వ్యక్తిపూజకు ఏ పార్టీ అతీతం?

ABN , First Publish Date - 2022-05-18T09:30:59+05:30 IST

చెట్టుకూకటి వ్రేళ్లతో కూలిపోయిన తర్వాత, దశాబ్దాలుగా భవనం చెదలు పడుతూ శిథిలమైన పిదప, జెండాలు వెలిసిపోయిన తర్వాత, నినాదాలు నూతిలో గొంతుకల్లా మారిన...

వ్యక్తిపూజకు ఏ పార్టీ అతీతం?

చెట్టుకూకటి వ్రేళ్లతో కూలిపోయిన తర్వాత, దశాబ్దాలుగా భవనం చెదలు పడుతూ శిథిలమైన పిదప, జెండాలు వెలిసిపోయిన తర్వాత, నినాదాలు నూతిలో గొంతుకల్లా మారిన తర్వాత, పూర్వీకుల ఆత్మలు ఘోషలు ప్రతిధ్వనించడం ఆగిన తర్వాత భవిష్యత్ మళ్లీ చిగురిస్తుందా? సమాధుల మధ్య సెల్ఫీలు దిగడం చైతన్యం రగిలిస్తుందా? అన్న చింతనలో దేశంలో పలు రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కాంగ్రెస్ పార్టీ. ఇటీవల ఉదయపూర్‌లో జరిగిన చింతన శిబిరంలో కాంగ్రెస్‌లో 400 మంది ప్రధాననేతలు ఆరు శిబిరాలుగా విడిపోయి కాంగ్రెస్‌ను పీడిస్తున్న అంశాలపై చర్చలు జరిపారు. కాని ఈ చర్చల ఆధారంగా తీసుకున్న నిర్ణయాల మూలంగా కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం చెందుతుందా? అన్న ఆలోచన మాత్రం నేతల మనసును ఇంకా పట్టి పీడిస్తోంది.


అసలు కాంగ్రెస్ పార్టీని జడత్వం ఎందుకు ఆవరించింది? ఎన్నికల్లో ఆ పార్టీ వరుస పరాజయాలు ఎందుకు ఎదుర్కొంటోంది? ఎన్నికల్లో పరాజయాలు ఏ పార్టీకైనా సాధారణమే. కాని ఒక పార్టీగా కూడా కాంగ్రెస్ ఎందుకు మనుగడ సాధించలేకపోతోంది? సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా, నాయకత్వ పరంగా, వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం లభిస్తున్న పార్టీగా, నిత్యం క్రియాశీలకంగా జనంలో తిరిగే నాయకులున్న పార్టీగా ఒక పార్టీ బలంగా ఉంటే అది ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట అధికారంలోకి వస్తుంది. కాని పార్టీ మూల స్వరూపమే చేవచచ్చినట్లు ఉంటే, జనం మనసుల్లో కనీసం బలమైన ప్రతిపక్షంగా కూడా కనపడకపోతే దానికి సమూలంగా మరమ్మతులు చేయడం అవసరం. రెండు నెలల క్రితం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేస్తూ ‘మీరు వందేళ్లయినా అధికారంలోకి రాదలుచుకోనట్లు కనపడుతోంది’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ వందేళ్లూ మేము అధికారంలో ఉండేందుకు సన్నద్ధంగా ఉన్నాం’ అని ఆయన అన్నారు. ‘ఈ దేశంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం అనేది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు’ అని కేంద్ర మంత్రి, బిజెపి మాజీ అధ్యక్షుడు నితీన్ గడ్కరి కూడా తర్వాత వ్యాఖ్యానించారు. ఒక ప్రధానమంత్రి, ఒక సీనియర్ కేంద్రమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి వాపోతున్నారంటే ఆ పార్టీ తనను తాను అంతరించి పోకుండా కాపాడుకోవడం ముఖ్యమనుకోవాలి.


నిజానికి 2014లో ఘోర పరాజయం చెందినప్పుడే కాంగ్రెస్ తీవ్రంగా ఆత్మ విమర్శ చేసుకుని ఉంటే, పార్టీ శ్రేణులు, నేతలు కకావికలు కాకుండా కాపాడుకుని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. కాని పార్లమెంట్‌లో మోదీ విమర్శించినట్లు కాంగ్రెస్ 2014లో ఎక్కడున్నదో అక్కడే ఉన్నది. ప్రజలు తమంతట తాము మోదీ పాలన పట్ల విసిగెత్తి పోయి తమకు అధికారాన్ని అప్పగిస్తారన్న భ్రమలో కాంగ్రెస్ ఉన్నట్లున్నదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా అన్నారు.


