YS Jagan కేబినెట్‌లో ఉండేదెవరు.. ఊడేదెవరు..!

ABN , First Publish Date - 2022-03-12T07:11:21+05:30 IST

అధికార వైసీపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరకు సమయం దగ్గరపడింది. మరో రెండు నెలల్లో ఇప్పుడున్న ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో...

YS Jagan కేబినెట్‌లో ఉండేదెవరు.. ఊడేదెవరు..!

  • జిల్లాలో అమాత్యులకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముప్పు
  • త్వరలో మార్పులుంటాయని సీఎం జగన్‌ విస్పష్ట సంకేతాలు
  • ఉన్న ముగ్గురికీ ఉద్వాసన పలికి కొత్తవాళ్లతో..
  • మంత్రివర్గం భర్తీ చేస్తారంటూ ఎక్కడికక్కడ ఊహాగానాలు
  • అలా అయితే కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమ జిల్లాలకు..
  • మంత్రులెవరనే దానిపై జోరుగా చర్చ
  • అమాత్య పదవి కోసం ఆశావహ ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు
  • కన్నబాబును మారిస్తే పెండెం, దాడిశెట్టి, జక్కంపూడి పోటీ
  • కోనసీమ జిల్లాలో విశ్వరూప్‌, వేణులలో ఒకరిపై వేటు?
  • ఇద్దరినీ తప్పిస్తే ఎస్సీ, కాపు, మత్స్యకార వర్గాల నుంచి పోటీ
  • రాజమహేంద్రవరం జిల్లాకు ప్రాతినిధ్యం వహించే మంత్రెవరో..


అధికార వైసీపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరకు సమయం దగ్గరపడింది. మరో రెండు నెలల్లో ఇప్పుడున్న ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అమాత్యులను మార్చుతామని సీఎం జగన్‌ శుక్రవారం సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మార్పులు,చేర్పుల్లో ఎవరుంటారు.. ఎవరు ఊడతారనే దానిపై చర్చ జోరందుకుంది. అసలే కొత్త జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో మూడు జిల్లాలకు ముగ్గురు మంత్రులు తప్పనిసరి. దీంతో మంత్రులు విశ్వరూప్‌, వేణు ఇద్దరూ కోనసీమ జిల్లా పరిధిలోకి వస్తుండడంతో వీరిద్దరిలో ఒకరిపై వేటు ఖాయం. మిగిలిన ఒకరిని కొనసాగిస్తారా? లేదా తప్పించి కొత్త ముఖానికి చోటిస్తారా? అనే చర్చ జరుగుతోంది. అటు మంత్రి కన్నబాబును తప్పిస్తే ఆ స్థానంలో తమకు ఛాన్స్‌ ఇవ్వాలని తుని, పిఠాపురం ఎమ్మెల్యేలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క ఇప్పుడున్న ముగ్గురు మంత్రుల్లో రాజమహేంద్రవరం జిల్లా పరిధిలోకి వచ్చేవాళ్లెవరూ లేరు. ప్రస్తుత మంత్రి తానేటి వనిత ఈ జిల్లాలో కలుస్తున్నా ఆమె పదవికీ గండం ఉంది. గోపాలపురం నుంచి ప్రాతినిధ్యం కల్పిస్తారనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో సీఎం అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.


అటు ఆశావహులు సైతం ఇప్పుడున్న వారి స్థానాల్లో తీవ్ర ప్రయత్నాలు చేశా రు. కానీ అనుహ్యంగా కొత్త జిల్లాలు తెరపైకి రావడంతో మంత్రుల లెక్కలు, ఆశావహుల ప్రయత్నాల్లో తేడాలొచ్చాయి. కొత్త జిల్లాలు రాజమహేంద్రవరం, కోనసీమతోపాటు కాకినాడ జిల్లా ఈ మూడింటికి ముగ్గురు మంత్రులు తప్పని సరి. ఈనేపథ్యంలో ప్రస్తుత మంత్రుల్లో విశ్వరూప్‌, వేణులు కోనసీమ జిల్లా పరిధిలోకి వస్తున్నారు. ఫలితంగా వీరిరువురిలో ఒకరిపై వేటు ఖాయంగా కని పిస్తోంది. అయితే విశ్వరూప్‌ లేదా వేణు వీరిలో ఎవరి పదవికి గండం అనేదా నిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. వేణు ఈమధ్యే మంత్రి అయినందున విశ్వరూప్‌ను తప్పిస్తారని వేణు వర్గం, కోనసీమలో ఎస్సీ సామాజికవర్గ అధి కంగా ఉన్నందున విశ్వరూప్‌ను తప్పించరని ఆయన అనుచరులు లెక్కలు వేస్తున్నారు. అయితే వీరిద్దరిని తప్పించి కొత్త ముఖానికి చోటుకల్పించే అవ కాశం లేకపోలేదనే వాదన కూడా ఉంది. ఒకవేళ కోనసీమ నుంచి మంత్రి విశ్వరూప్‌ను తప్పిస్తే ఆ సామాజికవర్గం కోటాను వేరే జిల్లా నుంచి నింపవచ్చనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే తనకు అవకాశం ఉంటుందని అటు త్రిమూర్తులు, ఇటు ముమ్ముడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ కూడా ఆశ పడుతున్నారు. అలాకాకుండా అదే సామాజికవర్గం అయితే ఎమ్మెల్యే కొండేటి, ఎమ్మెల్సీ పండుల తమకు ఛాన్స్‌ ఉంటుందని భావిస్తున్నారు.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి) 

రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడున్న మంత్రులను తీసేసి కొత్తవారికి అవకాశం ఇస్తామని సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రకటించారు. తీరా ఆచ రణలో ఆలస్యం కావడంతో మరో రెండు నెలల్లో మూడేళ్ల పాలన పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఖాయం అని సీఎం జగన్‌ శుక్రవారం జరి గిన క్యాబినేట్‌ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. మంత్రి పదవి కోసం చాలా మంది ఆశావహులు ఉన్నారు. అయితే మార్పులు, చేర్పుల్లో మంత్రివర్గంలో స్థానం లేనంత మాత్రాన డిమోషన్‌గా భావించొద్దని.. మళ్లీ గెలిచి వస్తే మంత్రు లుగా ఉండేది మీరే కదా అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. ఈనేపథ్యంలో త్వరలో జరగనున్న వైసీఎల్పీ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై స్పష్టత రానుంది. అయితే మంత్రివర్గం నుంచి తప్పించేవారికి పార్టీ జిల్లా ఇంచార్జి బాధ్యతలు ఇస్తామని పేర్కొన్నారు. దీంతో జిల్లాలో ఇప్పుడున్న ముగ్గురు మం త్రులు కన్నబాబు, విశ్వరూప్‌, వేణుల్లో ఎవరుంటారు? ఎవరు ఊడుతారు? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఉన్న ముగ్గురు మంత్రుల్లో ఎవరికివారు తాము సీఎంకు దగ్గరయ్యామని, పదవికి ఢోకా లేదని లెక్కలు వేసుకున్నారు.


రాజమహేంద్రవ రం జిల్లాకు వస్తే ఇప్పుడున్న మంత్రులెవరూ దీని పరిధిలోకి రావడం లేదు. దీంతో తమకు ఛాన్స్‌ ఉంటుందని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తన తండ్రి మంత్రిగా పనిచేయడం, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించిన తర్వాత ఇంకేం పదవి లేనందున తనకు చోటు ఇవ్వాలని సీఎంను కోరుతున్నారు. కానీ ఇది నెరవేరడం కష్టంగా కనిపిస్తోంది. అనపర్తి నుంచి ఎమ్మెల్యే ఉన్నా సామాజిక సమీకరణాలు కుద రడం లేదు. రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్‌లలో పార్టీకి ప్రాతి నిధ్యం లేదు. దీంతో పశ్చిమగోదావరి నుంచి విడిపోయి రాజమహేంద్రవరం జిల్లాలో కలుస్తున్న గోపాలపురం నుంచి అక్కడ ఎమ్మెల్యేకు ఛాన్స్‌ ఉంటుందనే చర్చ జరుగుతోంది. కొవ్వూరు ఎమ్మెల్యే వనిత మంత్రిగా ప్రస్తుతం కొనసా గుతున్నా ఆమెను తప్పించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరో మంత్రి కన్నబాబును తప్పించి పార్టీ బాధ్యతలు కట్టబెడతారని చర్చ సాగుతోంది. ఈయన సీఎంకు సన్నిహితంగా మెలుగుతున్నా ఇక్కడ ఆశావహులు అధికంగా ఉండడం, సీఎం జగన్‌కు సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యేకు ఈయనకు పొసగనం దున మార్చాలంటూ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కన్నబాబు స్థానంలో తమకు అవకాశం ఇవ్వాలని పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తమ సీనియార్టీ, కుటుంబ నేపథ్యం చూసి కొలువు కట్టబెట్టాలని కోరుకుంటున్నారు. వీరిద్దరు ఇప్పటికే సీఎం ను కలిసి తమ కోరిక వినిపించారు. వాస్తవానికి జిల్లాలో ముగ్గురు మంత్రులను తొలగించి ఇద్దరికే చోటు కల్పిస్తారనే వాదన మొదట్లో ఉన్నా ఇప్పుడు కొత్త జిల్లాల నేపథ్యంలో ఆ చర్చ వెనక్కుపోయింది. దీంతో ముగ్గురు మంత్రులు కచ్చితంగా ఉండితీరాల్సిన తరుణంలో ఎవరి అదృష్టం ఎలా ఉందో చూడాలి.

Updated Date - 2022-03-12T07:11:21+05:30 IST