ఏది మంచో ఏది కాదో తెలంగాణకు తెలుసు!

ABN , First Publish Date - 2022-05-05T10:02:36+05:30 IST

తెలంగాణాది ప్రత్యేక అస్తిత్వం. భిన్న ఆలోచనా ధోరణలు ఇక్కడ సంగమిస్తాయి. విభిన్న రాజకీయ, తాత్విక చింతనలు ఇక్కడ చిగురిస్తాయి. సగటు మనిషే వీటిని నిలబడెతాడు. పడగొడతాడు. పట్టించుకోకపోవడం అనేది ఉండదు....

ఏది మంచో ఏది కాదో తెలంగాణకు తెలుసు!

తెలంగాణాది ప్రత్యేక అస్తిత్వం. భిన్న ఆలోచనా ధోరణలు ఇక్కడ సంగమిస్తాయి. విభిన్న రాజకీయ, తాత్విక చింతనలు ఇక్కడ చిగురిస్తాయి. సగటు మనిషే వీటిని నిలబడెతాడు. పడగొడతాడు. పట్టించుకోకపోవడం అనేది ఉండదు. ఆయా ఆలోచనా ధారల సత్తువను బట్టి వాటి ఉనికి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో విభిన్న రాజకీయ ఆలోచనలు పారుతున్నాయి. ఇంతకు ముందు లేని నినాదాలు వినిపిస్తున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు ఉన్న రాజకీయ ఆలోచనలు వేరు. ఇప్పడు పరిస్థితి వేరు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఆలోచనల కాలం 1920ల నుంచి 2000 సంవత్సరం వరకు కొనసాగింది. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభావం తెలుగు సమాజంపై ఉన్నది. 2001 నుంచి తెలంగాణ తన స్వీయ అస్తిత్వం కోసం సరికొత్త భావజాలాన్ని తెరపైకి తెచ్చింది. బలమైన సాంస్కృతిక వారధిని ఏర్పాటు చేసుకున్నది. భావజాలాన్ని సగటు మనిషి దాకా తీసుకెళ్లింది. దీనికి భూమిక టీఆర్ఎస్. ఆయా సందర్భాల్లో ఆయా రాజకీయ ఆలోచనలు బలంగా వచ్చి నిలబ్డడాయి. కొన్ని దిక్సూచిలా మారాయి. కాల పరీక్షకు తట్టుకోలేనప్పుడు నిలిచిపోయాయి.


ఇంకాస్త వెనుకటి చరిత్రలోకి వెళ్తే మరిన్ని విషయాలు అర్థం అవుతాయి. దక్కన్ పీఠభూమిలో జైనం, ఆ తర్వాత వచ్చిన బౌద్ధం గత కాలపు సామాజిక మలినాలను తుడిచి వేయగలిగాయి. పాట, మాట, ఆచరణ ద్వారా, సగటు మనిషి కేంద్రంగానే ఈ రెండూ పని చేశాయి. ఆ తర్వాత క్రీ.శ.11 శతాబ్దంలో బసవేశ్వరుని విజ్ఞాన ప్రసరణ తెలంగాణలో జరిగింది. ఈ తాత్విక ఆలోచనల పరంపర తెలంగాణను బాగా ప్రభావితం చేసింది. అందుకే ఇక్కడ పాల్కుర్కి సోమనాథుడు ప్రశ్నించే కవిగా ఆవిర్భవించాడు. తన సాహిత్యం ద్వారా సరికొత్త ఆలోచనను ఉత్పత్తి చేశాడు. ఇవన్నీ అటు తర్వాత దక్కన్‌లో సంభవించిన చాలా మార్పులకు భూమికను ఇచ్చాయి. ఈ తాత్విక చింతనలే పలు రూపాల్లో వ్యక్తం అయ్యాయి. వీటన్నింటిలోనూ అంతర్లీనంగా బలంగా ఉన్నది సమాజ ఏకోన్ముక ఆకాంక్ష.


