రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఏ దారిలో ?

ABN , First Publish Date - 2021-03-02T05:50:09+05:30 IST

హైదరాబాద్‌ మహానగరం చుట్టూ నిర్మించ తలపెట్టిన రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్పుపై అందరి దృష్టి నెలకొన్నది. ఇప్పటికే పలు ధపాలుగా సర్వేలు చేసిన ప్రదేశాల నుంచి కాకుండా మరో చోట నుంచి వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను కొంతమంది పెద్దలు తమకు అనుకూలంగా నిర్మాణం చేయించేందుకు లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.

రీజనల్‌ రింగ్‌ రోడ్డు ఏ దారిలో ?
సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ నమూనా

ఎక్కడి నుంచి వెళుతుందోనని అయోమయం

అలైన్‌మెంట్‌ మార్పుపై అందరి దృష్టి

సోషల్‌ మీడియాలో నక్షాల చక్కర్లు

గతంలో నిర్వహించిన సర్వే నక్షాలు వేరు

భూసేకరణపై రైతుల్లో గుబులు


తూప్రాన్‌, మార్చి 1: హైదరాబాద్‌ మహానగరం చుట్టూ నిర్మించ తలపెట్టిన రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ మార్పుపై అందరి దృష్టి నెలకొన్నది. ఇప్పటికే పలు ధపాలుగా సర్వేలు చేసిన ప్రదేశాల నుంచి కాకుండా మరో చోట నుంచి  వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ను కొంతమంది పెద్దలు తమకు అనుకూలంగా నిర్మాణం చేయించేందుకు లాబీయింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. గతంలో సర్వే చేసినట్లుగా తూప్రాన్‌ పట్టణం మీదుగా కాకుండా మాసాయిపేట వద్ద నుంచి వెళుతున్నట్లు చెబుతున్నారు. అలైన్‌మెంట్‌ మార్పుపై నడుస్తున్న ప్రచారానికి తగ్గట్టుగానే రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు సంబంఽధించిన నక్షాలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే కేంద్రం రీజనల్‌ రింగ్‌రోడ్డుకు గ్రీన్‌ సిగ్నల్‌ తెలపడంతో మళ్లీ రోడ్డు నిర్మాణ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 


రెండు పర్యాయాలు సర్వే

340 కిలోమీటర్ల పొడవైన రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేసేందుకు సుమారు రూ.17,000 కోట్ల వ్యయం అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఎన్‌హెచ్‌ 44, ఎన్‌హెచ్‌ 65, ఎన్‌హెచ్‌ 163, ఎన్‌హెచ్‌ 765 రోడ్లను కలుపుతూ ఉత్తర, దక్షిణ భాగాలు నిర్మాణం చేపట్టనున్నారు. 158 కిలోమీటర్ల పొడవైన ఉత్తరభాగంగా సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, యాదాద్రి - భువనగిరి, చౌటుప్పల్‌లను, 182 కిలోమీటర్ల పొడవైన దక్షిణభాగంగా చౌటుప్పల్‌, ఇబ్రహీంపట్నం, కందుకూర్‌, షాద్‌నగర్‌, చేవేళ్ల, శంకర్‌పల్లి, సంగారెడ్డిలను కలుపుతూ ఎన్‌హెచ్‌ 161ఏఏలు నిర్మించడానికి నిర్ణయించారు. ఫస్ట్‌ ఫేజ్‌లో ఉత్తరభాగం 158 కిలోమీటర్ల రోడ్డు నిర్మించడానికి నిర్ణయం తీసుకోగా, ఇందుకు రూ.7,561 కోట్ల వ్యయం అవుతుందని, ఇందులో భూసేకరణకు రూ. 1,961 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. మెదక్‌ జిల్లాలో రీజనల్‌ రింగ్‌ రోడ్డు తూప్రాన్‌, పోతరాజుపల్లి పట్టణాల మద్యస్థంగా వెళుతున్నట్లు గతంలోనే సర్వేలు చేపట్టారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు వెళుతున్న సర్వేనంబర్లు, భవనాలు, ఆస్తుల వివరాలు కూడా గుర్తించారు. అయితే మరోసారి టోల్‌ప్లాజా, పోతరాజుపల్లి మధ్యస్థంగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు వెళుతున్నట్లు సర్వే చేసి మార్కింగ్‌ చేశారు. రెండు పర్యాయాలు సర్వేలు చేయగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మారుతుందని అప్పట్లోనే ప్రచారం జరిగింది. 

