‘దేవర’గట్టు.. పట్టు ఎవరిది?

ABN , First Publish Date - 2022-10-04T05:24:16+05:30 IST

దేవరగట్టు అంటేనే గుర్తుకొచ్చేది దసరా పర్వదినాన అర్ధరాత్రి జరిగే జైత్ర యాత్ర.

‘దేవర’గట్టు.. పట్టు ఎవరిది?
దేవరగట్టులో కర్రల సమరం (ఫైల్‌)

కర్రల సమరం వద్దు
భక్తితో బన్ని ఉత్సవాలు జరుపుకుందాం
ఆలూరు, హొళగుంద మండలాల్లో  పోలీసుల అవగాహన
కర్ర లేనిదే జైత్రయాత్ర లేదంటున్న భక్తులు
 రేపు కర్రల సమరం


దేవరగట్టు అంటేనే గుర్తుకొచ్చేది దసరా పర్వదినాన అర్ధరాత్రి జరిగే జైత్ర యాత్ర. అదే కర్రల సమరం.  మూడు గ్రామాల భక్తులు..   దేవుడిని వశపరుచుకోడానికి తలపడటమే   బన్ని ఉత్సవం. అసురులపై దేవతులు సాధించిన విజయానికి గుర్తుగా జైత్రయాత్ర (బన్ని) ఉత్సవం జరుపుకుంటున్నారు. త్రేతాయుగం నుంచి ఈ ఆనవాయితీ వస్తోందని దేవరగట్టు సమీప గ్రామాల భక్తుల నమ్మకం. ఈసారి కూడా దసరా సందర్భంగా బన్ని ఉత్సవాన్ని  ఘనంగా జరిపాలని నెరిణికి, నెరిణికి తాండ, కొత్తపేట గ్రామాల భక్తులు  ఓ వైపు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు కర్రలు వద్దు.. భక్తితో పూజలు చేద్దాం..కర్రలు తెస్తే కేసులు తప్పవని ఆలూరు, హొళగుంద మండలాల్లోని  గ్రామాలలో పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు.  కలెక్టరు కోటేశ్వరరావు, ఎస్పీ సిద్ధార్థ కౌశిల్‌ ఇప్పటికే అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 5న బుధవారం అర్ధరాత్రి శ్రీమాళ మల్లేశ్వరస్వాములు కొలువైన దేవరగట్టుపై పట్టు ఎవరిది..? భక్తులదా?.. పోలీసులదా..? పల్లెసీమల్లో ఇదే చర్చ. ఆ వేడుక చూడాలంటే దసరా పర్వదినాన దేవరగట్టుకు వెళ్లాల్సిందే.   

-(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

హొళగుంద మండలం నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల సమీపంలో దేవరగట్టు శ్రీమాళ మల్లేశ్వర స్వామి సన్నిధానం ఉంది. సువిశాలమైన  కొండల మధ్య, ప్రకృతి అందాల మధ్య వెలసిన ఈ క్షేత్రం కేంద్రంగా దేవతలు నివసించడం వల్లే దేవరగట్టు అనే పేరు వచ్చిందని ఆలయ పండితులు వివరిస్తున్నారు. త్రేతాయుగంలో రుషులు, మునులు నిత్యం నిర్వహించే యజ్ఞయాగాలతో ఈ కొండ ఆధ్యాతిక శోభితమై విరాజిల్లేదని అంటారు. అయితే.. మణి మల్లాసుర అనే రాక్షసుడు రుషులు నిర్వహించే యజ్ఞాలను భగ్నం చేయడమే కాక వారిని హింసించేవాడని, ఆ రాక్షసుడి నుంచి రక్షణ కల్పించాలని శివ, పార్వతులను రుషులు వేడుకోగా.. పార్వతి సమేతుడై శివుడు మాళ మల్లేశ్వరుడిగా అవతరించి ఆ రాక్షసుడిని  సంహరించాడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. అయితే.. మరణం లేని ఆ అసురుడు శివుడి ఆజ్ఞతో మరణం పొందుతూనే ఏటా ఒక నరబలి కోరుతాడని, అందుకు సమ్మతించని శివుడు తన భక్తుల (గొరవయ్యలు)లో ఒకరు పిడికెడు రక్తం ధారపోస్తారని అభయం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. దీంతో ఆ రాక్షసుడు మరణించా డని భక్తుల నమ్మకం. శ్రీమాళ మాల్లేశ్వర స్వాములు సాధించిన విజయానికి గుర్తుగా చేసే విజయోత్సవ యాత్రే ఇప్పటికీ భక్తులు జరుపుకునే జైత్రయాత్ర (బన్ని) ఉత్సవం. ఈ ఉత్సవం  డొల్లబండ వద్ద భక్తులు చేసే పాలబాసలతో మొదలై.. 6వ తేదీ గురువారం ప్రధాన పూజారి చెప్పే దైవవాణి (కార్ణీక)తో  ముగుస్తుంది. బుధవారం అర్ధరాత్రి మాళ మల్లేశ్వరస్వాముల కళ్యాణం అనంతరం కొండ దిగువన సింహాసన కట్టపైకి ఉత్సవమూర్తులను చేర్చగానే డిర్ర్‌ర్ర్‌ర్ర్‌.. గోపరాక్‌ (బహుపరాక్‌) అంటూ కాళరాత్రి.. కాగడాల వెలుతురులో.. బండారు చల్లుకుంటూ.. ఇనుప రింగులు చుట్టిన పట్టుడు కర్రలతో భక్తులు సాగించే బన్ని ఉత్సవం  కర్రల సమరాన్ని తలపిస్తుంది. ఆ సమరమే ఈ ఉత్సవాలల్లో ప్రత్యేక ఆకర్షణ. ఈ కార్యక్రమానికి   ఇతర ప్రాంతాల భక్తులు కూడా హాజరవుతారు.

 ఉత్సవాలు సాగేదిలా..

సెప్టెంబరు 30న నెరణికి గ్రామంలో గణపతి పూజ, కంకణధారణ, నిశ్చితార్థం, ధ్వజారోహణ కార్యక్రమాలతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఉత్సవమూర్తులను దేవరగట్టు పైకి చేర్చారు. 5వ తేది బుధవారం కళ్యాణోత్సవం, జైత్రయాత్ర, రక్త తర్పణం, శమీవృక్ష పూజ, 6వ తేది ఉదయం నెరణికి గ్రామానికి చెందిన ఆలయ ప్రధాన అర్చకులు దేవవాణి (కార్ణీకం) చెబుతారు. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు దైవవాణి ప్రకారమే వచ్చే ఏడాది పంటలు సాగు చేయడం అనవాయితీ. 7వ తేదీ సాయంత్రం 4 గంటలకు మహా రథోత్సవం ఉంటుంది. 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచే గొరవయ్యలు నృత్యం, బలమైన ఇనుపు గొలుసు తెంపడం, దేవదాసీల క్రీడోత్సవం వంటి ఉత్సవాలు  జరుపుకుంటారు.  ఇరు రాష్ట్రాల జనం వేలాదిగా ఈ వేడుకలకు తరలివస్తారు. 9వ తేదీన శ్రీమాళ  మల్లేశ్వర స్వాములను నెరణికి గ్రామం చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయి.

Updated Date - 2022-10-04T05:24:16+05:30 IST