ప్రస్తుతం తెలంగాణలో విభిన్న రాజకీయ ఆలోచనాపరులు తమ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. రాజ్యాధికార యాత్ర పేరుతో బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ యాత్ర చేస్తున్నారు. మరో వైపు భారత రాజ్యాంగాన్ని పట్టుకుని డిఎస్పీ ఆధ్వర్యంలో విశారదన్ పాద యాత్ర చేస్తున్నారు. ఈ యాత్రలన్నీ తామే అధికారంలోకి వస్తామని, సగటు మనిషే తమ కేంద్రమని అంటున్నాయి. హిందువులంతా ఒక్కటేనని బీజేపీ అంటున్నది. బహుజనులకే అధికారం అంటున్నారు బహుజనవాదులు. ఈ ఆలోచనాధారలన్నీ పల్లెల్లో ప్రవహిస్తున్నాయి. జనం కూడా వినీవిననట్లే కన్పిస్తున్నారు. సహజంగానే రాజకీయ పార్టీల సభలకు, యాత్రలకు జనాలు వస్తారు పోతారు. కానీ ఇక్కడ సాగుతున్నవి విభిన్నమైన ఆలోచనా స్రవంతులు. బయటికి వీటి రూపం, సారం స్పష్టంగా కన్పించక పోవచ్చు. కానీ ప్రభావాలు లేకుండా పోవు. ఒక్కప్పుడు మార్క్స్, లెనిన్, మావో పేర్లను, నినాదాలను పులుముకున్న పల్లెటూళ్ల గోడల నేడు ఫూలే, అంబేద్కర్‌ల ఆలోచనా విధానం వర్ధిల్లాలని నినదిస్తున్నాయి. బీజేపీ, మోదీల పోస్టర్లూ దర్శనమిస్తున్నాయి. దేశం, దేశభక్తి, రాజ్యాంగం, వాటి రక్షకులం తామేనంటున్నాయి.


అంతే కాదు, ఎనిమిదేళ్ల కింద తెలంగాణనే ఓ సాంస్కృతిక శిబిరం అయినట్లు ఇప్పుడు బహుజన రాజకీయ ఆలోచనా పరులూ ధూంధాంలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో ఇటీవల బహుజన ధూంధాం నిర్వహించారు. 1990ల కంటే ఇప్పుడు బహుజన స్వరం భిన్న మార్గాల్లో విన్పిస్తున్నది. ఈ వేదిక పైకి గద్దర్, విమలక్క రావడమే దీనికి ఉదాహరణ అని నిర్వాహకులు అన్నారు. విప్లవ రాజకీయ శిబిరాన్ని దాటి బహుజన రాజకీయమే అసలైందని అందరూ గుర్తిస్తున్నారనేది వీరి వాదన.


ఈ విభిన్న భావజాలాల్లో బీజేపీకి సాంస్కృతిక వారధి లేదు. ఉత్పత్తి కులాల ప్రజల ఆట, పాట, మాటను తన రాజకీయ ఆలోచనా ధోరణిలోకి మార్చుకోవడంలో ఆ పార్టీ ఇంకా వెనుకబడే ఉంది. అయితే భావవ్యాప్తి చేసుకుంటూ పోవడంలో మాత్రం ఓ అడుగు ముందే ఉన్నది. ఇక టీఆర్ఎస్ అటు భక్తినీ ఇటు తమ ప్రత్యేక ఉద్యమ వారసత్వాన్నీ నమ్ముకున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ పాత ఆలోచనలతో అట్లాగే ముందుకు వెళ్తున్నది.


ఇట్లా విభిన్న రాజకీయ విధానాలను ప్రజల ముందు పెడుతున్న వారందరినీ ప్రజలు నమ్మవచ్చు, నమ్మకపోనూవచ్చు. ఎందుకంటే వెయ్యేళ్ల నుంచి తెలంగాణ నిరంతరం ఏదో రాజకీయ, తాత్విక సంఘర్షణకు వేదిక అవుతూనే ఉన్నది. ఎన్ని సరికొత్త రాజకీయ ఆలోచనా రీతులు వచ్చినా షరతులు వర్తిస్తాయనే వాతావరణం కూడా ఇక్కడ ఉన్నది. మునుపెన్నడూ లేని కొన్ని అంశాలు ఏడున్నరేళ్ల కాలంలో తెలంగాణ ప్రజల అనుభవంలోకి వచ్చాయి. కాబట్టి ఆ మేరకు దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అయితే తమ భావజాలం విజయవంతం చేసుకోవాలంటే సగటు మనిషే దాన్ని ఆదరించాలి. తమకు ఏది మంచిదో కాస్త కష్టం అయినా తెలంగాణ సులభంగానే గుర్తిస్తుంది. ఎందుకంటే ఇది వీరశైవుల నేల. అయితే ‘ఏదీ శాశ్వతం కాదు... ప్రతిదీ మారుతూ ఉంటుంది’ అనే బుద్ధుని మాటను అందరూ గుర్తుంచుకోవాలి.

గోర్ల బుచ్చన్న

సీనియర్ జర్నలిస్ట్

Read more