మాయ మౌనం ఎవరికి లాభం?

ABN , First Publish Date - 2022-01-10T06:58:08+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌

మాయ మౌనం ఎవరికి లాభం?

  •   బీజేపీ వర్సెస్‌ అఖిలేశ్‌!
  • యూపీలో రెండు పార్టీల మధ్యే పోటీ!.. మాయావతి మౌనంతో బీఎస్పీలో స్తబ్దత
  • ఓటుబ్యాంకును తనవైపునకు తిప్పుకొనే ప్రయత్నాల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత
  • అఖిలేశ్‌ లక్ష్యంగా కమలనాథుల విమర్శలు.. ఒక్కడినే టార్గెట్‌ చేసిన హేమాహేమీలు
  • తిప్పికొడుతున్న సమాజ్‌వాదీ యువనేత.. అఖిలేశ్‌ చుట్టూనే యూపీ ఎన్నికలు!


న్యూఢిల్లీ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు ఆసక్తికర పరిణామాల దిశగా సాగుతున్నాయు. యూపీలో మళ్లీ గెలిచి.. మరోసారి తమ ఢిల్లీ పీఠానికి తిరుగులేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్న బీజేపీకి సమాజ్‌వాదీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. వాస్తవానికి ప్రతి ఎన్నికల్లోనూ బహుముఖ పోరు సాగే యూపీలో ఈసారి రెండు పార్టీల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతుందన్నట్లుగా రాజకీయ వాతావరణం కనిపిస్తోంది.


బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్తబ్దుగా ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా అంచనా వేస్తున్నారు. అధికార బీజేపీతోపాటు ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, ప్రియాంకాగాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటినుంచో ఎన్నికలకు సిద్ధమై జనంలోకి వెళ్తుండగా.. మాయావతి మాత్రం ఇప్పటిదాకా అటువంటి ప్రయత్నాలేమీ చేయలేదు. గత కొద్దికాలంగా మీడియా సమావేశాల్లో తప్ప.. ఎక్కడా కనిపించడంలేదు. దీంతో బీఎస్పీ అసలు రేసులో ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే బీఎస్పీ ఓటుబ్యాంకు ఎవరికి లాభిస్తుందన్న చర్చ కూడా మొదలైంది. దళితుల ఓటుబ్యాంకు బలంగా ఉన్న బీఎస్పీ.. గతంలో దళితులు-బ్రాహ్మణులను ఏకం చేసి ఒంటరిగా అధికారాన్ని కూడా చేపట్టింది.


అయితే అధికశాతం బ్రాహ్మణులు మొదటినుంచీ బీజేపీ వెంటే ఉంటూ వస్తున్న నేపథ్యంలో బీఎస్పీ అనుకూలురైన బ్రాహ్మణులు ఇప్పుడు తమవైపునకు వస్తారని కమలనాథులు భావిస్తున్నారు. కానీ, ప్రియాంకాగాంధీ నేతృత్వంలో యూపీలో కాంగ్రెస్‌ క్రియాశీలంగా మారడంతో బ్రాహ్మణుల్లో చీలిక రావచ్చని, బీజేపీతోపాటు కాంగ్రెస్‌ వైపు కూడా మొగ్గుచూపవచ్చనే అంచనా ఉంది. ఇక.. బీఎస్పీ ఓటుబ్యాంకు అయిన దళితుల ఓట్లను కాంగ్రెస్‌ ఏ మేరకు చీలుస్తుందన్నది కూడా ప్రధానం కానుంది. బీఎస్పీ కన్నా ముందు కాంగ్రె్‌సకు బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న దళితులు.. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ కాంగ్రెస్‌ వైపు మళ్లుతారా అన్నది కీలకమవుతుంది. కాంగ్రెస్‌ దళితుల ఓట్లను రాబట్టుకోగలిగితే.. అది సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)కి నష్టమని, తద్వారా తమకు లాభిస్తుందని బీజేపీ భావిస్తోంది. 




అఖిలేశ్‌పైనే కమలనాథుల గురి..

