Assam శాసన సభ ఎన్నికల్లో ముందంజలో ఎవరు?

ABN , First Publish Date - 2021-05-02T15:43:48+05:30 IST

అస్సాంలో 126 శాసన సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి

Assam శాసన సభ ఎన్నికల్లో ముందంజలో ఎవరు?

న్యూఢిల్లీ : అస్సాంలో 126 శాసన సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 64 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వరుస విజయాలతో చరిత్ర సృష్టించాలని బీజేపీ ఆశిస్తోంది. వరుసగా గెలిచిన కాంగ్రెసేతర పార్టీగా రికార్డు సృష్టించాలనుకుంటోంది. 


ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆరోగ్య సూత్రాలను కట్టుదిట్టంగా పాటిస్తూ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 331 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటివద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6 తేదీల్లో మూడు దశల్లో ఈ ఎన్నికలు జరిగాయి. 


ఈ ఎన్నికల్లో బీజేపీ, అసోం గణపరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్), గణ సురక్ష పార్టీ (జీఎస్‌పీ) కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ కలిసి పోటీ చేస్తున్నాయి. తొలి దశలో 79.93 శాతం, రెండో దశలో 80.96 శాతం, మూడో దశలో 82.33 శాతం ఓట్లు పోలయ్యాయి. అధికార బీజేపీ 92 స్థానాల్లో పోటీ చేసింది, అసోం గణపరిషత్ 26 స్థానాల్లో పోటీ చేసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 94 స్థానాల్లో పోటీ చేసింది. ఏఐయూడీఎఫ్ 14 స్థానాల్లో పోటీ చేసింది. 


ఆదివారం ఉదయం 9.52 గంటలకు అందిన సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్లను లెక్కించినపుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అస్సాంలో 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలోని గ్రాండ్ అలయెన్స్ 15 చోట్ల ఆధిక్యంలో ఉంది. కొత్తగా ఏర్పాటైన అస్సాం జాతీయ పరిషద్-రాయ్‌జోర్ దళ్ కూటమి నాలుగు స్థానాల్లో ముందంజలో కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులు 16 స్థానాల్లోనూ, దాని మిత్ర పక్షం ఏజీపీ అభ్యర్థులు ఆరు స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు 14 స్థానాల్లోనూ, ఏఐయూడీఎఫ్ అభ్యర్థి ఒక స్థానంలోనూ ముందంజలో కనిపిస్తున్నారు. 


ఆదివారం ఉదయం 10.15 గంటలకు అస్సాంలోని 126 స్థానాల్లో 107 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సమాచారం తెలిసింది. దీని ప్రకారం బీజేపీ కూటమి 69 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2019లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో సాధించిన స్థానాల కన్నా ఒక స్థానం తగ్గినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమి 35 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. అంతకుముందు కన్నా నాలుగు స్థానాలు అధికంగా సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏజేపీ కూటమి ఒక స్థానంలో ముందంజలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నారు.

Updated Date - 2021-05-02T15:43:48+05:30 IST