సీఎస్‌లు కోర్టు మెట్లెక్కడానికి కారణం ఎవరు?

ABN , First Publish Date - 2022-03-09T23:38:33+05:30 IST

రాష్ట్రంలో కలెక్టర్లు, శాఖాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు..

సీఎస్‌లు కోర్టు మెట్లెక్కడానికి కారణం ఎవరు?

అమరావతి: రాష్ట్రంలో కలెక్టర్లు, శాఖాధిపతులు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు.. ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే (చీఫ్‌ సెక్రటరీ-సీఎస్‌) అధిపతి. ప్రభుత్వ పరిపాలన మొత్తం ఆయన/ఆమె పేరిటే సాగుతుంది. అలాంటి  సీఎస్‌లు కోర్టు మెట్లు ఎక్కడం ఏమీలో సర్వసాధారమైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎస్‌గా నీలం సాహ్నిని సీఎస్‌గా నియమించారు. ఆ తర్వాత ఆథిత్యనాథ్ దాస్, ఇప్పుడు సమీర్ శర్మ.. ఈ ముగ్గురు హైకోర్టు మెట్లెక్కినవారే.  మేం చెప్పిందే చేయాలి.. చట్టాలు, నిబంధనలు ఆ తర్వాతేనంటూ ప్రభుత్వ పెద్దలు జారీచేస్తున్న హుకుంలు, తీసుకొస్తున్న ఒత్తిళ్లు.. ఇలా చేస్తేనే ఆ పదవిలో ఉంటారనే హెచ్చరిక సంకేతాల కారణంగానే సీఎస్‌లు  కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతోందని అనుభవజ్ఞులు అంటున్నారు. 


స్థానిక ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాల్సిన నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆ పని చేయకపోవడంతో ఆమె కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీకి స్వంతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. దాన్ని కాదని ప్రభుత్వం వ్యవహరించింది. ఎన్నికల నిర్వహణకు సహకరించలేదు. ఈ విషయం ఎస్‌ఈసీకి సహకరించాల్సిన నాటి సీఎస్ సాహ్ని ప్రభుత్వం తరపున వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. మొత్తం యంత్రాన్ని ఎన్నికల నిర్వహణకు సన్నదం చేయాల్సి ఉండగా ఆమె ఆ పని చేయలేదు. ఎస్‌ఈసీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆమెకు కోర్టుకు రావాల్సి వచ్చింది.


ఇక నీలం సాహ్ని తర్వాత సీఎస్‌గా పనిచేసిన ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా కోర్టు మెట్లెక్కారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసినవారందరికీ బిల్లులు చెల్లించడం ప్రభుత్వ బాధ్యత. ఈ చెల్లింపు నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వం ఉన్నా.. అనుమతించిన మేరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించడం సర్వసాధారణ విషయం. కానీ జగన్‌ ప్రభుత్వం దానిని కూడా రాజకీయం చేసింది. టీడీపీ సర్కారు హయాంలో చేసిన ఉపాధి పనులకు బిల్లులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టేసింది. దీంతో పనులు చేసిన పలువురు ఆర్థికంగా చితికిపోయారు. చివరకు కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం సమన్లు జారీచేయడంతో ఆదిత్యనాథ్‌ దాస్‌ కోర్టుకు హాజరయ్యారు.


కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంలో ప్రస్తుత సీఎస్‌ సమీర్‌శర్మ మంగళవారం కోర్టు ముందు హాజరయ్యారు. సొంత డబ్బుపెట్టి ప్రభుత్వ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు తీవ్ర  వ్యాఖ్యలు చేసింది. బిల్లులు చెల్లింపు క్రమపద్ధతిలో జరగాలి. అదేమీ లేకపోవడం, ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంచడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై కొందరు కాంట్రాక్టర్లు కేసులు వేయడంతో సమీర్‌శర్మ కోర్టుకు సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించనందుకు ఆయన గతంలో కూడా ఒకసారి సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను కోర్టుకు హాజరవడం ఇదే తొలిసారని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుకు క్షమాపణలు కూడా చెప్పడం గమనార్హం. ఏ ప్రభుత్వాలు ఉన్నా.. సీఎస్‌లు తమ విధులను స్వేచ్ఛగా నిర్వర్తించే పరిస్థితులు లేకపోవడం, నిబంధనలను పాటించకపోవడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్నది నిర్వివాదాంశం.

Updated Date - 2022-03-09T23:38:33+05:30 IST