ఉదయపూర్ చింతన శిబిరంలో తీసుకున్న నిర్ణయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. జనం అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదించేందుకు, ఎన్నికలు నిర్వహించేందుకు, జాతీయ స్థాయిలో శిక్షణ నిచ్చేందుకు మూడు విభాగాలు ఏర్పర్చాలని నిర్ణయించినట్లు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకటించింది. అంటే ఇంతవరకూ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకుండానే పార్టీని నిర్వహిస్తున్నారా? అసలు ప్రజలు బిజెపికి, ముఖ్యంగా మోదీకి ఎందుకు ఓటు వేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ తెలుసుకుంటే సరైన జ్ఞానోదయం లభిస్తుంది. ఎన్నికల నిర్వహణ అనేది నిరంతరం జరగాల్సిన పని. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ఎన్నికల యాజమాన్యం గురించి జాతీయ స్థాయిలో ఆలోచించడం లేదనే విషయం ఈ నిర్ణయంతో తేటతెల్లమవుతోంది. ఇక జాతీయ స్థాయిలో శిక్షణ ఎవరికి ఇస్తారు?


విచిత్రమేమంటే కాంగ్రెస్ పార్టీలో అత్యధికులు 50 ఏళ్లు దాటిన వారేనని ఉదయపూర్ డిక్లరేషన్‌లో అంగీకరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ చూసినా, చివరకు ఉదయపూర్ సదస్సులో పాల్గొన్న వారిని చూసినా 50 ఏళ్లు దాటిన వారే. ఇప్పటికైనా సదస్సులో తీర్మానించినట్లు అన్ని పదవుల్లో 50 శాతం 50 ఏళ్ల లోపు ఉన్న వారికి కేటాయించగలిగితే బాగుంటుంది. అయినప్పటికీ మిగతా సగం పదవుల్లో మరణించేంతవరకూ కాంగ్రెస్ చూరును పట్టుకు వ్రేళ్లాడడానికి కురువృద్ధులు సిద్ధంగానే ఉంటారు. ఒక కుటుంబానికి ఒక పదవి అన్న నిబంధన కూడా హాస్యాస్పదంగా ఉన్నది. అయిదేళ్ల పాటు పార్టీకి పనిచేసిన కుటుంబ సభ్యులకు ఈ నిబంధన వర్తించదనడంతో గాంధీ కుటుంబ సభ్యులతో సహా మెజారిటీ నేతల పిల్లలు, సతీమణులు పార్టీలో పదవులు కొట్టేస్తూనే ఉంటారు. అయినా కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకడితే కదా పదవుల గురించి మాట్లాడాల్సింది.. ఉదయపూర్ సదస్సులో తీసుకున్న నిర్ణయాల్లో అత్యధికం ప్రాధాన్యతా ప్రాతిపదికగా తీసుకోలేదేమో అని అనిపిస్తుంది.


తమకు జనంతో సంబంధాలు లేవని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పుకోవడం, ఇప్పటికైనా నిత్యం ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహిం చడం ముఖ్యమని ప్రకటించడం, పార్టీలో అన్ని విభాగాల్నీ పునర్వ్యవస్థీకరించాలనుకోవడం మాత్రమే వాస్తవ ప్రాతిపదికగా తీసుకున్న నిర్ణయాలు కావచ్చు. సామాజిక న్యాయానికి సంబంధించి కొప్పులరాజు కీలక పాత్ర పోషించిన కమిటీ అనేక ప్రధాన సూచనలు చేసింది. ‘ఎస్‌సి, ఎస్‌టి, ఓబీసీ, మైనారిటీలకు పార్టీలో 50 శాతం పదవులు కేటాయించాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లను సమర్థించాలి. అప్పుడే ఈ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కలుగుతుంది’ అని కొప్పుల రాజు తన కమిటీ ప్రతిపాదనలను మీడియాకు తెలియజేశారు. కాని ఉదయపూర్ డిక్లరేషన్‌లో ఈ సిఫారసులకు ఎక్కడా స్థానం కల్పించలేదు. నిజంగా కాంగ్రెస్ అగ్రనేతలు కనుక ఈ ప్రతిపాదనలను అంగీకరించి ఉంటే దేశంలో ఒక అద్భుతమైన మార్పుకు ఆస్కారం ఏర్పడి ఉండేది. కాని వాటిని పట్టించుకోకపోవడం ద్వారా అసలు సిసలైన సామాజిక న్యాయానికి, మార్పులకు తాము సిద్ధంగా లేమని కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించినట్లయింది.


