కేటీఆర్ అంటే ఎవరు..? : YS Sharmila

ABN , First Publish Date - 2021-07-16T18:29:55+05:30 IST

టీఆర్ అంటే ఎవరు..? అని వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల ప్రశ్నించారు..

కేటీఆర్ అంటే ఎవరు..? : YS Sharmila

హైదరాబాద్ : కేటీఆర్ అంటే ఎవరు..? అని వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల ప్రశ్నించారు. శుక్రవారం నాడు తన పార్టీ నేతలతో కలిసి మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. తెలంగాణ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. కేటీఆర్ గురించి మీడియా మిత్రులు ఏదో ప్రశ్న లేవనెత్తగా.. అసలు కేటీఆర్ అంటే ఎవరు..? ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని షర్మిల అన్నారు. అయితే.. పక్కనుండే మరో నేత.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వారు. ఆమె ఈ మాట అన్నప్పుడు స్టేజ్‌పై ఉన్న నేతలు, మీడియా మిత్రులు కూడా నవ్వుకున్నారు.


ప్రశ్నల వర్షం..

కేసీఆర్ మహిళలను గౌరవించట్లేదు.. ఇక ఆయన కుమారుడు కేటీఆర్ గౌరవిస్తారా..? అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది మహిళలున్నారు..?. ఎంత మందిని పోటీలో నిలబెట్టారు..? ఎంతమందిని గెలిపించుకున్నారు..?. ఎంతమందిని మంత్రులను చేశారు..?. ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..?. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఒక మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు ఒక్క కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం అని కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


అందుకే పార్టీ స్థాపించాం..

తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు..? కేసీఆరా.. లేకుంటే ఆయన కొడుకా..?. కేసీఆర్‌కు మహిళలంటే గౌరవం లేదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోంది.. వారికి న్యాయం చేయాలనే పార్టీని స్థాపించాం. వైఎస్సార్‌టీపీ నాకోసం పెట్టిన పార్టీ కాదు. తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన అవసరం ఉంది అందుకే.. స్థాపించాం. కాంగ్రెస్‌ అమ్ముడుపోయిన పార్టీ.. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కు అయ్యారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికకు అర్ధమే లేదు. చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభిస్తాను అని షర్మిల చెప్పుకొచ్చారు.

Updated Date - 2021-07-16T18:29:55+05:30 IST