ఎవరు రైతు పక్షం... ఇదిగో సాక్ష్యం!

ABN , First Publish Date - 2022-05-26T06:01:55+05:30 IST

గత 70 ఏళ్లలో రైతులకు కాంగ్రెస్‌ ఏం చేసింది? ఈ ప్రశ్నను పదే పదే సంధించడాన్ని బిజెపి–టిఆర్‌ఎస్‌ లీడర్లు ఒక ఉమ్మడి కార్యక్రమంగా పెట్టుకున్నారు....

ఎవరు రైతు పక్షం... ఇదిగో సాక్ష్యం!

గత 70 ఏళ్లలో రైతులకు కాంగ్రెస్‌ ఏం చేసింది? ఈ ప్రశ్నను పదే పదే సంధించడాన్ని బిజెపి–టిఆర్‌ఎస్‌ లీడర్లు ఒక ఉమ్మడి కార్యక్రమంగా పెట్టుకున్నారు. చరిత్రకు మసిపూసి మారేడుకాయ చెయ్యడమే ఈ ప్రశ్న వెనుక ఉన్న కుట్ర, కుతంత్రం. మొదటి పంచవర్ష ప్రణాళికలో ఈ దేశంలో వ్యవసాయరంగ వృద్ధికి కేటాయించిన నిధులు 56 శాతం. ఇవాళ అది అయిదు శాతానికి మించి లేదు. సాగునీరు ముఖ్యమన్న ఉద్దేశంతో భాక్రానంగల్‌, నాగార్జునసాగర్‌ బహుళార్థసాధక ప్రాజెక్టులను నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ కట్టించారు. దేశభద్రత–ఆహారభద్రత రెండింటికీ కాంగ్రెస్‌ ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ‘జై జవాన్‌ – జై కిసాన్‌’ నినాదాన్ని ఒక జీవన విధానంగా మార్చింది. 1966–67లో హరిత విప్లవాన్ని తెచ్చి ఆహార ఉత్పత్తుల సమృద్ధి దేశంగా భారత్‌ను నిలబెట్టింది కాంగ్రెస్‌. హరిత విప్లవం కేవలం ఒక నినాదం కాదు. దాన్ని వాస్తవం చేయాలన్న సంకల్పంతో అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయీకరణకు శ్రీకారం చుట్టారు. హరిత విప్లవ విజయం కోసమే బ్యాంకుల జాతీయీకరణ అన్నది నేటి తరం రైతుల్లో ఎందరికి తెలుసు? బడా కార్పొరేట్లకు మాత్రమే బ్యాంకులు రుణాలు ఇచ్చే పరిస్థితి నుంచి 1969లో 14 బ్యాంకులు, 1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయీకరణ చేయడం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు సైతం తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలను అందుబాటులోకి తెచ్చింది కాంగ్రెస్‌. బ్యాంకులు తమ మొత్తం రుణ ప్రణాళికలో 40 శాతం గ్రామీణ ప్రాంతాలకు, మరో 18 శాతం వ్యవసాయానికి మాత్రమే ఇవ్వాలని నిర్దేశించి అమలు చేయించింది కాంగ్రెస్‌. 2002లో బిజెపి సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం దీనికి తూట్లు పొడిచింది. బ్యాంకింగ్‌ చట్టానికి సవరణలు చేసి, రుణ మంజూరులో బ్యాంకులకు అపరిమిత స్వేచ్ఛనిచ్చింది. చిన్న, సన్నకారు రైతుల నడ్డి విరిచింది.


