పోలీసులు ఎవరికోసం పనిచేస్తున్నారు?

ABN , First Publish Date - 2022-05-11T06:30:05+05:30 IST

అయోధ్యలో కల్యాణ్ సింగ్ హయాంలో పోలీసు డైరెక్టర్ జనరలుగా ఉన్న ప్రకాశ్ సింగ్‌ను ఉన్నట్లుండి ఒకరోజు పదవి నుంచి తొలగించారు. అప్పటివరకూ అంతా బాగానే ఉన్నది....

పోలీసులు ఎవరికోసం పనిచేస్తున్నారు?

అయోధ్యలో కల్యాణ్ సింగ్ హయాంలో పోలీసు డైరెక్టర్ జనరలుగా ఉన్న ప్రకాశ్ సింగ్‌ను ఉన్నట్లుండి ఒకరోజు పదవి నుంచి తొలగించారు. అప్పటివరకూ అంతా బాగానే ఉన్నది. రాష్ట్రంలో మాఫియాని, ఉగ్రవాదాన్ని ఏరి వేస్తున్నందుకు ప్రకాశ్ సింగ్ మంచి పేరు సంపాదించుకున్నారు. కాని అయోధ్యలో వివాదాస్పద కట్టడం చుట్టూ ఉన్న భద్రతను సడలించమని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆయన ప్రతిఘటించారు. ‘అయోధ్యలో రామమందిరం కట్టాలని నా మనసు కోరుకుంటుంది కాని రాష్ట్ర పోలీసు అధికారిగా చట్టపరమైన పాలనే నాకు అన్నిటికన్నా గొప్ప మతం’ అని ఆయన అన్నారు. ప్రతి బారికేడ్ తొలగింపునూ ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆయననే తొలగించారు. న్యాయవ్యవస్థ ఆదేశాలను అమలు చేసేందుకు, చట్టపరమైన పాలనను అమలు చేసేందుకు కట్టుబడిన ఒక పోలీసు అధికారిని నిర్దాక్షిణ్యంగా తొలగించడం ఏం చెబుతుంది? వ్యవస్థల్లో సమగ్రమైన మార్పు రావడం తప్పనిసరి అని చెప్పడం లేదా? అని ప్రకాశ్ సింగ్ ప్రశ్నించారు.


దేశంలో పోలీసు వ్యవస్థలో సంస్కరణలు జరగాలని కొన్ని దశాబ్దాలుగా సుప్రీంకోర్టులోనూ, ఇతర వేదికల్లోనూ పోరాడుతున్న ఇదే ప్రకాశ్ సింగ్ రాసిన ‘ద స్ట్రగుల్ ఫర్ పోలీస్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ప్రగతిశీల, ఆధునిక భారతదేశంలో ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసు వ్యవస్థలో సంస్కరణలు రావాలని, కాని స్వాతంత్ర్యం నుంచి ఇప్పటివరకూ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని ఉపరాష్ట్రపతి అన్నారు. 1857 తర్వాత బ్రిటిష్ పాలకులు తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలకోసం ప్రవేశపెట్టిన పోలీసు వ్యవస్థను అదే మాదిరి ఇప్పటికీ ఉపయోగించుకోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఒక రాజ్యాంగాధినేత దేశంలో పోలీసు వ్యవస్థ దుస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు మన దేశంలో ఇంకా వలసవాద పోలీసింగ్ వ్యవస్థను కొనసాగిస్తున్నాం? స్వాతంత్ర్యం తర్వాత రాజకీయ నాయకులు ఈ వ్యవస్థను తమ స్వార్థపర, సంకుచిత ప్రయోజనాలకు అనుగుణంగా దుర్వినియోగం చేస్తున్నారని, తమ అధికారాన్ని కొనసాగించేందుకు బ్రిటిష్ కాలం నాటి ఆటవిక పోలీసు చట్టాలనే ప్రయోగిస్తున్నారనీ అందరికీ తెలుసు. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశామని, వలస కాలం నాటి రాజద్రోహ సెక్షన్‌ను కొనసాగించే విషయం పరిశీలిస్తామని తాజాగా సుప్రీంకోర్టులో చెప్పుకున్న మోదీ ప్రభుత్వం దేశంలో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు చేసే విషయంలో ఏమైనా చేయగలదా, లేక బ్రిటిష్ కాలం నాటి 1861 పోలీసు చట్టాన్నే అవసరాలకు తగ్గట్లుగా మార్చుకుంటూ పోతుందా అన్నది చర్చించాల్సిన అవసరం ఉంది.


