కర్ణాటక సీఎం రేసులో ఎవరెవరు..?

ABN , First Publish Date - 2021-07-27T01:11:55+05:30 IST

కర్ణాటక సీఎంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న బీఎస్ యడియూరప్ప సోమవారంనాడు..

కర్ణాటక సీఎం రేసులో ఎవరెవరు..?

బెంగళూరు: కర్ణాటక సీఎంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న బీఎస్ యడియూరప్ప సోమవారంనాడు రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు పగ్గాలు చేపట్టనున్నారనే ఉత్కంఠ ఆ పార్టీ నేతల్లో నెలకొంది. కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేసేంత వరకూ యడియూరప్ప ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. కొద్దికాలంగా పంచమశాలి లింగాయత్‌లు సీఎం పదవి కోసం డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బసవగౌడ రామన్‌గౌడ పాటిల్, అరవింద్ బెల్లాడ్, మురుగేష్ నిరాని పేర్లు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. మురుగేష్ నిరాని గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. ఆదివారంనాడు ఆయన ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్ర నేతలను కలుసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన కోసం ఢిల్లీ వెళ్లినట్టు ఆయన సన్నిహత వర్గాలు చెబుతున్నాయి.


కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై పేరు కూడా సీఎం రేసులో ఉన్న వారిలో ప్రముఖంగా వినిపిస్తోంది. గౌడ సామాజిక వర్గానికి అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తే కేంద్ర మాజీ మంత్రి డీవీ సదానంద గౌడ కానీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి కానీ  తదుపరి సీఎం అయ్యే అవకాశాలున్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన వారిలో ఆర్.అశోక్, సిఎన్.అశ్వద్ధ నారాయణ కూడా రేసులో ఉన్నారు. అలాగే, గత రెండు వారాలుగా బీజేపీలో ''దళిత ముఖ్యమంత్రి'' ప్రస్తావన కూడా వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్, బీ.శ్రీరాములు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. సీఎం పదవికి గట్టి పోటీదారుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన మాత్రం అదేమీలేదంటున్నారు. తాను అంత పెద్దవాడిని కాదని అంటూనే పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెబుతున్నారు. కాగా, తాను సీఎంగా ఎవరు పేరును ప్రతిపాదించలేదని, ఎవరు సీఎం అయినా ఆయన నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు తనతో పాటు, తన అనుయాయూలు వంద శాతం కృషి చేస్తారని యడియూరప్ప ప్రకటించారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Updated Date - 2021-07-27T01:11:55+05:30 IST