మరోవైపు అంబేద్కర్‌వాదులు, బీసీలు కలిసికట్టుగా బీజేపీని తిప్పికొట్టాలని ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఇచ్చిన పిలుపునకు మంచి స్పందన లభించిందని దళితులను ఆయన తనవైపు తిప్పుకొంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనికితోడు వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిన్న చిన్న పార్టీలను కూడా ఆయన కలుపుకొని పోతున్నారు. దీంతో కమలనాథులు తమ దృష్టిని పూర్తిగా అఖిలేశ్‌పై కేంద్రీకృతం చేశారు.


ప్రధాని మోదీ నుంచి రాష్ట్ర బీజేపీ నేతల దాకా ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రచార సభల్లో అఖిలేశ్‌నే లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో.. ఇప్పుడు యూపీ రాజకీయమంతా అఖిలేశ్‌ చుట్టూనే తిరుగుతోంది. ‘‘యూపీలో ఈసారి ఎవరు గెలుస్తారంటే ఏం చెప్పగలను? అఖిలేశ్‌ యాదవే అని నేనంటాను. ఏ విధంగానైనా ఆయన గెలుపును బీజేపీ అడ్డుకుంటుంది. అఖిలేశ్‌ను ఒక్కడిని చేసి.. ప్రధాని మోదీ నుంచి సీఎం యోగి దాకా ముప్పేట దాడులు చేస్తున్నారు. అఖిలేశ్‌ మాత్రం అభిమన్యుడిలా పోరాడుతున్నారు’’ ఇవి ఢిల్లీ సరిహద్దుల్లోని ఘజియాబాద్‌లో ఒక కారు డ్రైవర్‌ చేసిన వ్యాఖ్యలు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ముఖచిత్రాన్ని ఈ వ్యాఖ్యలు స్పష్టంగా ఆవిష్కరిస్తున్నాయి.


ప్రధాని మోదీ మొదలుకొని..

‘‘ఎర్ర టోపీ (అఖిలేశ్‌ ధరించేది) అంటే రెడ్‌ అలర్ట్‌’’ అని వ్యాఖ్యానించడం ద్వారా ప్రధాని మోదీ స్వయంగా అఖిలేశ్‌పై విమర్శలు ప్రారంభించారు. ఇటీవల కాన్పూర్‌లో ఒక సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంటిపై ఈడీ దాడులు జరిగి కోట్ల రూపాయలు పట్టుబడ్డ తర్వాత మోదీ ఆ విషయాన్ని బహిరంగ సభలో ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అయితే ఏకంగా అఖిలేశ్‌కు మహ్మద్‌ అలీ జిన్నా ఆరాధ్య దైవమని అన్నారు. కాగా, అఖిలేశ్‌ యాదవ్‌ ఉగ్రవాదులపై కేసులు ఉపసంహరించుకున్నారని, సంక్షేమ పథకాల నిధులు కాజేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. బీజేపీ హేమాహేమీలంతా తనపై దాడులు చేస్తున్నా అఖిలేశ్‌ చెక్కు చెదరకపోగా.. వారిని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో వారు అఖిలేశ్‌ ఉచ్చులో పడి.. దుర్భాషలాడుతున్నారు. ఈ విమర్శలు,  అఖిలేశ్‌కు సన్నిహితులపై ఈడీ దాడులు కలగలిపి ప్రజల్లో సానుభూతిని పెంచే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 




ఆ మాయ ఎక్కడ?

యూపీ ఎన్నికల్లో కనిపించని మాయావతి దూకుడు


ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో దాదాపు ప్రతి ఎన్నికల్లోనూ ప్రబల శక్తిగా నిలిచిన బహుజనసమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి దూకుడు ప్రస్తుతం ఎక్కడా కనిపించడంలేదు. తన పార్టీ నుంచి అగ్రనేతలు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు వలస వెళుతున్నా ఆమె మౌనం పాటిస్తుండడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. యూపీలో పెద్దగా బలం లేని కాంగ్రె్‌సతో సహా అన్ని పార్టీలు ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల పోరుకు సమాయత్తమవుతుండగా, బీఎస్పీ ఇంతవరకూ జన క్షేత్రంలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు కరోనా కారణంగా బహిరంగ సభలను నిషేధించిన నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.