‘పనిముట్లను సవ్యంగా ఉపయోగించేవారు ఉండాలి కాని పనిముట్లతో పోరాడటం మంచిది కాదు. ఈ ఉపకరణాలను తొలగిస్తే దేశంలో కల్లోలం ఏర్పడుతుంది’ అని మన తొలి హోంమంత్రి సర్దార్ పటేల్ భావించడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 312(2) అఖిలభారత సర్వీసులను పార్లమెంట్ ఏర్పాటు చేసింది. కాని ఆయన ఆలోచనలకు భిన్నంగా పరిస్థితులు మారిపోయాయి. స్వాతంత్ర్యం తర్వాత రాజకీయ నాయకులు, అధికారులను ప్రేరేపించిన ఆదర్శవాదం గాలికి కొట్టుకుపోయింది. అధికారమే రాజకీయ నేతలకు పరమార్థంగా మారింది. రాజకీయ నాయకులకు అధికారులకు అక్రమ అనుబంధం ఏర్పడింది.


అధికారంలో ఎవరు ఉంటే వారికి తగ్గట్లుగా పరిపాలనా యంత్రాంగం కట్టుబడి పనిచేయాలనే భావాన్ని రాజకీయ నాయకత్వం అధికారుల మెదళ్లలో చొప్పించడం చాలా కాలం నుంచే దేశంలో ప్రారంభమైంది. అధికారుల్లోని నిజాయితీ, ప్రతిభ, పరిపాలనాపరమైన అర్హతలను పక్కనపెట్టి తమతో వ్యక్తిగత సంబంధాలు, సాన్నిహిత్యం, విధేయతకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలైంది. ఎమర్జెన్సీ సమయంలో దీని దుష్పరిణామాలు తీవ్రతరమయ్యాయి. అప్పుడు పోలీసులు, మెజిస్ట్రేటులు కుమ్మక్కై ప్రజలకు కనీస స్వేచ్ఛను నిరాకరించారని, కోర్టు తలుపు తట్టకుండా జైళ్లలో వేశారని, కేవలం రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఎవర్ని అరెస్టు చేయాలో, ఎవర్ని విడుదల చేయాలో నిర్ణయించేవారని ఎమర్జెన్సీ తర్వాత జనతా ప్రభుత్వం నియమించిన షా కమిషన్ తన నివేదికలో పేర్కొంది. పోలీసులను రాజకీయాల నుంచి దూరం చేయాలని, చట్టపరమైన పాలన మాత్రమే వారు చేసేలా చూడాలని కమిషన్ సిఫారసు చేసింది. తమకు వేరే దారి లేక దారుణాలకు పాల్పడ్డామని అనేకమంది పోలీసు అధికారులు షా కమిషన్ ముందు మొరపెట్టుకున్నారు. 


పోలీసులే నిర్వహించే బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా పోలీసులపై రాజకీయ పెత్తనం అతిగా పెరిగిపోయిందని, చట్టపరమైన పాలనను కాలరాచేందుకు, నియంతృత్వాన్ని అమలుచేసేందుకు పోలీసులను ఉపయోగించుకుంటున్నారని 1979లోనే ఒక నివేదిక ప్రచురించింది. ప్రజాస్వామ్య పునాదులను ఇది దెబ్బతీస్తుందని హెచ్చరించింది. అయినా రాజకీయనేతల పర్యవేక్షణలో పోలీసుల దారుణాలు దేశంలో ఇంకా పెరిగాయే కాని తగ్గలేదు. ఇందుకు ఉదాహరణగా ప్రకాశ్ సింగ్ 1984 డిసెంబరు 31 సిక్కుల ఊచకోత నుంచి 2000లో గుజరాత్‌లో జరిగిన హింసాకాండ వరకు ఎన్నో ఘటనలను ఉదహరించారు.


1994 సెప్టెంబరు 13న అలహాబాద్ హైకోర్టుపై జరిగిన దాడి, 1994 అక్టోబరులో ఉత్తరాఖండ్ ఉద్యమకారులపై అమలు అయిన దారుణాల నుంచి 2002లో గుజరాత్ అల్లర్ల వరకు మాత్రమే కాదు, దేశంలో ప్రతి రోజూ ప్రతి చోటా రాజకీయ వ్యవస్థతో పోలీసుల కుమ్మక్కు కనపడుతూనే ఉన్నది. గోధ్రా సంఘటన నుంచీ తర్వాత రెండు నెలల వరకూ గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ జెఎస్ వర్మ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పోలీసు సంస్కరణలను ఎలాంటి ఆలస్యం లేకుండా అమలు చేయాలని, దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని ఆయన అన్నారు.


