బుక్స్‌ ఎక్కడ.. నేటికీ పాఠశాలలకు చేరలేదేం..!

ABN , First Publish Date - 2021-06-21T17:29:57+05:30 IST

ఆన్‌లైన్‌ క్లాసులైనా, ప్రత్యక్షంగా పాఠాలు వినాల్సి వచ్చినా విద్యార్థులకు పుస్తకాలు కావాల్సిందే.

బుక్స్‌ ఎక్కడ.. నేటికీ పాఠశాలలకు చేరలేదేం..!

  • రూపొందించని ఆన్‌లైన్‌ క్లాసుల షెడ్యూల్‌
  • ఆందోళనకు గురవుతున్న సర్కారు స్కూళ్ల విద్యార్థులు
  • గతేడాది జూన్‌ మొదటి వారంలో పంపిణీ 
  • పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు


హైదరాబాద్‌ సిటీ : అధికారుల పట్టింపులేనితనం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శాపంగా మారుతోంది. పాఠ్య పుస్తకాల పంపిణీ బాధ్యతను వదిలేయడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌ క్లాసులైనా, ప్రత్యక్షంగా పాఠాలు వినాల్సి వచ్చినా విద్యార్థులకు పుస్తకాలు కావాల్సిందే. ఆన్‌లైన్‌ క్లాసులైతే టీ-శాట్‌, దూరదర్శన్‌ షెడ్యూల్‌ రూపొందించకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. జిల్లాలోని 16 మండలాల పరిధిలో మొత్తం 689 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. 2019-20 యూడైస్‌ లెక్కల ప్రకారం ఆయా స్కూళ్లలో 1 నుంచి 10 తరగతుల వరకు 99,035 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం 92,488 మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిసింది.


తరలింపులో జాప్యం

ఏటా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలను జూన్‌ 12 (స్కూల్స్‌ తెరిచే) లోపు అందుబాటులో ఉంచుతుంటారు. ఏప్రిల్‌లోనే జిల్లా అధికారులు తరగతుల వారీగా ఇండెంట్‌ రూపొందించి విద్యాశాఖకు పంపి, మే చివరి లోగా గోదాముల నుంచి ఆయా పాఠశాలలకు పుస్తకాలను తరలిస్తుంటారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉండగా, నేటికీ మూతపడి ఉన్నాయి. అయినప్పటికీ పుస్తకాలు పాఠశాలలకు తేవడానికి ఇబ్బందులు లేవు. కానీ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలోని రామంతాపూర్‌ గోదాంకు ఇప్పటి వరకు 60 శాతం పుస్తకాలు రాగా, వాటిని తరలించడంలోనూ ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా పుస్తకాలను అందించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.



Updated Date - 2021-06-21T17:29:57+05:30 IST