అనేక సర్వేలు ఇప్పటికే మాయావతి ఎన్నికల రేసులో లేరని తీర్మానించాయి. మాయావతిలో ఏర్పడ్డ ఈ స్తబ్దత.. వ్యూహరచనలో భాగమా? లేక తన అంతాన్ని తానే లిఖించుకుంటున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రానున్న  బీఎస్పీయే అధికారంలోకి వస్తుందని మాయావతి ప్రకటించినా.. అందుకు తగ్గ సన్నాహాలు మాత్రం ఇప్పటివరకూ చేయకపోవడం గమనార్హం. మాయ క్రియాశీలంగానే ఉన్నారని ఆమె కుడిభుజమైన ఎంపీ సతీశ్‌చంద్ర మిశ్రా చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత? అన్నది చర్చనీయాంశమైంది. 


నానాటికీ తగ్గిపోతున్న ఓట్ల శాతం..

దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా మాయావతి 1993లో దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో పగ్గాలు చేపట్టారు. అనంతరం 2007లో 30.43 శాతం ఓట్లు, 206 సీట్లతో పూర్తి మెజారిటీతో అధికారం అందుకున్నారు. అద్భుతమైన సామాజిక సమీకరణల ద్వారా బ్రాహ్మణులు, యాదవేతర ఓబీసీలు, ముస్లింలను తమ పార్టీ వైపునకు తిప్పుకొని రాజకీయ పండితులను సైతం దిగ్ర్భాంతి పరిచారు. ఆ తరువాత 2012లో బీఎస్పీ 25.91 శాతం ఓట్లకు పడిపోయినప్పటికీ రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచి బీజేపీని మూడో స్థానానికి నెట్టి వేసింది. అయితే 2017లో పరిస్థితి ఇంకా దిగజారిపోయి 22.2 శాతం ఓట్లతో మూడోస్థానానికి పడిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో కలిసి పోటీ చేసినప్పటికీ మాయావతి ఎక్కువ సీట్లు, ఓట్లతో రెండో స్థానం పొందారు.


కానీ, ప్రస్తుత ఎన్నికల్లో కనీసం ఓట్ల శాతాన్ని నిలబెట్టుకునేందుకైనా బలమైన కృషి చేస్తున్నట్లు కనిపించకపోవడంతో బీఎస్పీ ఉనికిపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీంతో మాయావతికి అండగా ఉన్న జాతవులు ఏ పార్టీ వైపు వెళతారన్న చర్చ జరుగుతోంది. బీఎస్పీ క్రియాశీలకంగా ఉండి.. దళితుల ఓట్లను గంపగుత్తగా వేయించుకుంటే అది తమకు లాభించేదని బీజేపీ నేతలు భావిస్తున్నారు. కానీ,  మాయావతి బలహీనపడడంతో ఆ ఓట్లు సమాజ్‌వాది పార్టీకిగానీ, కాంగ్రె్‌సకుగానీ మళ్లే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు.


ఇప్పుడు కాంగ్రెస్‌ ఎంత ఎక్కువగా దళితుల ఓట్లను చీలిస్తే.. అఖిలేశ్‌ పార్టీకి అంత నష్టం జరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ముస్లింలు కూడా బీఎస్పీ నుంచి ఎటువైపు మొగ్గుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముస్లింలు అఖిలేశ్‌ పార్టీకి ఓట్లు వేయొద్దంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇటీవల పిలుపునివ్వడంతో.. ఆయన బీజేపీకి ప్రయోజనం కలిగించే ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బీఎస్పీ ఓటుబ్యాంకు ఈ ఎన్నికల్లో కీలకపాత్రే పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


మాయావతి మౌనం వెనుక?


మాయావతి వెనక్కి తగ్గడానికి ఆమెకు దుమ్ము ఎలర్జీ అని, డాక్టర్లు ఆమెను సూర్యరశ్మికి దూరంగా ఉండమని చెప్పారని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. యత్యాయత్నం భయం ఆమెలో ఉందని ఒక నాయకుడు అన్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల కారణంగా ఆమె భయపడుతున్నారని కూడా మరో వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఇవేవీ మాయావతి మౌనానికి కారణం కాదని, ఆమెను తక్కువగా అంచనా వేయలేమని ఆమె అభిమానులు అంటున్నారు.


Updated Date - 2022-01-10T06:58:08+05:30 IST