ఎక్కడ వేసిన ఇల్లు అక్కడే !

ABN , First Publish Date - 2022-07-05T06:45:01+05:30 IST

ఎక్కడ వేసిన ఇల్లు అక్కడే !

ఎక్కడ వేసిన ఇల్లు అక్కడే !
పిల్లర్స్‌ దశలో ఉన్న డబల్‌ బెడ్‌రూం ఇళ్లు

భద్రాద్రి జిల్లాలో పడకేసిన ‘డబుల్‌బెడ్‌రూం’ పథకం

మంజూరైనవి 6,443.. పూర్తయినవి 1,445

పూర్తయిన వాటిని లబ్ధిదారులకు పంచని వైనం 

కొత్తగూడెం కలెక్టరేట్‌, జూలై 4: పేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పడకేసింది. ఈ పథకం ప్రారంభించి ఏడేళ్లు కావొస్తున్నా జిల్లాలో ఎక్కడా ఈ పథకం పనులు సాగుతున్న జాడ కనిపించలేదు. జిల్లాకు మొదటి, రెండో దఫాలో 6,443 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు కేవలం 1,445మందికి మాత్రమే సొంతఇల్లు సమకూరిందంటే   ఈ పథకం అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా పూర్తికాలేదంటే ఈ పథకంపై ఇక్కడి ప్రజాప్రతినిధులు, అధికారుల చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ట్రైబల్‌ వెల్పేర్‌ ఆధ్వర్యంలో 4,643 ఇళ్లు, పంచాయితీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో 1800 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు 1445 ఇళ్లు పూర్తయి లబ్ధిదారులకు అప్పగించారు. 968 ఇళ్లు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆధ్వర్యంలో నిర్మించినవి, 126ఇళ్లు పంచాయితీరాజ్‌ ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లు మొత్తం 1,094 పూర్తికాగా వాటిని లబ్ధిదారులకు అప్పగించాల్సి ఉంది. జిల్లాలో నాలుగు ఎస్టీ రిజ్వర్డ్‌ నియోజకవర్గాల్లో అక్కడక్కడా రెండు పడకల గదుల ఇళ్లు కనిపిస్తున్నా జనరల్‌ నియోజకవర్గమైన కొత్తగూడెంలో మొండి గోడలు, అసంపూర్తి స్లాబ్‌లే దర్శనమిస్తుండడంతో లబ్ధిదారులు తీవ్ర అసంతృప్త్తితో ఉన్నారు. పాలకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎన్నికల హామీని నెరవేర్చడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యపడుతున్నారు.  


6,443 ఇళ్లకు అనుమతి..

ప్రభుత్వం ఏడేళ్ల కాలంలో జిల్లాకు మొత్తం 6,443 ఇళ్లను మంజూరు చేసింది. కానీ వాటిలో ఇప్పటి వరకు కేవలం 1,445ఇళ్లు మాత్రమే పూర్తిచేసినట్లు అధికారిక లెక్కలు చూపుతున్నాయి.   నిర్మించిన ఇళ్లు కూడా ఊరికి దూరంగా రెండు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్మించడంతో ఆయా ఇళ్లలోకి వెళ్లేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.  


రెవెన్యూ డివిజన్ల వారీగా.. 

కొత్తగూడెం డివిజనలో మొత్తం 1,800ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 1,605ఇళ్లను అడ్మినిస్ర్టేషన శాంక్షన వచ్చింది. 1,459 ఇళ్ల నిర్మాణానికి టెండర్‌లు పిలిచారు. వాటిలో 126 ఇళ్లు పూర్తయ్యాయి. 1,333 నిర్మాణంలో ఉన్నాయి. 150 మంది లబ్ధిదారుల ఎంపిక జరిగింది. భద్రాచలం రెవెన్యూ డివిజనలో మొత్తం 4,643 మంజూరు చేశారు. 4,563ఇళ్లకు అనుమతిరాగా 4,167ఇళ్లకు టెండర్‌ పిలిచారు. వాటిలో 2413 పూర్తయ్యాయి. 1,366 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటి వరకు 110 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. పినపాక నియోజకవర్గం పరిధిలోని మారుమూల గిరిజన మండలమైన గుండాలకు 80ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు 40ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 40ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన యాపలగడ్డ వద్ద 40 ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి మూడేళ్లయినా వాటిని నేటికీ లబ్ధిదారులకు స్వాధీనం చేయలేదు. దీంతో ఆయా ఇళ్ల శిథిలమైపోతున్నాయి.  


అప్పగించట్లేదని ఆక్రమించారు

అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని ములకలపల్లి మండలానికి 280ఇళ్లు మంజూరు చేశారు. పాతగంగారం గ్రామంలో 20ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి మూడేళ్లయింది. అయినా వాటిని పంపిణీ చేయకపోవడంతో ఎంపికైన లబ్ధిదారులు నెలరోజుల క్రితం వాటిని ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారు. ఇళ్లు పూర్తయినా సౌకార్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇళ్లమధ్య రోడ్లు లేవు. డ్రైనేజీలు నిర్మించలేదు. తలుపులు, కిటికీలు నాసిరకంగా ఉన్నాయి. బాత్రూంనీళ్లు పోవడానికి సరైనమార్గం ఏర్పాటు చేయలేదు. టాయిలెట్స్‌కు వరలు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రజలు బహిర్బూమికి ఆరుబైటకు వెళ్లాల్సి వస్తోంది.

Updated Date - 2022-07-05T06:45:01+05:30 IST