రెండు నిముషాల్లో తయారయ్యే మ్యాగీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-22T17:31:15+05:30 IST

రెండు నిమిషాల్లో తయారయ్య వంటకం..

రెండు నిముషాల్లో తయారయ్యే మ్యాగీకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

రెండు నిమిషాల్లో తయారయ్య వంటకం అనగానే మ్యాగీ పేరు గుర్తుకొస్తుంది. ఈ పసుపు రంగు మ్యాగీ ప్యాకెట్లు ప్రతి ఇంటి వంటగదిలో కనిపిస్తాయి. హాస్టళ్లలో నివసించే విద్యార్థుల ఇష్టమైన ఆహారంగా మ్యాగీ మారిపోయింది. ఆహారం వండడం తెలియని వారు కూడా మ్యాగీని ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకుని కడుపు నింపుకుంటుంటారు. అయితే గతంలో మ్యాగీ పలు వివాదాల్లో చిక్కుకుని నిషేధానికి గురైంది. వాటి నుంచి బయటపడిన మ్యాగీ కోట్లాది మంది ప్రజల ఇష్టమైన ఆహారంగా నిలిచింది. అయితే మ్యాగీ ప్యాకెట్‌ చూసినప్పుడు దానికి మ్యాగీ అనే పేరు ఎందుకు వచ్చిందనే ప్రశ్న మన మదిలో తలెత్తుతుంది. ‘టేస్టీ అండ్ హెల్దీ’ అనే పంచ్ లైన్‌తో, మ్యాగీ భారతీయ మార్కెట్లోకి 1983 సంవత్సరంలో ప్రవేశించింది. దీనిని నెస్లే ఇండియా లిమిటెడ్ లాంచ్ చేసింది. నిమిషాల్లో తయారయ్యే మ్యాగీ అందరికీ నచ్చింది. దీనిని లాంచ్ చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత.. దీనిలో మసాలాలు, చికెన్, టొమాటో యాడ్ చేస్తూ మరిన్ని మ్యాగీ రకాలు మార్కెట్లోకి వచ్చాయి.


1884 సంవత్సరంలో, స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తి పిండితో తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించడం ప్రారంభించాడు. అయితే అతని వ్యాపారం అంతగా సాగలేదు. దీంతో అతను ఆ పనిని మానివేసి, నూతన ఉత్పత్తి ఏదైనా చేయాలనుకున్నాడు. అతను త్వరగా ఉడికించగలిగే ఆహార పదార్థాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని పేరే జూలియస్ మైఖేల్ జోహన్నెస్ మ్యాగీ. తన నూతన ఉత్పత్తులకు అతను ‘మ్యాగీ’ అని పేరు పెట్టాడు. ప్రారంభంలో ప్రోటీన్-రిచ్ ఫుడ్, రెడీమేడ్ సూప్‌లను తయారు చేశాడు. అయితే అతని స్నేహితుడు ఫ్రిడోలిన్ షులర్ ఈ పనిలో అతనికి చాలా సహాయం చేశాడు. ఈ నేపధ్యంలోనే వచ్చిన రెండు నిమిషాల్లో తయారయ్యే మ్యాగీని చాలమంది ఇష్టపడ్డారు. మ్యాగీ నూడుల్స్‌ను తొలిసారిగా 1897లో జర్మనీలో ప్రవేశపెట్టారు. 1912 నాటికి, అమెరికా, ఫ్రాన్స్ వంటి అనేక దేశాలకు చెందినవారు మ్యాగీని ఇష్టపడటం ప్రారంభించారు. అయితే అదే సంవత్సరంలో జూలియస్ మ్యాగీ మరణించాడు. అతని మరణంతో వ్యాపారం చాలా కాలం పాటు నెమ్మదిగా కొనసాగింది. 1947లో నెస్లే కంపెనీ మ్యాగీని కొనుగోలు చేసింది. దాని బ్రాండింగ్‌కు మరింత ప్రచారం తీసుకువచ్చి.. దానిని ప్రతీ ఇంటి వంటగదిలో భాగంగా చేసింది. 



Updated Date - 2022-01-22T17:31:15+05:30 IST