ఆ వయసు వారు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

ABN , First Publish Date - 2021-04-23T18:39:09+05:30 IST

వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో జరిగే పలురకాల మార్పుల్లో జీవక్రియల వేగం తగ్గడం, జీర్ణశక్తి లోపించడం, ఆహారాన్ని శోషించుకునే శక్తి కోల్పోవడం లాంటివి నెమ్మదిగా జరుగుతాయి. వీటితో పాటు వాసన, రుచి గ్రహించే శక్తి కూడా కొంత తగ్గుతుంది.

ఆ వయసు వారు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి?

ఆంధ్రజ్యోతి(23-04-2021)

ప్రశ్న: అరవయ్యేళ్లు దాటిన వారు ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?


- అనంత లక్ష్మి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో జరిగే పలురకాల మార్పుల్లో జీవక్రియల వేగం తగ్గడం, జీర్ణశక్తి లోపించడం, ఆహారాన్ని శోషించుకునే శక్తి కోల్పోవడం లాంటివి నెమ్మదిగా జరుగుతాయి. వీటితో పాటు వాసన, రుచి గ్రహించే శక్తి కూడా కొంత తగ్గుతుంది. అందువల్ల ఆహారంలోనేగాక జీవన విధానంలోనూ కొన్ని రకాల మార్పులు చేసుకుంటే నీరసం తగి,్గ శక్తి పెరుగుతుంది. రోజువారీ ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువగా తినకుండా, మూడు గంటలకోసారి కొద్ది మొత్తంలో ఆహారం తీసుకోవచ్చు. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయ ఆరోగ్యం బాగుంటుంది. వారంలో మూడు రోజులైనా ఆకుకూరలు తీసుకోవాలి. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి. ఉదయం, సాయంత్రం కూడా నడక, యోగా లాంటివి చేస్తే మంచిది. వయసు పెరిగే కొద్దీ కండరాల పటుత్వం తగ్గుతుంది. దీనిని నివారించడానికి ప్రొటీన్లు బాగా తీసుకోవాలి. గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు లాంటివి తీసుకోవచ్చు. శాకాహారులైతే పనీర్‌, సోయా, అన్ని రకాల పప్పుధాన్యాలు తీసుకోవాలి. జ్ఞాపకశక్తిని, మెదడు పని తీరుని కాపాడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న చేపలు, అవిసె గింజలు, ఆక్రోట్‌ గింజలు లాంటివన్నీ రోజూ తీసుకుంటే మంచిది. తగినంత నిద్ర కూడా అవసరమే. పోషకాహారం, మెరుగైన జీవన విధానం పాటించడంతో పాటు ఏవైనా విటమిన్‌ లోపాలు ఉంటే  వైద్యుల సలహాతో సప్లిమెంట్లను వాడవచ్చు. అయితే సొంత వైద్యం వద్దు.

 

డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2021-04-23T18:39:09+05:30 IST