ప్రస్తుతం రీజనల్‌ రింగ్‌ రోడ్డును తూప్రాన్‌ పట్టణం మీదుగా కాకుండా మాసాయిపేట సమీపం నుంచి వెళుతున్నట్లు నక్షాలు రూపొందించారు. ఈ నక్షాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నక్షాలను బట్టి కొంత మంది పెద్దల భూముల కోసం అలైన్‌మెంట్‌ మారిపోయిందని ప్రచారం జరుగుతుంది. గతంలో నిర్వహించిన రీజనల్‌ రింగ్‌రోడ్డు నిర్మాణ సర్వేలు కాకుండా మరో ప్రదేశం నుంచి రోడ్డు వెళుతుందని చెబుతున్నారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు సర్వేలు పూర్తయ్యేందుకు మరో ఆరునెలలు పడుతుందని చెబుతున్నారు. 


ఎవరి భూములకు ఎసరో! 

నర్సాపూర్‌, మార్చి 1: రీజినల్‌ రింగు రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో అలజడి మొదలైంది. నిధులు కూడా కేటాయించి త్వరగా అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించడంతో నర్సాపూర్‌ నియోజకవర్గంలోని పలు మండలాల్లోని గ్రామాల రైతులు ఆందోళనలో పడ్డారు. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు సర్వీసు రోడ్డుకు కూడా వేలాది ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది. దీంతో ఎవరి భూములకు ఎసరు పడుతుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. మొదటగా సంగారెడ్డి నుంచి నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌ మీదుగా విజయవాడ జాతీయ రహదారిని కలిపే చౌటుప్పల్‌ వరకు 158 కిలోమీటర్ల మార్గాన్ని నిర్మించనున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో రోడ్డు ఎక్కడి నుంచి వెళ్తుందనే విషయం ఎవరికి తెలియక గందరగోళం నెలకొన్నది. నర్సాపూర్‌ నియోజకవర్గంలో హత్నూర, నర్సాపూర్‌, శివ్వంపేట మండలాల మీదుగా ఈ రోడ్డు వెళ్లే అవకాశముంది. ఈ ప్రాంతంలో భూముల ధరలు ప్రస్తుతం ఆకాశనంటాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములు ప్రస్తుతం ఎకరా కోటి పలుకుతుండగా ఇతర ప్రాంతాల్లో రూ.50 లక్షలకు తక్కువగా లేవు. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం సేకరించే భూములకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం ప్రస్తుత మార్కెట్‌ ధరకు చాలా తక్కువగా ఉంటుంది. రోడ్డు కోసం భూములిస్తే పరిహారం ఏ మూలకు సరిపోక తీవ్రంగా నష్టపోయే అవకాశముంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఎక్కడి నుంచి వెళుతుందో అనే విషయం స్పష్టత లేకపోవడంతో నాయకులు, అధికారులను సంప్రదించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో చేసిన సర్వేల ప్రకారం నర్సాపూర్‌ పట్టణ సమీపంలో మూడు ప్రాంతాల్లో మార్కింగ్‌ చేశారు. ఈ మూడు ప్రాంతాల సమీపంలో భూములున్న వారు ఆందోళనలో ఉన్నారు. నర్సాపూర్‌ పట్టణ సమీపం నుంచి వెళ్తుందని కొందరు.. కాదు పట్టణానికి మరో 10 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని మరికొందరు వాదిస్తుండటంతో అయోమయ పరిస్థితి నెలకొంది. రీజినల్‌ రింగురోడ్డుఅసలు ఎక్కడి నుండి వెల్తుంది. దాని వాస్తవ రూపం ఏమిటన్నది మరి కొన్ని రోజులైతే స్పష్టత వచ్చే అవకాశముంది. 


Updated Date - 2021-03-02T05:50:09+05:30 IST