ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆ ఊర్లకు దారేది?

ABN , First Publish Date - 2021-04-24T04:45:06+05:30 IST

జిల్లాలోని ఏజెన్సీలో వందలాది గ్రామాలకు రోడ్డు సౌకర్యం తీరని కలగా మిగులుతోంది.

ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆ ఊర్లకు దారేది?
పెంచికల్‌పేట మండలం మురలిగూడ రోడ్డు

ఏజెన్సీలో ఇంకా రోడ్డుకు నోచుకోని 398 ఆవాసాలు

గిరిజన గూడాలకు ఇప్పటికీ డొంకదారులే దిక్కు

నేటికీ కార్యరూపం దాల్చని నిర్మాణ ప్రతిపాదనలు 

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఏజెన్సీలో వందలాది గ్రామాలకు రోడ్డు సౌకర్యం తీరని కలగా మిగులుతోంది. వర్షాకాలం వచ్చిందంటే గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. వర్షాకాలం వాగులు, వంకలతో రోడ్లన్నీ జలమయమై ప్రత్యక్ష నరకాన్ని చూపించడం ఇక్కడ సర్వసాధారణం. దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ రోడ్డు ఆనవాళ్లు లేని ఆవాసాలు అనేకమున్నాయి. కనీసం కాలినడకనైనా వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో జిల్లాలో ఏజెన్సీవాసులు రోజువారి అవసరాల నిమిత్తం సమీప పట్టణాలకు వెళ్లేందుకు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఏయేటికాయేడు రోడ్ల నిర్మాణం కోసం కార్యాచరణ ప్రణాళికలు తయారుచేస్తున్నా ఆచరణకు వచ్చేసరికి నిధుల కొరత అడ్డంకిగా మారుతోందని  అధికారులు చెబుతున్నారు. ఫలితంగా జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 398ఆవాసాల(గూడెంలు)కు కనీసం రోడ్ల ఆనవాళ్లే లేని పరిస్థితులు ఉన్నాయి. 442 రెవెన్యూ, గ్రామాల్లో పక్కా రోడ్లను నిర్మించాల్సిన అవసరముందని చెబుతున్నారు. ఇటీవలి రాష్ట్ర బడ్జెట్‌లోనైనా గ్రామీణ రహదారుల నిర్మాణానికి నిధులు ఇస్తుందని ఆశిస్తే కేవలం అత్తెసరు నిధులతో సరిపెట్టిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జిల్లాలో ఇదీ రోడ్ల దుస్థితి..

జిల్లాకు సంబంధించి సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికీ 126గ్రామాలకు కాలినడకనైనా వెళ్లే పరిస్థితి లేదు. ఈ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల పరిధిలో సుమారు 300 కిలో మీటర్ల వరకు ఇప్పటికీ గుంతలు, బురదమయమైన మట్టి రోడ్లపైనే ప్రయణించాలి. ఆయా రోడ్లను బీటీలుగా మార్చేందుకు ఏళ్లతరబడి ప్రతిపాదనలు పంపుతున్నా మోక్షం లభించలేదు. ఇందులో సుమారు 144కిలోమీటర్ల నిడివి ఉన్న రహదారులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ద్వారా చేపట్టేందుకు పరిపాలనపరమైన అనుమతి లభించింది. ప్రస్తుతం ఇవి నిర్మాణ దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి కాకుండా మరో 200 రెవెన్యూ గ్రామాలకు, గూడాలకు మట్టి రోడ్లు కూడా లేని పరిస్ధితి నెలకొంది. ఇక ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ఆసిఫాబాద్‌, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, లింగాపూర్‌, తిర్యాణి మండలాల్లో పంచాయతీలు, రెవెన్యూ గ్రామాలు, ఆదివాసీ గూడాలు అన్నీ కలుపుకుంటే మరో 198గ్రామాలకు మట్టి, బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయాల్సిన పరిస్ధితి ఉందని చెబుతున్నారు. 

రూ.300 కోట్ల నిధులు అవసరం

జిల్లాలో రహదారుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలంటే తక్కువలో తక్కువగా కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరమవుతాయని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఈ నిధులు కేవలం మట్టి రోడ్ల నిర్మాణానికి మాత్రమే సరిపోతాయంటున్నారు. ఇవి కాకుండా ఇప్పటికే  ప్రతిపాదించిన రోడ్ల అభివృద్ధికి (బీటీ రోడ్లుగా మార్చడం కోసం) మరో రూ.200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. అయితే ఈ ప్రతిపాదనలకు నాలుగేళ్లుగా మోక్షం లభించలేదు. ప్రతీ ఏటా వర్షాకాలంలో మట్టిరోడ్లు నామరూపాల్లేకుండా ధ్వంసమవుతున్న పరిస్థితి కొనసాగుతోంది. పక్కా రోడ్లు నిర్మించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అధికారులు గుర్తించి రూ.500 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినట్లు చెబుతున్నారు.

Updated Date - 2021-04-24T04:45:06+05:30 IST