Mulayam Singh Yadav రెండో భార్య సాధనా గుప్తా కన్నుమూత.. ఇంతకీ ఎవరీమె?

ABN , First Publish Date - 2022-07-10T19:01:09+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) భార్య సాధనా

Mulayam Singh Yadav రెండో భార్య సాధనా గుప్తా కన్నుమూత.. ఇంతకీ ఎవరీమె?

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) భార్య సాధనా గుప్తా (Sadhna Gupta) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఆమె పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ములాయంకు సాధన రెండవ భార్య. 2003లో వీరి వివాహం జరిగింది. అంతకుముందు ఆమె 4 జులై 1986లో ఫరక్కాబాద్‌కు చెందిన కిరాణా వ్యాపారి చంద్ర ప్రకాష్ గుప్తా (Chandra Prakash Gupta)ను పెళ్లాడారు. అయితే, ఆ తర్వాత నాలుగేళ్లకే అంటే 1990లో వీరు విడాకులు తీసుకున్నారు. 


విడాకుల తర్వాత సాధనా గుప్తా.. ములాయంను కలిశారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై తన జీవిత చరిత్ర ‘బద్లావ్ కి లెహర్’ (Badlav Ki Lehar)లో అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) రాసుకొచ్చారు. ములాయం తల్లి మూర్తిదేవి (Murti Devi) తరచూ అనారోగ్యం పాలయ్యేవారు. సాధన ఆమె బాగోగులు చూసుకునే వారు. మూర్తిదేవికి నర్సు ఒకసారి తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడంతో సాధన జోక్యం చేసుకున్నారని, అప్పటి నుంచి సాధనను ములాయం ప్రత్యేకంగా చూసేవారని ఆ పుస్తకంలో అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.


ఆ తర్వాత ములాయం-సాధన వివాహం జరిగింది. ములాయం కంటే సాధన 20 ఏళ్లు చిన్న. ములాయంకు ఇప్పుడు 82 సంవత్సరాలు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్న విషయం 2007లో బయటపడింది. ఎన్నికల అఫిడవిట్‌లో సాధనను తన భార్యగా, ప్రతీక్ యాదవ్‌ ( Prateek Yadav)ను తన కుమారుడిగా పేర్కొన్నారు. అంతేకాదు, 1994లో ప్రతీక్ స్కూలు రికార్డుల్లోనూ ములాయంను తండ్రిగా పేర్కొనడం గమనార్హం. ములాయం సింగ్ యాదవ్ మొదటి భార్య, అఖిలేష్ యాదవ్ తల్లి అయిన మాలతీ యాదవ్ (Malti Yadav) 2003లో మరణించిన తర్వాత సాధనా గుప్తా వెలుగులోకి వచ్చారు.   

Updated Date - 2022-07-10T19:01:09+05:30 IST