ఎగ్గిందెవరు?

ABN , First Publish Date - 2022-06-28T04:51:50+05:30 IST

కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య బహిరంగ చర్చ పేరిట కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పది రోజులుగా కొనసాగిన రాద్ధాంతంతో ఎవరికి లాభం చేకూరింది? అనే విషయమై చర్చ జరుగుతోంది.

ఎగ్గిందెవరు?

ఎమ్మెల్యే బీరం, జూపల్లి కృష్ణారావు సవాళ్లు.. ప్రతి సవాళ్ల నేపథ్యంలో మరింత పెరిగిన దూరం 

టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మౌనం వెనుక బోధపడని మర్మం 

విపక్షాలకు తామే అస్త్రాలను సమకూర్చినట్లయ్యిందని టీఆర్‌ఎస్‌లో గుసగుసలు


 నాగర్‌కర్నూల్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల మధ్య బహిరంగ చర్చ పేరిట కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పది రోజులుగా కొనసాగిన రాద్ధాంతంతో ఎవరికి లాభం చేకూరింది? అనే విషయమై చర్చ జరుగుతోంది. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం మౌనం దాల్చడంలో మర్మమేంటి? బహిరంగ చర్చపై జరిగిన రచ్చతో కారు పార్టీకి మైలేజ్‌ వచ్చిందా? అని నాగర్‌కర్నూల్‌ జిల్లా అంతటా చర్చించు కుంటున్నారు. దీనికి రాజకీయ విశ్లేషణలు కూడా తోడు కావడంతో ప్రాధాన్యం చేకూరింది. అభివృద్ధి సహా వ్యక్తిగత విమర్శలపై జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిల మధ్య తలెత్తిన విబేధాలతో ఇరువర్గాల మధ్య వివాదం మరింత ముదిరిందనే భావన కూడా వ్యక్తమవుతోంది. సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం వ్యవహరించిన తీరు కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. టీఆర్‌ఎస్‌లో అధినేత కనుసన్నల్లో పడడం విషయం దేవుడెరుగు. చిన్న తప్పుదొర్లినా.. పరిస్థితి ఎలా ఉంటుందో సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర నాయకులందరికీ బాగా తెలుసు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌లోనే ఉంటూ బహిరంగ చర్చ విషయంలో రెండు వర్గాలు కూడా మెట్టు దిగక పోగా, వెనక్కి తగ్గని అంశం పట్ల రాజకీయ విశ్లేషణలు అనేక కోణాల్లో ఆవిష్కృతమవుతున్నాయి. 


అదే కారణమా?

 బీరం, జూపల్లి ఇద్దరూ టీఆర్‌ఎస్‌లోనే ఉండడంతో వీరిద్దరి మధ్య పోటీ వాతావరణాన్ని పెంపొందించి విపక్షాలైన కాంగ్రెస్‌, బీజేపీలను సైడ్‌ ట్రాక్‌లో పెట్టే ఉద్దేశమే ప్రధానంగా కన్పిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొం టున్నారు. క్రమశిక్షణ, అధిష్ఠానం ఆదేశాలు కచ్చితంగా అమలు కావాలనే బలమైన సంకల్పం ఉండి ఉంటే టీఆర్‌ఎస్‌లోనే ఇరువురు ప్రధాన నాయకుల మధ్య బహిరంగ చర్చ అనే అంశం తెరమీదకు రావడం సంగతి దేవుడెరుగు, ఆ యోచన అయినా వచ్చేదా అని వారంటున్నారు. అయితే బహిరంగ చర్చ విషయంలో ఎవరికి వారే అభివృద్ధి, ఇతరత్రా ఆరోపణలపై వేర్వేరుగా మీడియా సమా వేశాలు నిర్వహించి వివరణ ఇచ్చుకున్నప్పటికీ బీరం, జూపల్లి వర్గీయుల మధ్య పూడ్చలేని అగాథం ఏర్పడడానికి టీఆర్‌ఎస్‌ అధిష్ఠానమే ప్రధాన కారణమనే వాదన విన్పిస్తోంది. ఈ అంశంలో సహజంగానే కాంగ్రెస్‌, బీజేపీలకు టీఆర్‌ఎస్‌ నాయకులే అస్త్రాలు సమకూర్చి నట్లయ్యింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఇద్దరిని దుయ్యబట్టారు. కేటీఆర్‌ డైరెక్షన్‌లోనే ఈ తతంగమంతా నడుస్తుం దంటూ వ్యా ఖ్యనించారు. కాంగ్రెస్‌ నాయకుడు సీఆర్‌.జగదీశ్వర్‌రావు కూడా ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో విపక్షాలు బలప డకుండా చేసే క్రమంలో భాగంగానే టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుల మధ్య బహిరంగ చర్చకు అంతర్గతంగా పచ్చజెండా ఊపిందనే వాదన కూడా విన్పిస్తోంది. 

Updated Date - 2022-06-28T04:51:50+05:30 IST