డాబుగా వచ్చి దగా

ABN , First Publish Date - 2021-07-22T07:03:49+05:30 IST

కూకట్‌పల్లికి చెందిన

డాబుగా వచ్చి దగా

పెరిగిపోతున్న ఆర్థిక నేరాలు

నట్టేట ముంచుతున్న కేటుగాళ్లు

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 21 (ఆంధ్రజ్యోతి): 

కూకట్‌పల్లికి చెందిన నరసింహ వ్యాపారి. రోజూ అతని వద్దకు వచ్చే ఇద్దరు కస్టమర్లు నరసింహకు కల్లబొల్లి కబుర్లు చెప్పేవారు. పలానా కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించారు. చాలామందికి ప్రతి నెలా డబ్బులు బ్యాంకు ఖాతాలో పడుతున్నాయని, ఒక్కసారి పెట్టుబడి పెడితే మళ్లీ పెట్టాల్సిన అవసరం లేదని నమ్మించారు. ముందుగా అతనితో రూ. 8 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం రెండు నెలలపాటు నెలకు రూ. 80 వేల చొప్పున ఖాతాలో పడ్డాయి. నమ్మకం కుదిరిన నరసింహ అప్పు చేసి మరో రూ. 8 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అంతకన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టలేడని గుర్తించిన నిందితులు అతడికి రిటర్న్స్‌ ఇవ్వడం మానేశారు. పెట్టుబడి పెట్టించిన ఇద్దరు కూడా కనిపించడం మానేశారు. ఎలాగోలా పట్టుకొని వారిని రూ. 16 లక్షలు డిమాండ్‌ చేయగా ‘మేం కూడా బాధితులమే. పెట్టుబడి పెట్టి మోసం పోయాం.  ఏం చేసుకుంటావో చేసుకో’ అంటూ ప్లేటు పిరాయించారు. చేసేదేం లేక నరసింహ పోలీసులను ఆశ్రయించాడు. అప్పుల వాళ్లకు సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నాడు. 


ఆ జాగా మాదేనంటూ రూ. 80 లక్షలు..

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రాఘవేంద్రకు ఆర్‌సీపురం పరిధిలో 430 గజాల స్థలం ఉంది. ఐదేళ్ల క్రితం స్థలాన్ని కొనుగోలు చేసిన అతను దాన్ని చూడ్డానికి కూడా వెళ్లలేదు. అక్కడే ఉండే ఓ రియల్‌ ముఠా భూమిపై కన్నేసింది. నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమి తమదేనని బేరం పెట్టింది. ఓ వ్యక్తి రూ 2కోట్లకు బేరం కుదుర్చుకున్నాడు. వెంటనే రూ. 80 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ప్లాటు చూసుకుందామని అక్కడికి వెళ్లిన రాఘవేంద్ర స్థానికుల ద్వారా విషయం తెలియడంతో పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు నిందితుల ముఠాను కటకటాల్లోకి నెట్టారు. ప్లాటు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి మాత్రం రూ. 80 లక్షలు పోగొట్టుకున్నాడు.


డబ్బు కోసం

ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.. ఇలాంటి మోసాలు హైదరాబాద్‌ మహానగరంలో చాలానే జరుగుతున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెట్టుబడులు, తక్కువ ధరకు ప్లాట్లు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. స్పెషల్‌ టీమ్‌లు రంగంలోకి దిగి ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నా ఏదో రూపంలో, ఎక్కడో చోట మళ్లీ మొదలవుతున్నాయి. వైట్‌ కాలర్‌ నేరాలపై అవగాహన లేకపోవడం, నిందితుల డాబు, దర్పం చూసి పలువురు ఈజీగా వారిని నమ్మేసి లక్షలు పోగొట్టుకుంటున్నారు. 


ఉక్కుపాదం మోపుతున్నాం..

- వి.సి. సజ్జనార్‌, సైబరాబాద్‌ సీపీ.

రోజురోజుకూ ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. రూ. లక్షలు సంపాదించాలనే లక్ష్యంతో కొంతమంది కేటుగాళ్లు ముఠాలుగా ఏర్పడి అమాయకులను మోసం చేస్తున్నారు. కమిషనరేట్‌లో ప్రత్యేకంగా ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)ను ఏర్పాటు చేశాం. ఇప్పటికే అనేక ముఠాలను కటకటాల్లోకి నెట్టాం. పీడీయాక్టులు నమోదు చేస్తున్నాం. ప్రజలు కూడా అత్యాశకు పోతున్నారు. తక్కువ సమయంలో కోటీశ్వరులు కావాలనే భ్రమలో మోసగాళ్లను నమ్మి దివాలా తీస్తున్నారు. 


సంప్రదించాల్సిన నంబర్స్‌.. 

ఆర్థిక మోసాలపై పోలీసులను సంప్రదించాల్సిన నంబర్‌లు డయల్‌-100, హైదరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌- 9490616555,  సైబరాబాద్‌ వాట్సాప్‌ నంబర్‌: 9490617444, రాచకొండ- 9490617111.

Updated Date - 2021-07-22T07:03:49+05:30 IST