నిజానికి ఈ సామాజిక న్యాయం కాంగ్రెస్ వల్ల లభించదని ప్రజలు భావించినందువల్లే కాంగ్రెస్ దెబ్బతిన్నదన్న విషయం ఆ పార్టీ నేతలు గమనించడం లేదు. జాతీయ స్థాయిలో ఒక బలమైన నేత నాయకత్వంలో ఉండి మొత్తం దేశమంతటా పార్టీని ప్రేరేపించగల, జనాన్ని ఆకర్షించగల స్థితి భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో లేదు. నిజానికి ఇందిరాగాంధీ హయాంలోనే కాంగ్రెస్ రాష్ట్రాల్లో దెబ్బతినడం ప్రారంభమైంది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో ఇందిరాగాంధీ కాలంలోనే కాంగ్రెస్ పరాజయాలు ఎదుర్కొంది. ఆ తర్వాత ఒడిషా, నాగాలాండ్, గోవా, త్రిపుర, ఉత్తరప్రదేశ్, అస్సాం, హర్యానా, మధ్యప్రదేశ్, కేరళ, పంజాబ్ వరుసగా చేజారిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నది. బలమైన ప్రాంతీయ స్థాయి నేతలు కూడా కాంగ్రెస్‌కు కరువయ్యారు. నిజానికి బలమైన నేతలను కాంగ్రెస్ అధిష్టానమే నరుక్కుంటూ వచ్చి, సామాజిక న్యాయానికి తిలోదకాలు ఇచ్చి, వందిమాగధత్వానికి విలువ కల్పించి, చివరకు తన కొమ్మను తానే నరుక్కునే పరిస్థితికి చేరుకుంది. ఇవాళ బిజెపి తర్వాత అత్యధిక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పాలన కొనసాగుతుండగా, బిజెపిని ఎదుర్కోవడం ఈ పార్టీలకు సైద్ధాంతికంగా చేత కాదని, కాంగ్రెస్ వల్లే చేతనవుతుందని రాహుల్ గాంధీ పలకడం ఉత్తరకుమార ప్రగల్భం కాక మరేమవుతుంది?


విచిత్రమేమంటే కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించే నరేంద్రమోదీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ దారిలోనే తన పార్టీని నడిపిస్తున్నారేమో అనిపిస్తోంది. కాంగ్రెస్‌లో వ్యక్తిపూజను పరాకాష్టకు చేర్చిన ఇందిరాగాంధీ లాగా మోదీ కూడా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు అస్సాంకు చెందిన కాంగ్రెస్ నేత, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరించిన దేవకాంత బారువా ‘ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా’ అని ప్రకటించి భక్తి పారవశ్యంలో తేలిపోయారు. ఆ సంస్కృతినే తర్వాతి కాలంలోనూ కాంగ్రెస్ నేతలు ప్రోత్సహించారు. రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ హయాంలో కూడా ఇదే సంస్కృతి కొనసాగింది. గాంధీ కుటుంబమే దేశానికి ప్రథమ కుటుంబమని ప్రకటించిన సీనియర్ కాంగ్రెస్ నేత పిసి చాకో కాంగ్రెస్ పార్టీలో చివరకు ఎవరూ మిగలరంటూ ఆ పార్టీ వదిలిపెట్టి వేరే పార్టీలో చేరారు. ఉదయపూర్ సదస్సులో కూడా కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, ప్రియాంకల చుట్టూ తిరగడానికి, వారి అమూల్యమైన వాక్కులు వినడానికే తహతహలాడారు. ఇవాళ నరేంద్రమోదీ కూడా ఇదే వందిమాగధ సంస్కృతిలో కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తోంది. దేశంలోనూ, విదేశాల్లోనూ జనం ‘మోదీ, మోదీ’ అంటుంటే ఆయన కళ్లలో ఆనందం కనిపిస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రతి నేతా తనను భజించాలని, తన నామస్మరణ చేయాలని ఆయన భావిస్తున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ ప్రతి చోటా మోదీ చిత్రాలే కనపడుతున్నాయి. అన్నిటా మోదీకే ఘనతను ఆపాదిస్తూ ఆయనను వ్యక్తిగతంగా శ్లాఘించడం ముమ్మరంగా మారింది. భారతీయ జనతా పార్టీ అనే సంస్థ కూడా పూర్తిగా మోదీ చుట్టే తిరుగుతోంది. మోదీయే జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ ప్రధాన ప్రచారకుడయ్యారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర నేతలు పూర్తిగా అనామకులుగా కనిపిస్తున్నారు. మోదీని ఏ విధంగా సంతోష పెట్టాలో బిజెపి నేతలందరికీ తెలిసినట్లు కనిపిస్తోంది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి 21 ఏళ్లు, ప్రధానమంత్రి పదవి చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ, ప్రభుత్వాలు ఉత్సవాలు చేసేందుకు సిద్ధపడుతున్నాయి. ఇటీవల ‘మోదీ@20’ అన్న పుస్తకంలో వివిధ రంగాలకు చెందిన వ్యక్తులతో వ్యాసాలు రాయించి ప్రచురించడమే కాక, విజ్ఞాన్ భవన్‌లో ఉపరాష్ట్రపతి, హోంమంత్రి సమక్షంలో భారీ ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమాన్ని జరిపి మోదీపై వ్యక్తిగతంగా ప్రశంసల వర్షం కురిపించారు మొత్తం కేంద్రమంత్రులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ పుస్తకం ప్రజలకు భగవద్గీతలాంటిదని హోంమంత్రి అన్న తర్వాత అవతార పురుషుడు ఎవరో ఆయన చెప్పాల్సిన అవసరం లేకపోయింది. ఇందిర ప్రారంభించిన సంస్కృతి కాంగ్రెస్‌ను చెదలు పట్టించడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. ఇప్పుడదే సంస్కృతి బిజెపిలో ప్రవేశించింది.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2022-05-18T09:30:59+05:30 IST