చేరువ చేసిందెవరు? నిషేధిస్తున్నదెవరు?

ABN , First Publish Date - 2022-09-17T07:13:34+05:30 IST

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ కవర్ల వాడుకను నిషేధించింది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవర్నీ సంప్రదించకుండా ఒక బహిరంగసభలో..

చేరువ చేసిందెవరు? నిషేధిస్తున్నదెవరు?

ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌ కవర్ల వాడుకను నిషేధించింది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవర్నీ సంప్రదించకుండా ఒక బహిరంగసభలో ఫ్లెక్సీ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ఏకపక్షంగా ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఇది ఎంతవరకు సబబు? అయితే భవిష్యత్‌ తరాలకు ఇబ్బంది కలగజేసే ఈ ప్లాస్టిక్‌ –ఫ్లెక్సీ భూతాల్ని నిషేధించటం తప్పుకాదు. కానీ ప్రజల చెంతకు అతి తక్కువ ధరలలో, అందరికీ అందుబాటులోకి తెచ్చి, పూర్తిగా వాటికి అలవాటు పడిపోయిన తరువాత ఆ ఉత్పత్తులు సృష్టించే విషాన్ని గ్రహించి, నాలుక కర్చుకొని ఇంతవరకు వచ్చిన ఉత్పత్తులను ఒక్కసారిగా నిషేధించడాన్ని ఏమనాలి? ఇది ఎవరి తప్పిదం?


ఒకప్పుడు మార్కెట్‌లోని అంగళ్ళకు వెళ్ళే మనిషి చేతిలో గుడ్డ సంచో లేక వైర్‌ బుట్టో ప్రత్యేకంగా తీసుకొని వెళ్ళేవారు. కాని ఈ ప్లాస్టిక్‌ కవర్లు ప్రవేశపెట్టిన తరువాత మార్కెట్‌కు వెళ్లే మనిషికి సంచులు, బుట్టలు తీసుకెళ్ళే బాధలేకుండా పోయింది. ‘ఒకప్పుడు బుట్ట, సంచి అన్నవి ఉండేవట’ అని చెప్పుకునే విధంగా మార్పు వచ్చింది. ఒక సంచి లేదా బుట్ట కొనాలంటే కనీసం ఇరవై నుంచి అరవై రూపాయలు ఖర్చు చెయ్యాలి. కాని ప్లాస్టిక్‌ కవర్లు అర్ధరూపాయి, రూపాయికే లభించాయి. ఇది ప్రజలు సంచులు, బుట్టలు తీసుకెళ్ళే అలవాటును తప్పించేసింది. అదీకాక షాపులవాళ్లు కవర్లు ఉచితంగా ఇవ్వడం ప్రారంభించడంతో వీటి వాడుక ఇబ్బడి ముబ్బడిగా సాగుతున్నది. అంతేకాక పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మంచినీరు తాగేందుకు స్టీల్‌ గ్లాసులు వాడేవారు, ప్లాస్టిక్‌ గ్లాసులు వచ్చి వీటి వాడకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాయి. ఇలా అనేక రకాలుగా ప్లాస్టిక్‌ ఉత్పత్తులు వచ్చి... అవి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి భూగర్భంలో కలవలేని పరిస్థితి వచ్చింది. పైగా పర్యావరణానికి కాలుష్యం తెచ్చి, మానవ మనుగడే ప్రశ్నార్థకం కావడంతో ఇప్పుడు కేంద్రం నిద్ర లేచింది. తక్కువ మైక్రో మోతాదు కలిగిన ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించింది. ఇంతకుముందు కూడా నిషేధించినట్టు ప్రకటించినప్పటికీ, చూసీ చూడనట్లు ప్రవర్తించింది. ఎప్పటికప్పుడు ఇక నుంచి పూర్తి నిషేధం అంటూ చెబుతూ వస్తోంది. కవర్లు అమ్మే దుకాణాలకు భారీ అపరాధ రుసుములు వడ్డించింది. కవర్లు వాడుతున్న ప్రజలపై కొన్ని ప్రాంతాలలో నామమాత్రపు ఫైన్‌లు వసూలు చేసి కవర్లు వాడకుండా భయపెట్టింది. మళ్ళీ కొన్ని రోజులకు అంతా మామూలే. షాపుల్లో ప్లాస్టిక్‌ అమ్మడం, అవి ప్రజలు వాడుతూ ఉండటం, ప్రభుత్వాలు నిషేధిస్తూ ప్రకటన చేయడం సర్వ సాధారణమైపోయింది. దీంతో ప్రజలు కూడా ఈ నిషేధాన్ని పట్టించుకోవడం మానేశారు.


