HYD : ఈ విల్లాల వెనుక ఎవరున్నారు.. కదులుతున్న డొంక.. దర్జాగా రూ.600 కోట్ల వ్యాపారం!

ABN , First Publish Date - 2021-12-07T15:04:21+05:30 IST

ఆమె మహిళా ఎన్‌ఆర్‌ఐ.. ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ పేరుతో ఏకంగా 260 విల్లాలను అక్రమంగా నిర్మించేశారు. రెరా, మున్సిపల్‌...

HYD : ఈ విల్లాల వెనుక ఎవరున్నారు.. కదులుతున్న డొంక.. దర్జాగా రూ.600 కోట్ల వ్యాపారం!

  • మల్లంపేటలో కదులుతున్న డొంక
  • చెరువులోకి చొచ్చుకొచ్చి విల్లాల నిర్మాణాలు
  • హెచ్‌ఎండీఏ అనుమతి పేరుతో విక్రయం
  • మరికొన్ని గ్రామ పంచాయతీ పేరుతో..
  • ఒక్కో విల్లా రూ.1.20 కోట్ల నుంచి రూ.140కోట్లకు

ఆమె మహిళా ఎన్‌ఆర్‌ఐ.. ఓ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ పేరుతో ఏకంగా 260 విల్లాలను అక్రమంగా నిర్మించేశారు. రెరా, మున్సిపల్‌ యాక్ట్‌లకు తూట్లు పొడిచి మల్లంపేట చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నా అధికార యంత్రాంగం అటువైపు చూడలేదు. మూడేళ్లలో ముగ్గురు కమిషనర్లు వచ్చి వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు. దీని గల కారణాలేంటి? అధికారులపై ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె మాత్రం తనకు ఎవరి అండదండలూ లేవంటున్నారు. మరి ఏ ధైర్యంతో అన్ని విల్లాలను అక్రమంగా నిర్మించారో తెలియాల్సి ఉంది. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధి మల్లంపేటలో 260 విల్లాల సీజ్‌కు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఆదేశాల నేపథ్యంలో ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం...


హైదరాబాద్‌ సిటీ : దుండిగల్‌ గండిమైసమ్మ మండలం, మల్లంపేట రెవెన్యూ పరిధిలోని కొత్త చెరువులో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరు నెలల క్రితం ఓ ఫిర్యాదు వచ్చింది. చెరువు దక్షిణ భాగాన్ని పరిశీలించేందుకు రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు నిర్మాణంలో ఉన్న ఓ గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ వద్దకు చేరారు. ఆ కాలనీ ప్రధాన ద్వారం నుంచే చెరువు వద్దకు నేరుగా వాహనాలకు వెళ్లేందుకు అవకాశముంది. కానీ అధికారులెవరూ అందులో అడుగు పెట్టలేదు. తమ స్థలం నుంచి వెళ్లకూడదంటూ అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇలా పలుమార్లు జరిగింది. అనంతరం ఓ రోజు అధికారులు చెరువు స్థలంలో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేత చర్యలకు దిగారు. దీంతో అధికారులను సవాల్‌ చేస్తూ యజమాని కోర్టుకెక్కడంతో అసలు బాగోతం బయటపడింది.


అడ్డుకోని అధికారులు

మల్లంపేటలోని 170 సర్వే నెంబర్‌ పరిధిలోని వంద ఎకరాలకు పైగా స్థలంలో 40 ఎకరాలు ప్రభుత్వ భూమి. 50 ఎకరాలను పేదలకు కేటాయించి పట్టాలను అందజేశారు. ప్రభుత్వ రికార్డులో లావణి పట్టాగానే ఆ భూములున్నాయి. ఆ సర్వే నెంబర్‌ పరిధిలోనే మల్లంపేట కొత్త చెరువు ఉంది. చెరువును ఆనుకొని ఉన్న భూమిలో పెద్దఎత్తున విల్లాల నిర్మాణాన్ని మూడేళ్లుగా చేపడుతున్నారు. కేవలం 65 ట్రిప్లెక్స్‌ విల్లాలకే హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకుని అదనంగా 260 డూప్లెక్స్‌ విల్లాలను నిర్మించేస్తున్నారు. అధికారులు, రాజకీయ నేతలు ఎవరూ అటువైపు చూడలేదు. అడ్డుకునే సాహసం చేయలేదు.


65 విల్లాలకే అనుమతులు

అక్రమాల్లో ఆరితేరిన కొందరు మగ మహారాజులను తలదన్నేలా ఎన్‌ఆర్‌ఐ లేడీబాస్‌ భారీ అక్రమాలకు తెరలేపారు. పట్టణ ప్రణాళిక నిబంధనలను తుంగలో తొక్కారు. మల్లంపేటలో తనకు అందుబాటులోని 3.20 ఎకరాల్లో ట్రిప్లెక్స్‌ విల్లాల నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏకు మూడేళ్ల క్రితం వేర్వేరుగా రెండు దరఖాస్తులు చేశారు. అందులో ఒకటి 35 విల్లాల నిర్మాణానికి (6,418 చదరపు గజాల్లో), మరొకటి 30 విల్లాల నిర్మాణానికి (5,394 చదరపు గజాల్లో). వాటికి హెచ్‌ఎండీఏ అధికారులు అనుమతులిచ్చారు. ఆ స్థలంలో రోడ్లు, ఖాళీ స్థలాలను వదిలి 65 ట్రిప్లెక్స్‌ విల్లాలను నిర్మించాల్సి ఉండగా, ఏకంగా వందకు పైగా విల్లాలను నిర్మించారు.


