Hyderabad లో ట్విన్‌ టవర్స్‌ ఎక్కడ.. ఊసేలేదేం..!?

ABN , First Publish Date - 2021-10-26T13:02:11+05:30 IST

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ట్విన్‌ టవర్స్‌...

Hyderabad లో ట్విన్‌ టవర్స్‌ ఎక్కడ.. ఊసేలేదేం..!?

హైదరాబాద్‌ సిటీ : ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి ట్విన్‌ టవర్స్‌ నిర్మాణ పనుల అడుగులు ముందుకు పడడం లేదు. దాదాపు పదేళ్లుగా కొత్త భవనాల నిర్మాణాలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉస్మానియాలో ట్విన్‌ టవర్స్‌ నిర్మించాలని నిర్ణయించినప్పటికీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. ఆస్పత్రి ప్రాంగణంలో ప్రస్తుతం మూడు భవనాలు ఉన్నాయి. పాతభవనం శిథిలం కావడంతో దానికి తాళం వేశారు. మిగిలిన రెండు భవనాలలో రోగులను సర్దుబాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఓపీ భవనం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.


పనులు మొదలైనా...

హెరిటేజ్‌ నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మూడు భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ట్విన్‌ టవర్స్‌ నిర్మించాలని భావించింది. అందుకు తగిన ప్రణాళిక, మ్యాప్‌ను కూడా సిద్ధం చేసింది. మూడేళ్లలో కొత్త భవనాలను నిర్మించి రోగుల సేవలకు అందించాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌లో నలు వైపులా నాలుగు కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి పనులు మొదలైనా.. ఉస్మానియా ట్విన్‌ టవర్స్‌ ప్రకటన మాత్రం కార్యరూపలం దాల్చడంలేదు.


నిధులు మంజూరైనా..

ఏడెకరాల్లో కొత్త భవనాల నిర్మాణాలకు దాదాపు రూ. రెండు కోట్ల నిధులు మంజూరైనప్పటికీ పనులు మొదలు కాలేదు. కొత్త భవనాల నిర్మాణాల కోసం తవ్వకాలు, పనుల సమయంలో పాత కట్టడానికి నష్టం జరగవచ్చుననే అభిప్రాయం హెరిటేజ్‌ బృందం వ్యక్తం చేసింది. కొత్త భవనాల నిర్మాణాలు రెండు అంతస్తుల కంటే ఎక్కువ చేయడానికి అవకాశం లేదనే వాదనలతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. 

Updated Date - 2021-10-26T13:02:11+05:30 IST