వ్యవసాయాన్ని పండగ చేస్తానన్న కెసిఆర్‌, 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోదీ... ఇద్దరూ కలిసి కాంగ్రెస్‌ నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక సంస్థలను అమ్ముకుంటూ వస్తున్నారు. అంతెందుకు 2009లో రూ.70 వేల కోట్లకు పైగా రైతు రుణాన్ని ఒకే దఫా మాఫీ చేసింది కాంగ్రెస్‌ కాదా? రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలన్న ఆలోచనకు నాంది పలికిందే కాంగ్రెస్‌. కౌలురైతు కూడా రైతేనని, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలతో సహా అన్ని పథకాలను వర్తింపజేస్తూ 11 ఏళ్ల కిత్రమే కౌలురైతుల గుర్తింపుచట్టం చేసింది కాంగ్రెస్‌. జలయజ్ఞంలో మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్ట్‌ నిజామాబాద్‌ జిల్లాలోని అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం. నేటి కాళేశ్వరం నాటి కాంగ్రెస్‌ ప్రాణహిత – చేవెళ్లకు నకలు. కమిషన్ల కోసం రీ–డిజైన్‌ అయింది తప్ప, అది కెసిఆర్‌ స్వీయ ఆలోచన కానే కాదు. కృష్ణా నీళ్లు తెచ్చి దక్షిణ తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడవాలని పాలమూరు – రంగారెడ్డి పేరుతో కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేస్తే, ఆ ప్రాజెక్టును కెసిఆర్‌ అటకెక్కించారు. రైతులకు పావలావడ్డీకే రుణాలు, పంటల బీమా, రైతు బీమా, ఇందిర జలప్రభ, రాయితీ విత్తనం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు, పండిన పంటకు మద్దతు ధర, పంటల కొనుగోలుకు ఐకెపి కేంద్రాల ఏర్పాటు వంటి సమగ్ర రైతు అనుకూల నిర్ణయాలతో వ్యవసాయాన్ని పండగ చేసింది కాంగ్రెస్‌.


2009లో ఒకే దఫా రూ.70 వేల కోట్లకు పైగా రైతు రుణాలు మాఫీ చేసినా చెక్కు చెదరని బ్యాంకింగ్‌ రుణ వ్యవస్థ, కెసిఆర్‌ రూ.లక్ష రుణమాఫీ అమలు చేయకపోవడంతో ధ్వంసమైపోయింది. రైతులు బ్యాంకుల గడప తొక్కే పరిస్థితి లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర రెండు నుంచి నాలుగు రూపాయల మిత్తికి అప్పులు చేశారు. ఆరుగాలం కష్టించి పండించే పంటకు మద్దతు ధర లేదు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టం జరిగితే పరిహారం లేదు. పంటల బీమా లేదు. నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాల బారి నుంచి రక్షణ లేదు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాలలో పత్తి, మిర్చి రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్నారు. గడచిన ఏడాది నుంచి వరి రైతుల గోస చూస్తూనే ఉన్నాం. కల్లాల్లోనే గుండె ఆగి మరణిస్తున్న తీరు వ్యవసాయ సంక్షోభానికి సంకేతం. కెసిఆర్‌ అనాలోచిత విధానాలతో తెలంగాణలో పంటల వైవిధ్యం దెబ్బతినడమే కాక, రైతులు ఘోరంగా నష్టపోయారు. ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో మిర్చి, పత్తి, కందులు, సోయా, పొద్దుతిరుగుడు, పప్పుదినుసులు, చెరకు, పసుపు, మొక్కజొన్న, ఎర్రజొన్నలు, హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో పళ్లతోటలు, కూరగాయలు వంటి వైవిధ్యంతో కూడిన పంటల విధానం ఉండేది. నేడు వరి తప్ప మరో పంట వేయలేని పరిస్థితుల్లోకి రైతులను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెట్టింది. పోనీ వారైనా సంతోషంగా ఉన్నారా అంటే, కెసిఆర్‌ తలతిక్క విధానాలతో వరి రైతుల పరిస్థితి కూడా నేడు అగమ్యగోచరంగా తయారైంది.