120తో మమ..? 

కలెక్టర్‌ ఆదేశాలతో ఇప్పటికే 260 విల్లాల్లో 120 వరకు సీజ్‌ చేశారు. మిగతా సోమవారం సీజ్‌ చేస్తామని ప్రకటించారు. కానీ సోమవారం చర్యలకు దిగలేదు. మున్సిపల్‌ కమిషనర్‌, పట్టణ ప్రణాళిక అధికారులు ఇతర పనుల వల్ల విల్లాల సీజ్‌ను వాయిదా వేశారు. కొందరు ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో అధికారులు వెనక్కి తగ్గారా, అనే అనుమా నాలు వ్యక్తం అవుతున్నాయి.


ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు..

హెచ్‌ఎండీఏ అనుమతులతో నిర్మించిన విల్లాల పక్కనే మరో 15 ఎకరాల వరకు స్థలం ఉంది. దీని ఆనుకొని కొత్తపేట చెరువు ఉంది. ఆ 15 ఎకరాల్లో మల్లంపేట గ్రామ పంచాయతీ అప్పటి ఈఓ పేరుతో సుమారు 202 డూప్లెక్స్‌ విల్లాలకు అనుమతులు ఇచ్చినట్లుగాను, ఈఓగా వచ్చిన మరొకరి పేరుతో మరో 65 ట్రిప్లెక్స్‌ విల్లా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చినట్లు పత్రాలను చూపుతున్నారు. 2018 ఏప్రిల్‌ నుంచి జూలై సమయంలో పంచాయతీ అనుమతులు పొంది, అందుకు కోటిన్నరకు పైగా రుసుం చెల్లించినట్లు చెబుతున్నారు. 


కానీ ఫీజులు ప్రభుత్వ ఖాతాలో జమ కాలేదు. ఇటీవల రికార్డులను తనిఖీ చేయగా అనుమతులిచ్చినట్లు పత్రాలే లేని విషయం బయటకు వచ్చింది. అసలు పంచాయతీలకు విల్లాలకు అనుమతులిచ్చే అధికారమే లేదు. కేవలం 3.20 ఎకరాల్లో విల్లాల అనుమతులకు హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకొని, మరో 15 ఎకరాల్లో అక్రమంగా 260 విల్లాలను అంటే మొత్తం 325 విల్లాలు నిర్మించారు. పక్కనే కొత్త చెరువులోని ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 15కు పైగా డూప్లెక్స్‌ విల్లాలను నిర్మిస్తున్నారు. చెరువులో ఉన్న నీటిని మోటార్ల ద్వారా తోడి నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. చెరువు ఒడ్డున కుర్చీ వేసుకొని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్లలో విల్లాలను నిర్మించిన ఘనత ఆ ఎన్‌ఆర్‌ఐ మహిళకే దక్కింది.


80 శాతం విక్రయం

పట్టణ ప్రణాళిక నిబంధనలను తుంగలో తొక్కి రూ.600 కోట్ల వ్యాపారాన్ని దర్జాగా నిర్వహిస్తున్నారు. బ్రోచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. 150 చదరపు గజాల్లోని ట్రిప్లెక్స్‌ విల్లాను హెచ్‌ఎండీఏ అనుమతులతో 2,399 చ.అడుగుల్లో నిర్మించినట్లుగా, నాలుగు బెడ్‌ రూమ్‌లు, హాల్‌, కిచెన్‌ ఉన్న విల్లాకు రూ.1.43 కోట్లు, పంచాయతీ అనుమతులతో 2100 చ.అడుగులతో నిర్మించినట్లుగా చెబుతున్న విల్లా(మూడు బెడ్‌రూమ్‌లు, హాల్‌, కిచెన్‌)కు రూ.1.10 కోట్లుగా ధర నిర్ణయించారు. మౌలిక సదుపాయాల కోసం అదనంగా మరో ఆరు లక్షలు. ఇలా ఇప్పటికే సుమారు 80 శాతం విల్లాలను విక్రయించినట్లు తెలిసింది. ఈ గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలో పార్కు లేదు. విల్లాల మధ్య 30 అడుగుల రోడ్డు లేదు. మురుగునీరంతా కొత్తచెరువులో కలిసే విధంగా డ్రెయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌ సౌకర్యాన్ని కల్పించడం గమనార్హం.


నజరానాతో నోరు మూశారు..

వందలాది విల్లాలను అక్రమంగా నిర్మిస్తున్నా ఆ వైపు అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకుండా డెవలపరే ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పేరు మీద స్థానికంగా కొందరు ప్రజా ప్రతినిధులు ముడుపులు, తమ బంధువుల పేరుతో విల్లాలను సొంతం చేసుకున్నట్లు సమాచారం. 2018లో దుండిగల్‌ మున్సిపాలిటీ ఏర్పడ్డాక ముగ్గురు కమిషనర్లు వచ్చి వెళ్లారు. వారి ప్రమేయంపై కూడా విచారణ జరుపుతున్నారు. పంచాయతీగా ఉన్న సందర్భంలో ఈఓలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో క్రిమినల్‌ కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ అధికారులకు వచ్చిన ఫిర్యాదును స్థానిక మున్సిపల్‌ అధికారులకు ఏడాది కిందటే అందజేసినా చర్యలు తీసుకోలేదని ఓ అధికారి తెలిపారు.

Updated Date - 2021-12-07T15:04:21+05:30 IST