
ఆంధ్రజ్యోతి(25-03-2022)
ప్రశ్న: మా మనవరాలికి నాలుగేళ్లు. సన్నగా ఉంది. ఆరోగ్యంగా, బలంగా పెరగాలంటే ఎటువంటి ఆహారం ఇవ్వాలి?
- మహాదేవరావ్, విశాఖపట్నం
డాక్టర్ సమాధానం: పిల్లల ఎదుగుదల సవ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం అత్యవసరం. పిల్లలకు మనం చిన్నతనం నుండి చేసే ఆహారపు అలవాట్ల వల్ల వారు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు. బరువు పెరిగేందుకు మాములుగా ఇచ్చే ఆహారంతో పాటు బాదం, జీడిపప్పు, పుచ్చగింజలు మొదలైనవి పొడిచేసి చపాతీ పిండిలో కలిపి వాటితో చపాతీ, పరాఠాల లాంటివి చేసి ఇవ్వండి. పాలల్లో శక్తి నిచ్చే పొడులు కలపవచ్చు. ఎలాంటివి కలపాలో వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. వెన్న ఎక్కువగా ఉన్న పాలు, మీగడ తీయని పెరుగు కూడా పెట్టవచ్చు. మాంసాహారులైతే రోజు ఒక గుడ్డు, వారానికి రెండు సార్లు ఏదైనా మాంసాహారం కూడా పెట్టవచ్చు. ఆకలి సరిగా లేకపోవడం వల్ల తినడం లేదని అనిపిస్తే వైద్యుల సలహా మేరకు ఆకలికి మందులు వాడవచ్చు. భోజన సమయానికి రెండు గంటల ముందు పాలు, వేయించిన చిరుతిళ్ళు వంటివి పెట్టకూడదు. ఇంట్లో తయారు చేసిన నువ్వులు, బెల్లం ఉండలు, మినప, సున్ని ఉండలు, ఉడికించిన సెనగలు మొదలైనవి రోజులో ఓసారి ఇవ్వవచ్చు. ఖర్జ్జూరాలు, ఎండుద్రాక్ష, అన్ని రకాల గింజలు, పాలలో నానబెట్టి గ్రైండ్ చేసి మిల్క్ షేక్ లాగ ఇవ్వడం ద్వారా కూడా బరువు పెరిగేందుకు అవసరమైన క్యాలరీలను అందించవచ్చు. ఆకలి సరిగా వేసేందుకు, తిన్న ఆహారం సక్రమంగా వంటబట్టేందుకు రోజుకు కనీసం రెండు గంటలైనా ఆటలాడడం మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను
[email protected]కు పంపవచ్చు)