తమ గోడు వినేదెవరు?

ABN , First Publish Date - 2021-06-22T04:13:38+05:30 IST

అనుభవం, టెక్నికల్‌ అర్హతలు ఉన్నప్పటికీ అన్యాయమే జరుగుతుందని వాపోతు న్నారు జైపూర్‌లోని ఎన్టీపీపీ కాంట్రాక్టు కార్మికులు. వారి విద్యార్హతను బట్టి విధులు అప్పగించాల్సిన సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదు. జైపూర్‌ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థను 5 ఏండ్ల క్రితం నెలకొల్పారు. సంస్థలో కొంత మందిని పర్మనెంట్‌ ఉద్యోగులుగా నియమించుకున్నారు.

తమ గోడు వినేదెవరు?
జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌

ఎన్‌టీపీపీ కాంట్రాక్టు కార్మికుల ఆవేదన 

టెక్నికల్‌ విద్యార్హతలున్నా అన్‌స్కిల్డ్‌ విధులు

సింగరేణి యాజమాన్యం స్పందించాలని వేడుకోలు  

జైపూర్‌, జూన్‌ 21: అనుభవం, టెక్నికల్‌ అర్హతలు ఉన్నప్పటికీ అన్యాయమే జరుగుతుందని వాపోతు న్నారు జైపూర్‌లోని ఎన్టీపీపీ కాంట్రాక్టు కార్మికులు. వారి విద్యార్హతను బట్టి విధులు అప్పగించాల్సిన సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్‌ పట్టించుకోవడం లేదు. జైపూర్‌ మండల కేంద్రంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థను 5 ఏండ్ల క్రితం నెలకొల్పారు. సంస్థలో కొంత మందిని పర్మనెంట్‌ ఉద్యోగులుగా నియమించుకున్నారు. అయితే పవర్‌ ప్లాంటు కింద 2500 ఎకరాల భూములు కోల్పోయిన నిర్వాసితులకు కాంట్రాక్టు కార్మికులుగా నియమించారు. వీరిని స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులుగా విభజించారు. స్కిల్డ్‌ కార్మికులకు రోజు వేతనం రూ.630 ఉండగా నెలకు సుమారు రూ.15 వేల నుంచి రూ. 18 వేల వరకు సంపాదిస్తున్నారు. ఒక వేళ విధులకు  గైర్హాజరైతే వేతనంలో కోత విధిస్తున్నారు. ఇదే విధులు నిర్వహించే పర్మనెంట్‌ ఉద్యోగులకు నెలకు రూ.30 వేల పైచిలుకు వేతనం చెల్లిస్తున్నారు. సెమీస్కిల్డ్‌ కార్మికులు రూ.500, అన్‌స్కిల్డ్‌ కార్మికులకు రూ.127 రోజు వేతనంగా పొందుతున్నారు. 

హామీని విస్మరించిన యాజమాన్యం

అర్హతకు తగిన విధులు ఇస్తామన్న సింగరేణి అధికారులు ఇచ్చిన హామీని విస్మరించారని భూ నిర్వాసిత కాంట్రాక్టు కార్మికులు పేర్కొంటున్నారు. ఒక వైపు భూములు కోల్పోయి, మరోవైపు చాలీచాలని వేతనాలతో పని చేస్తూ ఇబ్బందులు పడుతున్నామన్నారు. 

విద్యార్హత ఆధారంగా విధులు  ఇవ్వాలని సింగరేణి డైరెక్టర్లను, అధికారులను, ప్రజాప్రతినిధులను కలిసి పలుమార్లు విన్నవించారు. ఎవరూ సమస్యను పరిష్కరించడం లేదని పేర్కొన్నారు. 

అర్హతలు ఉన్నా........

విద్యుత్‌ సంస్థ ప్రారంభమైనప్పుడు స్టీగ్‌ అనే సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ కాంట్రాక్టు సంస్థ ద్వారా  900 మంది భూ నిర్వాసిత కార్మికులు పని చేస్తున్నారు. వీరు స్కిల్డ్‌ కార్మికుల  కేటగిరీలో ఉండగా, ఇందులో అందరూ ఐటీఐ, డిప్లమా, బీటెక్‌ చదివారు. వీరంతా కాంట్రాక్టు కార్మికులు (హెల్పర్లుగా) విధులు నిర్వహిస్తున్నారు. 

స్టీగ్‌ సంస్థ గడువు ముగియడంతో పవర్‌ మేక్‌ అనే సంస్థ కాంట్రాక్టు దక్కించుకొంది. గతంలో స్టీగ్‌ సంస్థ వద్ద పని చేసిన కార్మికులు  ప్రస్తుతం ఈ సంస్థలో  కొనసాగుతున్నారు. 

విద్యార్హతను బట్టి పదోన్నతి కల్పించాలి

కుర్మిళ్ల మధు, కాంట్రాక్టు కార్మికుడు 

నాలుగేండ్లుగా పవర్‌ ప్లాంటులో అన్‌ స్కిల్డ్‌ కాం ట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నా. డిప్లమా, బీటెక్‌ అర్హతలున్నాయి. అనుభవం, విద్యార్హతను బట్టి పదోన్నతి కల్పించాలి. సింగరేణి యాజమాన్యం, అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు.  

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం

..సంజయ్‌కుమార్‌, టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

పవర్‌ ప్లాంటు ప్రారంభమైనప్పటి నుంచి  భూ నిర్వాసిత కార్మికులు  పని చేస్తున్నారు. వారి కోసం ఇతర యూనియన్‌ నాయకులతో కలిసి ఎన్నో పోరాటాలు చేశాం. కానీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించలేదు. దీనికి తోడు సింగరేణి అధికారులు కాంట్రాక్టు కార్మికుల పొట్టకొడుతున్నారు. ఇప్పటికైనా భూ నిర్వాసిత కాంట్రాక్టు కార్మికులకు  పదోన్నతి కల్పించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం. 

Updated Date - 2021-06-22T04:13:38+05:30 IST