‘‘కోటి ఎకరాలలో వరి పండాలి. ప్రతి గింజా కొంటాం. ఈ యాసంగిలో 38 లక్షల ఎకరాలలో వరి సాగైంది. నేను ఇంకా వరి వేయండనే చెబుతున్నా... కోటి ఎకరాలైనా ఏం బాధ లేదు... ఎవడేడువనీ, అరవనీ, శాపం పెట్టుకోనీ. ప్రతి గింజా కొంటాం’’ అని 2020 మార్చి 7న కెసిఆర్‌ ప్రకటించారు. అదే ఏడాది డిసెంబర్‌ 27న పూర్తిగా యూటర్న్‌ తీసుకున్నారు. ‘పంట కొనుగోలు చేయడానికి ప్రభుత్వమేమీ వ్యాపార సంస్థ కాదు. రైస్‌ మిల్లర్లో, దాల్‌ మిల్లర్లో అసలే కాదు. కొనుగోళ్లు–అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు. మద్దతు ధరతో కొనుగోళ్లు జరపడం వల్ల ప్రభుత్వానికి రూ.7,500 కోట్ల నష్టం వచ్చింది. పంటకు ఎక్కడ ధర వస్తే అక్కడే అమ్ముకోవాలి. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు ఇదే చెబుతున్నాయి. ఈ విధానం ఉత్తమం’ అని ప్రకటించి రైతులకు షాక్‌ ఇచ్చారు. మోదీ నల్ల వ్యవసాయ చట్టాలకు కెసిఆర్‌ సంపూర్ణ మద్దతు ఉందనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. 2021 సెప్టెంబర్‌లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన కెసిఆర్‌... రైతులెవరూ వరి వేయవద్దని, వరి వేస్తే ఉరేనని ప్రకటించారు. దానికి కొనసాగింపుగా ఇకపై తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని అక్టోబర్‌ 4, 2021న ఎఫ్‌సిఐకి లేఖ రాశారు. వరి వేస్తే ఉరేనని రైతులకు హితబోధ చేసిన ఘనుడు తన ఫాంహౌస్‌లో మాత్రం 150 ఎకరాల్లో వరి వేశారు. ఇది ఎవరిని మోసం చేయడం! ఈ మోసాన్ని కాంగ్రెస్‌ వెలుగులోకి తెచ్చింది. కెసిఆర్‌ ఫాంహౌస్‌లోని వరి ధాన్యాన్ని ఎవరు కొంటారో... చిన్న, సన్నకారు రైతుల ధాన్యాన్ని కూడా వాళ్లే కొనాలని డిమాండ్‌ చేస్తూ ఫాంహౌస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ పిలుపునిస్తే... మా నాయకులను హౌస్‌ అరెస్టులు చేశారు. అక్కడ నుంచి కల్లాల్లోకి కాంగ్రెస్‌ పేరుతో మేం రైతు క్షేత్రాలకు వెళ్లి పోరాటానికి శ్రీకారం చుట్టాం. ఆ తర్వాతే కెసిఆర్‌ ధాన్యం కొనుగోళ్లపై మళ్లీ యూటర్న్‌ ప్రకటనలు మొదలుపెట్టారు. కేంద్రంపై యుద్ధమే... భూకంపమే అని భీకర ప్రకటనలతో ఆ యుద్ధాన్ని ముగించాడు. రైతులలో భరోసా నింపేందుకు ‘రైతు సంఘర్షణ’ పేరుతో వరంగల్‌ గడ్డపై కాంగ్రెస్‌ సమరశంఖం పూరిస్తోందని తెలిశాక... ధాన్యం మేమే కొంటాం అని కెసిఆర్‌ ప్రకటించారు.


తెలంగాణ రైతు చేతిలో రూపాయి లేదు. ఇప్పుడతను పీకల్లోతు అప్పుల్లో ఉన్నాడు. కెసిఆర్‌ రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకింగ్‌ రుణవ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. ఏకకాలంలో రూ. రెండు లక్షలు రుణమాఫీ చేసి, తిరిగి రుణాలు పొందే వెసులుబాటు కల్పిస్తే తప్ప రైతు తేరుకునే పరిస్థితి లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరితో సహా ఇక్కడ పండే అన్ని పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేయాలన్నది కాంగ్రెస్‌ సంకల్పం. ఈ రెండు ప్రధాన అంశాలతో పాటు రైతులు వ్యవసాయానికి సంబంధించిన మరో ఏడు అంశాలను జోడించి కాంగ్రెస్‌ ‘వరంగల్‌ రైతు డిక్లరేషన్‌’ ప్రకటించింది. ఆ డిక్లరేషన్‌ ఇప్పుడు టిఆర్‌ఎస్‌ కోటకు బీటలు వార్చుతోంది. వరంగల్‌ డిక్లరేషన్‌ను అగ్రనాయకత్వం నుంచి కార్యకర్త వరకు భగవద్గీతగా భావిస్తున్నారు. తెలంగాణలో రైతు–యువత రాజ్యస్థాపనే కాంగ్రెస్‌ లక్ష్యం. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకుని రైతు సంక్షేమం – యువత యోగక్షేమం రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్‌ ప్రణాళికలు రచిస్తోంది. ఇచ్చిన ప్రతి మాటను అమలుచేసి తీరుతాం. రైతులకు, యువతకు, ప్రజలకు రాహుల్‌గాంధీ ఆమోదంతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఇది నేను ఇస్తున్న హామీ. జై జవాన్‌ – జై కిసాన్‌.


ఎ. రేవంత్‌రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు

Updated Date - 2022-05-26T06:01:55+05:30 IST