టీఎంసీ పగ్గాలు అభిషేక్ బెనర్జీ చేపడితే అభ్యంతరం ఏమిటి? : బెంగాల్ మంత్రి

ABN , First Publish Date - 2021-03-23T21:54:38+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీకి

టీఎంసీ పగ్గాలు అభిషేక్ బెనర్జీ చేపడితే అభ్యంతరం ఏమిటి? : బెంగాల్ మంత్రి

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీకి అత్యంత సన్నిహితుడు, మంత్రి ఫిర్హాద్ హకీమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ పగ్గాలను అభిషేక్ బెనర్జీ చేపడితే ఎవరికీ అభ్యంతరం ఉండబోదన్నారు. ఓ న్యూస్ ఛానల్‌తో మంగళవారం హకీమ్ మాట్లాడుతూ టీఎంసీ దివిటీని తదుపరి తరం చేపట్టాలన్నారు. 


పశ్చిమ బెంగాల్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్న సమయంలో బీజేపీ, టీఎంసీ హోరా హోరీ తలపడుతున్నాయి.  టీఎంసీ వారసత్వ రాజకీయాలు చేస్తోందని ఇప్పటికే బీజేపీ ఘాటుగా విమర్శిస్తోంది. ఇటువంటి తరుణంలో హకీమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ ప్రధాన ప్రచారకర్తలు మమత బెనర్జీ, అభిషేక్ బెనర్జీ శాసన సభ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అభిషేక్ ప్రస్తుతం టీఎంసీ యువజన విభాగానికి అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు కూడా. 


హకీమ్ మాట్లాడుతూ, ఇవి వారసత్వ రాజకీయాలని తాను భావించడం లేదన్నారు. యూత్ వింగ్‌ను నిర్వహించడానికి యువ నేతలు ముందుకు వస్తారన్నారు. సువేందు అధికారి బీజేపీలో చేరిన నేపథ్యంలో, ఆయన తర్వాత వరుసలో అభిషేక్ బెనర్జీ ఉన్నారని చెప్పారు. తదుపరి తరం బాధ్యతలను చేపట్టడానికి ముందుకు రావాలన్నారు. తాను మమత బెనర్జీ దాదాపు సమాన వయస్కులమని చెప్పారు. పార్టీ దివిటీని మోయాలని, తదుపరి తరం నుంచి ఎవరో ఒకరు రావాలని చెప్పారు. అభిషేక్ వస్తే, ఎవరికైనా అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. 


ఇదిలావుండగా, అభిషేక్ బెనర్జీ కారణంగానే సువేందు అధికారి టీఎంసీని విడిచిపెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. టీఎంసీలో అభిషేక్ ప్రాబల్యం పెరుగుతుండటంతో సువేందు ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు కొందరు చెప్తున్నారు. 


Updated Date - 2021-03-23T21:54:38+05:30 IST