ బృందం మెదక్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించింది. మెదక్‌, నర్సాపూర్‌, రామాయంపేట, శివ్వంపేట, చేగుంట, నిజాంపేట తదితర ప్రాంతాల్లో తిరిగి రైతులతో సంభాషిస్తూ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. నిజాంపేట మండలంలో ఓ రైతు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేకపోయినా 20 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ తోటలను సాగు చేశాడు. ఈ విషయాన్ని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారులు సైతం ఆయిల్‌ ఫెడ్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వాతావరణంలో తేమ 80శాతం ఉంటేనే ఆయిల్‌పాం తోటలకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మెదక్‌ జిల్లాలో హల్దీ ప్రాజెక్టు, సింగూర్‌ ప్రాజెక్టులలో నీరు సమృద్ధిగా ఉండడంతో వీటి పరీవాహక ప్రాంతంలో ఆయిల్‌పామ్‌ పంటను సాగు చేయొచ్చని అధికారులు నివేదించారు. కానీ జిల్లాను మాత్రం పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేయలేదు. 

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST