అధ్యక్షపీఠం దక్కేదెవరికో?

ABN , First Publish Date - 2021-09-17T03:57:07+05:30 IST

అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోననే విషయం ప్రస్తుతం చర్చనీయాంశ మవుతోంది. పార్టీ అధిష్టానం సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించడంతో జిల్లా అధ్యక్ష పదవిని ఆశించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీకి, పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు అనుసంధాన కర్తగా ఉండే అధ్యక్ష పదవి కీలం కానుంది.

అధ్యక్షపీఠం దక్కేదెవరికో?

నెలాఖరులోగా టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటు

ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు

ఐదేళ్ల అనంతరం కమిటీల ఏర్పాటు

మంచిర్యాల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందోననే విషయం ప్రస్తుతం చర్చనీయాంశ మవుతోంది. పార్టీ అధిష్టానం సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించడంతో జిల్లా అధ్యక్ష పదవిని ఆశించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీకి, పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు అనుసంధాన కర్తగా ఉండే అధ్యక్ష పదవి కీలం కానుంది. దీంతో జిల్లా అధ్యక్షునిగా ఎవరిని నియమిస్తే సబబుగా ఉంటుందనే విషయమై మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తుది నిర్ణయం పార్టీ అధి ష్టానం తీసుకోనుండగా అనునాయుల పేర్లను ఖరారు చేయడంలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంలో భాగం గా అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని అధిష్టానం నిర్ణయిం చింది. ఇందులో భాగంగా ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, పట్టణ కమిటీలను నియమించగా, 12 నుంచి 20 వరకు మండల కమిటీ లను, నెలాఖరులోగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 

క్షేత్రస్థాయిలో పటిష్టం కోసం

టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఐదేళ్ల అనంతరం సంస్థాగత కమిటీలపై దృష్టి సారించింది. ఐదేళ్లుగా గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీల ఏర్పాటుపై అంతగా ఆసక్తి చూపని అధిష్టానం రాష్ట్రంలో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయా కమిటీల పునరుద్ధరణకు పూనుకున్నది.  కాంగ్రెస్‌, బీజేపీలు సంస్థాగత కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేయడంతో అధికార పార్టీ కూడా ఆ దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్‌, బీజేపీలు  గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీలతోపాటు బూతుల వారీగా కమిటీ లను ఏర్పాటు చేసుకొని క్షేత్రస్థాయిలో పార్టీల పటిష్టానికి చర్యలు చేపడుతున్నాయి. నిత్యం ఓటర్లతో సంబంధాలు పెట్టుకుంటూ సమస్యలు పరిష్కరించే పనిలో ఆయా పార్టీల నాయకులు నిమగ్నమవుతున్నారు. విపక్షాలు పార్టీ సంస్థాగత నిర్మాణంలో దూసుకుపోతుండటం గమనిం చిన టీఆర్‌ఎస్‌ అధిష్టానం గ్రామ, మండల, జిల్లాస్థాయి కమిటీల ఏర్పాటుకు పూనుకున్నది. 

అధ్యక్ష పదవి కీలకం

జిల్లా అధ్యక్ష పదవి కీలకం కావడంతో నియోజకవర్గాల ఎమ్మెల్యేల తోపాటు అధిష్టానం కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండగా జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఇటీవల పార్టీ కోసం సొంత కార్యాల యాన్ని ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడితో సహా, ఇతర ప్రముఖులు పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండేందుకు కార్యాల యం ఉపయోగపడనుంది. పార్టీ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ జిల్లా అధ్యక్షునికే అధ్యక్షత వహించే అధికారం, ప్రోటోకాల్‌ ఉండటంతో అత్యంత కీలకంగా మారింది. పార్టీ పరంగా ఏ కార్యక్రమం జరిగినా అధ్యక్షునిదే ప్రఽధాన పాత్ర కావడంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. పార్టీ శ్రేణులను, ప్రజాప్రతినిధులను సమన్వయ పరిచే సమర్థత ఉన్న వారినే ఎంపిక చేయాలని పార్టీ భావిస్తోంది. భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవికి పోటీపడే ఆలోచన లేనివారిని, రిజర్వుడ్‌ అసెంబ్లీ స్థానాల్లోని క్రియాశీల నేతలకు అవకాశం కల్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

తెరపైకి పలువురి పేర్లు

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్ష పదవికి ప్రధానంగా మూడు పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు సన్నిహితుడుగా పేరున్న సీనియర్‌ నేత, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్‌ చెన్నూరుకు చెందిన మూల రాజిరెడ్డి పేరు వినిపిస్తోంది. ఆయనతోపాటు తెలంగాణ ఉద్యమ నేత, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచిర్యాలకు చెందిన గోగుల రవీందర్‌రెడ్డి, దండేపల్లి మండల మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నాయకుడు వెల్గనూర్‌కు చెందిన బండారి మల్లేష్‌ పేర్లను  పరిశీలిస్తున్నట్లు సమాచారం. వీరేగాక మాజీ ప్రభుత్వ విప్‌, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పేరును అధిష్టానం పరిగణలోకి తీసుకు న్నట్లు తెలుస్తోంది. అయితే నల్లాల ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఉన్నందున ఒకే కుటుంబంలో రెండు పదవులు ఇస్తే సమస్యలు తలెత్తుతాయనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ నాయకుడైన మూల రాజిరెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.  మంచిర్యాల నియోజక వర్గం నుంచి పోటీ పడుతున్న గోగుల రవీందర్‌రెడ్డి, బండారి మల్లేష్‌ల విషయమై ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. 

Updated Date - 2021-09-17T03:57:07+05:30 IST