తదుపరి రాష్ట్రపతి ఎవరు?

ABN , First Publish Date - 2022-06-11T08:27:37+05:30 IST

రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యూహ ప్రతివ్యూహాలు జోరందుకుంటున్నాయి. ‘విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలి’ అని కాంగ్రెస్‌..

తదుపరి రాష్ట్రపతి ఎవరు?

బీజేపీ, కాంగ్రెస్‌ వ్యూహ ప్రతి వ్యూహాలు

బలమైన ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్‌ అన్వేషణ

శరద్‌ పవార్‌ లేదా దేవెగౌడ వైపు మొగ్గు

బీజేపీ పరిశీలనలో మైనారిటీ, గిరిజన నేతల పేర్లు

దక్షిణాది నుంచైతే వెంకయ్య లేదా తమిళి సై

గులాం నబీ అభ్యర్థిత్వంపై తీవ్రంగా చర్చ


(న్యూఢిల్లీ - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్‌ల వ్యూహ ప్రతివ్యూహాలు జోరందుకుంటున్నాయి. ‘విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవాలి’ అని కాంగ్రెస్‌ భావిస్తుండగా... ‘మా అభ్యర్థి గెలుపు ఖాయం. కానీ... ఘన విజయం సాధించడమే మా లక్ష్యం’ అని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రపతి  అభ్యర్థి ఎంపికపై ఇరుపక్షాలు కసరత్తు చేస్తున్నా యి. ‘ఉమ్మడి అభ్యర్థి’ ఎంపికపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇప్పటికే ప్రతిపక్షాలతో మంతనాలు ప్రారంభించారు. శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ ఠాకరేలతో స్వయంగా మాట్లాడారు. ఆమె సూచనల మేరకు పార్టీ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌తో చర్చలు జరిపారు. త్వరలో ఉద్ధవ్‌ ఠాకరేతోపాటు... డీఎంకే, తృణమూల్‌, వామపక్ష నాయకులను కలుస్తానని, వారితో సమావేశానికి తేదీలను నిర్ణయిస్తామని ఖర్గే తెలిపారు. బీజేపీయేతర ప్రధాన పార్టీలు ఒక అవగాహనకు వస్తే, మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వైఖరి నిర్ణయించుకోక తప్పదని కాంగ్రెస్‌ నేత ఒకరు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియలో కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన సంధానకర్తగా వ్యవహరిస్తుందని ఆయన చెప్పారు.


అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు

రాష్ట్రపతి అభ్యర్థికి కావల్సిన ఓట్లలో దాదాపు సగం ఇప్పటికే ఎన్డీయే ఖాతాలో ఉన్నాయని... ఏపీలో వైసీపీ, ఒడిసాలో బీజేడీతోపాటు ఇతర చిన్న పార్టీల మద్దతుతో తమ అభ్యర్థి సులభంగా విజయం సాధిస్తారని బీజేపీ నేత ఒకరు చెప్పారు. అయినప్పటికీ... ఘన విజయం సాధించేందుకు వీలుగా తగిన అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో... ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్‌ తమిళి సై, కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపది ముర్ము, ఛత్తీ్‌సగఢ్‌ గవర్నర్‌ అనసూయా యూకీపేర్లు ప్రధానంగా చర్చల్లో ఉన్నాయని చెబుతున్నారు. ఈసారి దక్షిణాది నుంచి రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయాలని భావిస్తే... వెంకయ్య నాయుడు లేదా తమిళిసైకి ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు. కశ్మీర్‌ సమస్య, పౌరసత్వ చట్టం, హిజాబ్‌ గొడవ, ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.


‘ముస్లిం వ్యతిరేక పార్టీ’ ముద్రను కాస్తైనా చెరిపివేయాలనుకునే పక్షంలో... ముస్లిం నేతను రాష్ట్రపతి భవన్‌కు పంపాలనే చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే... గులాంనబీ ఆజాద్‌, ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌లో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఇక  ద్రౌపది ముర్ము, అనుసూయవంటి గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకుంటే తొలి గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత మోదీకి దక్కుతుంది. బిజూ జనతాదళ్‌, జేఎంఎం లాంటి పార్టీల మద్దతు లభిస్తుంది.


ప్రతిపక్షాల వైపు నుంచి పవార్‌?

 ఈసారి ఇతర ప్రతిపక్షాలు సూచించిన వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వాలని సోనియా భావిస్తున్నారు. మహారాష్ట్ర నేత శరద్‌ పవార్‌, జేడీ-ఎస్‌ నేత దేవె గౌడ ప్రస్తుతం ప్రతిపక్షాల్లో అత్యంత సీనియర్లు. వీరిలో ఒకరి వైపు మొగ్గు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శరద్‌ పవార్‌ బలమైన నేత కనుక బీజేపీయేతర పార్టీలన్నీ ఆయనకే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని, అప్పుడు బీజేపీ అభ్యర్థికి గట్టి పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. 

Updated Date - 2022-06-11T08:27:37+05:30 IST