ఈ తప్పుకు ఎవరు బాధ్యులు?

Published: Wed, 31 Mar 2021 13:47:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఈ తప్పుకు ఎవరు బాధ్యులు?

ఆంధ్రజ్యోతి(31-03-2021)

ప్రశ్న: నేను 17 ఏళ్ల ఇంటర్మీడియట్‌ విద్యార్ధిని. పదో తరగతి వరకూ మెరిట్‌ మార్కులు సాధించిన నేను ఇంటర్‌లో అడుగుపెట్టిన తర్వాత చెడు స్నేహాలు, దురలవాట్లతో చదువులో వెనకబడిపోయాను. ఉన్నత చదువులు చదివి, జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలనే నా లక్ష్యం ఇలా మధ్యలోనే నీరుకారిపోవడానికి కారణం నా తల్లిదండ్రులే అనేది నా భావన. ఉద్యోగాల్లో బిజీగా ఉండే పేరెంట్స్‌ నా పెంపకం బాధ్యతను అమ్మమ్మకే వదిలేశారు. నా బాగోగులు, నడవడిక మీద పర్యవేక్షణ లోపించడమే నేనిలా దిగజారిపోవడానికి కారణమని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు నేను మారాలని అనుకుంటున్నాను. నన్ను ఏం చేయమంటారు?    


- రవికాంత్‌, హైదరాబాద్‌.


డాక్టర్ సమాధానం: తనలో ఏదైనా లోపం ఉందని అనిపించినప్పుడు, దాన్ని గుర్తించి, సరిదిద్దుకోవడం అనేది ఉన్నతమైన శిఖరాలకు ఎదిగే అబ్బాయి/అమ్మాయిల లక్షణం. ఎదుటి వ్యక్తిలో తప్పులు వెతకడం తాత్కాలికంగా మానసిక సంతృప్తిని అందించగలదేమోగానీ, వ్యక్తిగతంగా నష్టపరుస్తుంది. ‘అమ్మా, నాన్నా నన్ను పట్టించుకోలేదు’ అని నెపం వారి మీదకు తోసేయడం కన్నా నిన్ను పక్కదారి పట్టించే అంశాలను గ్రహించి, వాటికి దూరంగా ఎందుకు ఉండలేకపోయాను? అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాలి. చెడు అలవాట్లు, వ్యసనాలకు దూరంగా ఉండలేని పక్షంలో సెల్ఫ్‌ కంట్రోల్‌ మెకానిజం లాంటి టెక్నిక్స్‌ను నేర్చుకొని, అమలు చేయవచ్చు. 


అలాగే పిల్లలకు ఎటువంటి లోటూ లేకుండా పెంచాలనే ఆలోచనతో తల్లిదండ్రులు సంపాదనకే ఎక్కువ సమయాన్ని కేటాయించడమూ సరి కాదు. ‘నీ చదువు, విలాసాల కోసం సంపాదించే క్రమంలోనే మేం బిజీగా మారాం’ అని పిల్లలకు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి రాకుండా పెద్దలు నడుచుకోవాలి. చిన్న పిల్లలైనా, టీనేజీ పిల్లలైనా వారితో తల్లిదండ్రులు రోజులో కనీసం అరగంటపాటైనా సన్నిహితంగా గడపాలి. ఫోన్లు పక్కన పెట్టి, వారితో మాట్లాడి, వారి మనసు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇలా రోజూ వారితో మాట్లాడడం వల్ల, పిల్లలు పక్కదోవ పడుతున్న విషయం చూచాయగానైనా గ్రహించగలుగుతారు. ఆ సమయంలోనే వారిని గాడిలోకి తెచ్చే వీలుంటుంది. అలాగే ‘తప్పు నీదే’ అని పిల్లలను నిందించడం మాని, మార్పుకు అవసరమైన మార్గాలను సూచించి, ప్రేమాప్యాయతలతో నడుచుకోగలిగితే గాడి తప్పిన పిల్లలను తిరిగి దారిలో పెట్టుకోవచ్చు. మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మీద ఆధిపత్యం చెలాయించకుండా, స్నేహితుల్లా మెలగగలిగితే పిల్లలకు, కన్నవాళ్లకు మధ్య దూరాలు పెరగకుండా ఉంటాయి.


డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి,మానసిక నిపుణులు, హైదరాబాద్‌.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.