ప్లాస్టిక్‌ అమ్మే షాపులపై, కొని వాడే ప్రజలపై అసలు పలుమార్లు ఇలా ప్రభుత్వం నిషేధాజ్ఞలు ప్రయోగించేకంటే, ఏకంగా ప్లాస్టిక్‌ను ఉత్పత్తిచేసే కర్మాగారాల లైసెన్సులను రద్దు చేసి, తయారుకాకుండా ఆపగలిగితే, ఇక ప్లాస్టిక్‌ సృష్టే జరగదు కదా. ప్రజలకు ఆ ఉత్పత్తులు లభ్యం కానప్పుడు ప్రత్యామ్నాయం చూసుకుంటారు కదా! సాధారణ మనిషే ఇలా ఆలోచించగలిగినప్పుడు, దీనిని ఆచరణలో పెట్టి ప్రజలలో మార్పు తీసుకురావలసిన ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ ఉత్పత్తులు తయారీ కర్మాగారాలను ఎందుకు పూర్తిగా నిషేధించే సాహసం చేయడం లేదు? దీని వెనుక బడా కంపెనీల నుంచి పాలకులు పొందే లబ్ధి ఏమిటి? అన్న ఆలోచన ప్రజలలో కలుగుతున్నది.


ఇక గతంలో సాహిత్యసభలలో వాడే బ్యానర్లను ఫ్లెక్సీలు కాకుండా కేవలం గుడ్డ బ్యానర్లే వాడాలని కంకణం కట్టుకున్న వాళ్లమే. ఫ్లెక్సీల వలన గుడ్డ బ్యానర్లు రాసే వాళ్లు ఉపాధి కోల్పోతారు కనుక ఫ్లెక్సీలు వాడకూడదని తీర్మానించుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు, ఫ్లెక్సీలను వాడవలసిన పరిస్థితికి దిగజారాం. గతంలో గుడ్డ బ్యానర్‌ రాసేవాళ్ళు షాపు వీధికొకటి ఉండేది. ఇది రాయించాలంటే మీటింగ్‌ జరిగే వారం, రెండు వారాల ముందే ఆర్టిస్ట్‌ని సంప్రదించి, ఒకటికి రెండుసార్లు తిరిగితే గానీ సరైన సమయానికి బ్యానర్లు వచ్చేవి కావు. అదీ ఒక్కో బ్యానరుకు దాని సైజుని బట్టి రెండు వందల నుంచి ఇంకా ఎక్కువ చెల్లించాల్సి వచ్చేది. ఈ గుడ్డ బ్యానర్లు రాసే ఆర్టిస్టుల దగ్గర మరెందరో సహాయ ఆర్టిస్టులు ఉపాధి పొందేవారు. ఫ్లెక్సీల రాకతో కేవలం నిమిషాలలో, మనకి నచ్చిన ఫోటోలతో, చిన్న సైజు నుంచి అతి భారీ సైజులో బ్యానర్లు క్షణాలలో సిద్ధమవుతున్నాయి. పైగా అతి చౌకగా లభిస్తుండడంతో గుడ్డ బ్యానర్లు రాసే ఆర్టిస్టులకు కాలం చెల్లిపోయింది. అలాగే గతంలో సినిమా బోర్డులు, సినిమా హీరోలు, హీరోయిన్ల చిత్రాల సన్నివేశాలతో గీయాలంటే నెలల తరబడి ఆర్టిస్టులు కష్టపడవలసి వచ్చేది. వారికి ధనం కూడా బాగా వెచ్చించవలసి వచ్చేది. అయితే ఆర్టిస్టుల జీవనోపాధి ఎంతో మెరుగుగా ఉండేది. కాని తక్కువ సమయంలో, తక్కువ ధరతో తయారయ్యే ఈ ఫ్లెక్సీల రాకతో వీరి జీవనోపాధికి గండి కొట్టబడి, పూర్తిగా ఈ ఆర్టిస్టులు కనుమరుగైపోయారు.


ఇటువంటి సందర్భంలో ఇప్పుడు మన ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను నిషేధిస్తూ ప్రకటన చేయడంతో బ్యానర్లు వాడేవారికి ప్రత్యామ్నాయం కనిపించని పరిస్థితి ఉత్పన్నమయింది. తక్కువ సమయంలో చౌకగా దొరికే వాటిని ప్రజలకు అలవాటు చేసిన ప్రభుత్వాలు, ఇప్పుడు ప్రత్యామ్నాయం చూపకుండా నిషేధించడం ఎంతవరకు ఫలప్రదమవుతుందన్నది ప్రశ్నార్థకం. పర్యావరణానికి ముప్పువాటిల్లే ఉత్పత్తులపై అవగాహన, పర్యవేక్షణ లేకుండా ప్రజలకు అలవాటు చేసి... ఇప్పుడు నిషేధించడం ప్రభుత్వాల వైఫల్యం కాదా? ఎవరు శిక్షార్హులు? కొన్నవాడా? తయారీదారా? అవి కనుగొన్నవాడా? మార్కెట్‌లోకి గుడ్డిగా ప్రవేశపెట్టినవాడా?


చలపాక ప్రకాష్‌

Updated Date - 2022-09-17T07:13:34+05:30 IST