మేనేజర్‌ ఎవరు?

ABN , First Publish Date - 2021-07-22T05:27:22+05:30 IST

నెల్లూరు నగర పాలక సంస్థలో మేనేజర్‌ పోస్టు ఎవరికనేది అయోమయంగా మారింది. రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో ఉద్యో గుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. గతంలో పని చేసిన అధికారి పేరే ఇటీవల ప్రస్తావనకు వచ్చింది.

మేనేజర్‌ ఎవరు?

గత అధికారి పేరు దాదాపు ఖరారు

తాజాగా రేసులోకి మరో మహిళా అధికారి 

ఉద్యోగుల్లో ఉత్కంఠ

ఎవరైనా ‘అధికార’ ముద్ర పడాల్సిందే


నెల్లూరు (సిటీ), జూలై 21 : నెల్లూరు నగర పాలక సంస్థలో మేనేజర్‌ పోస్టు ఎవరికనేది అయోమయంగా మారింది. రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో ఉద్యో గుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. గతంలో పని చేసిన అధికారి పేరే ఇటీవల ప్రస్తావనకు వచ్చింది. దీంతో ఆయనే దాదాపుగా ఖరారవుతాడని అందరూ ఊహించారు. కాగా, తాజాగా ఓ మహిళ అధికారి పేరు రేసులోకి వచ్చింది. ప్రస్తుతం ఓ విభాగానికి సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న ఆమెను మేనేజర్‌గా నియమిస్తారని కార్పొరేషన్‌ కార్యాలయంలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మేనేజర్‌గా పని చేస్తున్న అధికారి ఆ స్థానంలో అయిష్టంగా ఉండటంతో ఆమె మార్పు తథ్యమైంది.


కార్పొరేషన్‌ కార్యాలయంలో మేనేజర్‌ పోస్టు అత్యంత కీలకమైంది. మున్సిపల్‌ కమిషనర్‌ ర్యాంకుకు సమానమైన ఈ పోస్టుకు పోటీ ఉంటుంది. గతంలో ఆ స్థానంలో ఉన్న వ్యక్తి కొన్ని అనివార్య కారణాలతో లూప్‌ లైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం పురసేవ, కళాశాలల పర్యవేక్షణ చూస్తున్న ఆయనకు మరలా మేనేజర్‌ పోస్టు అప్పగిస్తున్నట్లు ఉన్నతాధికారి నుంచి సంకేతాలందాయి. అందుకు సిద్ధంగా కూడా ఉండాలని స్పష్టత రావడంతో ప్రక్రియ అంతా దాదాపుగా ఖరారైంది. కానీ, తాజాగా కార్పొరేషన్‌లోని మరో విభాగానికి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న అధికారిణి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది.  దాంతో ఉద్యోగుల్లో ఒకింత ఆశ్చర్యం కలుగుతోంది.


నెల్లూరు నగర పాలక సంస్థలో చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఎవరిని బదిలీ చేయాలన్నా, మరెవరిని నియమించాలన్నా అధికార పార్టీ ఆమోదముద్ర ఉండాల్సిందే.  ఇందులో భాగంగా మేనేజర్‌ పోస్టుకు ఎవరిని ఎంపిక చేయాలన్న అంశం కూడా రాజకీయ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 



Updated Date - 2021-07-22T05:27:22+05:30 IST