పోలీసు సంస్కరణల కోసం రాష్ట్రాల స్థాయిల్లో దాదాపు 11 కమిషన్లను నియమించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఐపీఎస్ అధికారి కె.రామచంద్రారెడ్డి కమిషన్ కూడా ఉన్నది. జాతీయ పోలీసు కమిషన్ 8 నివేదికలను సమర్పించింది. ఇవి కాక కేంద్ర స్థాయిలో గోరే, రిబేరియో, పద్మనాభయ్య, మాలిమత్ కమిటీలను, జాతీయ భద్రతపై మంత్రుల బృందాన్ని నియమించారు. 1996లో ప్రకాశ్ సింగ్ స్వయంగా పోలీసుసంస్కరణలపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సమర్పించారు. కొత్త పోలీసు చట్టాన్ని రూపొందించాలని, జాతీయ స్థాయిలోను, ప్రతి రాష్ట్రంలోనూ భద్రతా కమిషన్లను నియమించాలని, దర్యాప్తును, శాంతి భద్రతలను వేరు చేయాలని, పోలీసు అధికారులకు కనీస పదవీకాలం ఉండాలని ఆయన అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాష్ట్రాలకు నోటీసులు పంపి ఊరుకుంది. దాదాపు 9 సంవత్సరాలు ఏమీ జరగలేదు. 2005లో జస్టిస్ సబర్వాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాక ఈ కేసుపై విచారణలో కదలిక ఏర్పడింది. చివరకు 2006 సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ప్రకాశ్ సింగ్ తన పిటిషన్‌లో చేసిన అన్ని అభ్యర్థనలను అది అంగీకరించింది. భద్రతా కమిషన్, పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు, పోలీసులపై ఫిర్యాదుకులకు అథారిటీ, అధికారులకు కనీస పదవీకాలం, శాంతి భద్రతల నుంచి దర్యాప్తును వేరు చేయడంపై ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక చరిత్రాత్మక మార్పు చట్టసభల ద్వారా కాకుండా న్యాయవ్యవస్థ ద్వారా జరగడం గొప్ప విషయమని, అధికార ప్రయోజనాలకు తగ్గట్లుగా పోలీసు వ్యవస్థ పనిచేయడం రాజకీయ చిత్తశుద్ధి లోపించడానికి నిదర్శనమని ఆనాడు ఒక ప్రముఖ దినపత్రికలో అజిత్ కే దోవల్ వ్యాసం రాశారు, ఆయన తర్వాతి కాలంలో జాతీయ భద్రతా సలహాదారు అయ్యారు. అది వేరే సంగతి.


పోలీసు సంస్కరణల విషయంలో గత పదహారేళ్లుగా తన తీర్పు అమలు కాకపోవడాన్ని సుప్రీంకోర్టు కూడా నిస్సహాయంగా గమనిస్తూనే ఉన్నది. అనేక రాష్ట్రాలను కోర్టు ధిక్కరణకు పాల్పడ్డాయని నిందించిన తర్వాత కూడా జరిగిందేమీ లేకపోయింది. పోలీసులు అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తడం పెరుగుతూనే ఉన్నది కాని ఇంకా తగ్గడం లేదు. బుల్‌డోజర్లు పేదల ఇళ్లను కూల్చివేస్తుంటే పోలీసులు తోడ్పడటాలు, నేతల ఇష్టాయిష్టాల ప్రకారం ప్రత్యర్థులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లలో హింసించడాలూ జరుగుతూనే ఉన్నాయి. పోలీసు స్టేషన్లలో భౌతిక దాడులు జరుగుతున్నాయని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఒక సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. నార్వేలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు తమ దేశ ప్రధానమంత్రి పైనే భారీ పెనాల్టీ విధిస్తే, మన దేశంలో ఇక్కడి పోలీసులు తమ లాఠీల ప్రతాపాన్ని వీధుల్లో అభాగ్యుల వీపులపై చూపించిన దృశ్యాలను మనం తిలకించాం.


‘అధికారులు, రాజ్యాంగానికి, చట్టాలకు విధేయంగా ఉండాలి కాని అధికార పార్టీ నేతలకు కాదు. వారు నేతల ప్రయోజనాన్ని కాదు, చట్టపరమైన న్యాయాన్ని కాపాడాలి. పాలకుల పోలీసులు కాదు, ప్రజల పోలీసులు కావాలి’ అని ప్రకాశ్ సింగ్ అన్నారు. అది ఈ దేశంలో సాధ్యమా?


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Read more