మిమ్మల్ని కొడితే ఎవరొస్తారు?!

ABN , First Publish Date - 2022-08-18T09:37:40+05:30 IST

విద్యుత్‌ బకాయిల వసూలు కోసం వెళ్లిన ఆ శాఖ ఏఈ గురుమూర్తిపై అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామంలో వైసీపీకి చెందిన నెరిమెట్ల సర్పంచి యోగేంద్ర రెడ్డి దాడి చేశారు.

మిమ్మల్ని కొడితే ఎవరొస్తారు?!

  • విద్యుత్‌శాఖ ఏఈపై వైసీపీ సర్పంచి దాడి
  • బిల్లు చెల్లించని తన బంధువు విద్యుత్‌
  • కనెక్షన్‌ తొలగించడంపై ఆగ్రహం
  • బకాయిలు వసూలు చేస్తుండగా వచ్చి దౌర్జన్యం
  • పోలీసులకు పరస్పర ఫిర్యాదులు


ఉరవకొండ, ఆగస్టు 17: విద్యుత్‌ బకాయిల వసూలు కోసం వెళ్లిన ఆ శాఖ ఏఈ గురుమూర్తిపై అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాయంపల్లి గ్రామంలో వైసీపీకి చెందిన నెరిమెట్ల సర్పంచి యోగేంద్ర రెడ్డి దాడి చేశారు. ఆపై ఏఈ కూడా తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఎదురు ఫిర్యాదు చేశారు. బాధిత ఏఈ కథనం ప్రకారం.. రాయంపల్లి గ్రామంలో చంద్రహాస్‌ రెడ్డి అనే వ్యక్తి రెండేళ్ల నుంచి రూ.31 వేలు బిల్లు బకాయి ఉన్నాడు. అప్పటి నుంచి విద్యుత్‌ సిబ్బంది అడుగుతున్నా చెల్లించకపోగా, వారిని బెదిరిస్తూ వస్తున్నాడు. దీంతో మొండి బకాయి బిల్లు వసూలు కింద ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యుత్‌ కనెన్షన్‌ను తొలగించారు.  దీనిపై చంద్రహాస్‌ రెడ్డి సమీప బంధువు, నెరిమెట్ల సర్పంచి యోగేంద్ర రెడ్డి ఈ విషయమై ఏఈకి ఫోన్‌ చేసి.. చంద్రహాస్‌ విద్యుత్‌ కనెక్షన్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. 


రెండేళ్లుగా బిల్లు బకాయి ఉన్నారంటూ పరిస్థితిని వివరించి, డబ్బు కడితే కనెక్షన్‌ను పునరుద్ధరిస్తామని చెప్పినా.. సర్పంచి వినకుండా ఏఈని దుర్భాషలాడారు. ఈ క్రమంలో ఏఈ గురుమూర్తి బుధవారం బిల్లుల వసూలుకు రాయంపల్లి వెళ్లారు. ఈ విషయం తెలిసి నెరిమెట్ల సర్పంచి యోగేంద్ర రెడ్డి తన అనుచరులతో వచ్చి ఏఈపై దాడికి పాల్పడ్డారు. సిబ్బందిపై కూడా దౌర్జన్యం చేశారు. ‘మిమ్మల్ని కొడితే ఎవరు సాక్ష్యం చెబుతారు?’ అని సర్పంచ్‌ బెదిరించాడని, నోటికొచ్చినట్లు తిట్టాడని బాధితులు వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఏఈ గురుమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఏఈ తన చొక్కా చించేసి, దాడికి పాల్పడ్డాడని, అక్కడే ఉన్న ఎస్సీ మహిళను కూడా దుర్భాషలాడారని సర్పంచి కూడా ఎదురు ఫిర్యాదిచ్చారు.

Updated Date - 2022-08-18T09:37:40+05:30 IST