ఎవరు నీతిమంతుడు?

ABN , First Publish Date - 2021-01-22T06:00:48+05:30 IST

ఒక దైవ ప్రార్థనా మందిరానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వారిలో ఒకరు పరిసయ్యుడు. మరొకరు పన్నులను వసూలు చేసే వ్యక్తి. ఒక దైవ ప్రార్థనా మందిరానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వారిలో ఒకరు పరిసయ్యుడు. మరొకరు పన్నులను వసూలు చేసే వ్యక్తి.

ఎవరు నీతిమంతుడు?

క దైవ ప్రార్థనా మందిరానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వారిలో ఒకరు పరిసయ్యుడు. మరొకరు పన్నులను వసూలు చేసే వ్యక్తి. 


వారిలో పరిసయ్యుడు దైవం ముందు నిలబడి, ‘‘దేవుడా! నేను మిగిలిన మనుషుల్లా లేనందుకు.... దొంగతనాలు చేసే వ్యక్తుల్లా, వంచనచేసే మనుషుల్లా, అవినీతికి పాల్పడే వాళ్ళలా... అదిగో! ఇక్కడున్న ఈ పన్నులు వసూలు చేసే మనిషిలా లేనందుకు నీకు కృతజ్ఞతలు చెబుతున్నాను. నేను వారానికి రెండు రోజులు ఉపవాసం చేస్తాను. నాకు వచ్చే ఆదాయం అంతటిలో పదో వంతు నీకు చెల్లిస్తున్నాను’’ అని మనసులో అనుకుంటూ, ప్రార్థనలు చేశాడు. 


అతనికి కొంచెం దూరంలో పన్నుల వసూలుదారు నిలబడి ఉన్నాడు. అతను కనీసం తల పైకెత్తి ఆకాశం వైపు చూడడం లేదు. తన గుండెను చేతుల్తో బాదుకుంటూ, ‘‘దైవమా!  నా మీద దయ చూపించు. నేను పాపాత్ముడిని!’’ అని విలపించాడు. 


తన అనుయాయులకు ఈ కథను వినిపించిన ఏసు ప్రభువు ‘‘నేను మీతో చెబుతున్నాను. పరిసయ్యుడి కన్నా ఈ పన్నువసూలుదారే ఎక్కువ నీతిమంతుడిగా ఇంటికి వెళ్తున్నాడు. తమ గురించి తాము ఎక్కువగా భావించుకొనే, చెప్పుకొనే వ్యక్తి పతనమవుతాడు. ఎవరైతే తమను తగ్గించుకొని వినయంగా ఉంటారో వాళ్ళు గొప్పస్థానానికి అర్హులవుతారు’’ అని అన్నాడు (లూకా 18:914).  


పరిసయ్యుడంటే మతాచారాలను తూచా తప్పకుండా పాటించాలనే నియమం ఉన్న వర్గానికి చెందిన వ్యక్తి. ఆనాటి సమాజంలో పరిసయ్యులకు ఆదరణ ఉండేది. మరోవైపు పన్ను వసూలుదారులను ప్రజలు ద్వేషించేవారు. వారిని పాపాత్ములుగా పరిగణించేవారు. సామాజికంగా ఉన్న ఇలాంటి భావనలను ఏసు ప్రభువు తోసిపుచ్చేవాడు. పై కథలో, పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ, తాను ఎంత మంచివాడినో, ఎన్ని మంచి పనులు చేస్తున్నానో ఏకరవు పెట్టాడు. కానీ పన్నువసూలుదారు మాత్రం తాను పాపాత్ముడినని అంగీకరించాడు. దేవుడి క్షమాపణను వేడుకున్నాడు.  తననుతాను గొప్పగా భావించుకుంటూ, ఇతరులను తక్కువగా చూసే వ్యక్తుల తీరు పరిసయ్యుడిది.


ఇక, తలదించుకొని, తనుతాను కొట్టుకుంటూ, తన పశ్చాత్తాపాన్ని ప్రకటించిన పన్నువసూలుదారుకు తన పాపాల గురించి తెలుసు. తనకు క్షమాపణ ప్రసాదించాల్సింది దైవమేనని తెలుసు. అందుకే పన్నువసూలుదారే ఎక్కువ నీతిమంతుడిగా ఇంటికి వెళ్తున్నాడని ఏసు ప్రకటించాడు. అటువంటివారే ఉన్నతస్థానాన్ని పొందుతారని స్పష్టం చేశాడు. దైవం ముందు గొప్పలు చెప్పుకోకుండా తన తప్పును అంగీకరించి, పశ్చాత్తాపం వ్యక్తపరచిన వాడే దైవ కృపకు అర్హుడవుతాడన్నది ఏసు ప్రభువు మాటల్లోని సారాంశం. జీవితంలోని ప్రతి విషయంలోనూ సరైన వైఖరి ఉండాలి. దైవ ప్రార్థనలోనూ అది తప్పనిసరి. అటువంటి వైఖరి ఆవశ్యకత గురించి పై కథలో ఏసు ప్రభువు వివరించాడు. 

Updated Date - 2021-01-22T06:00:48+05:30 IST