లక్ష కోట్ల ఎరువుల రాయితీతో లబ్ధి ఎవరికి?

ABN , First Publish Date - 2022-09-15T10:25:01+05:30 IST

ప్రస్తుత కేంద్ర బడ్జెట్టులో ఎరువుల రాయితీ పద్దు లక్ష కోట్లు దాటింది. కేంద్ర బడ్జెట్టులోని ప్రభుత్వ రాయితీల్లో 50శాతం వాటా కలిగిన ఎరువుల రాయితీతో అటు నేలకూ, ఇటు రైతులకీ...

లక్ష కోట్ల ఎరువుల రాయితీతో లబ్ధి ఎవరికి?

ప్రస్తుత కేంద్ర బడ్జెట్టులో ఎరువుల రాయితీ పద్దు లక్ష కోట్లు దాటింది. కేంద్ర బడ్జెట్టులోని ప్రభుత్వ రాయితీల్లో 50శాతం వాటా కలిగిన ఎరువుల రాయితీతో అటు నేలకూ, ఇటు రైతులకీ ప్రయోజనం పెద్దగా లేదని అధ్యయనాలు చాటుతున్నప్పుడు ఎవరి బాగుకోసం వాటిని అమలు చేస్తున్నారు?


రసాయన ఎరువుల ఉత్పత్తిలోను, వినియోగంలోను మన దేశం ముందు వరుసలో ఉంది. 1960 దశకం నుంచి ఏయేటికాయేడు  ఎరువుల వాడకం, ఎరువుల కోసం కేంద్రం ఖర్చుపెట్టే రాయితీ పెరుగుతూ వస్తోంది. 1960లో అన్ని రకాల ఎరువులు కలిపి 2 లక్షల 90 వేల టన్నులుగా ఉన్న వినియోగం 2021 నాటికి 3 కోట్ల టన్నులకి చేరింది. 1977 నవంబరులో ఎరువుల రాయితీ మొదలు పెట్టినప్పుడు దాని విలువ60 కోట్లు. అది 1979–80లో రూ.526 కోట్లు, 1990–91 నాటికి రూ.4,389కోట్లు, 2008 నాటికి రూ.75,849 కోట్లు, 2019 నాటికి రూ.83,468కోట్లకు చేరింది. అయితే గత రెండేళ్ల కాలంలోనే ఎరువుల రాయితీ భారీగా పెరిగింది. మోదీ సర్కారు 2020లో రూ. 127,921.74 కోట్లు ఖర్చుపెట్టింది. 2021లో ఎరువుల రాయితీలో కోతపెట్టి రూ.79,529.68 కోట్లుగా ప్రకటించినా, తర్వాత కరోనా పరిస్థితులతో తలెత్తిన సంక్షోభ నివారణ కోసం  దాన్ని రూ.1,40,122.32 కోట్లకి పెంచక తప్పలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022లో రూ.1,05,222.32 కోట్ల రాయితీని ప్రకటించింది.


మన దేశంలో ఎరువుల వాడకంపై నియంత్రణ లేకుండా పోయింది. ఏ రైతూ తన భూమిలో ప్రధాన, సూక్ష్మ పోషకాల లోటుకి అనుగుణంగా ఎరువులు వేయడం లేదు. అవగాహన లోపం వలన, చెప్పేవారు లేకపోవడం వలన రైతు సొంత విచక్షణ ప్రకారమే ఎరువులను కుమ్మరిస్తున్నాడు. ఎంత ఎక్కువ వాడితే అంత దిగుబడి వస్తుందన్న ఆలోచన రైతుల్లో నాటుకుపోయింది. కొన్ని ప్రాంతాల్లోని భూముల్లో భాస్వరం, పొటాష్‌ మోతాదుకి మించి ఉన్నా అలాంటి భూముల్లో సైతం రైతులు ఎరువుల్ని వాడుతున్నారు. ఇక యూరియా ధర తక్కువగా ఉందన్న కారణంతో నిర్దేశించిన మోతాదు కంటే 2–3 బస్తాలు అదనంగా చల్లుతున్నారు. ఇలా కర్షకులు పోటీపడి ఎరువులు చిమ్ముతున్న కారణంగా భూములు నిస్సారంగా మారడం తప్ప ప్రయోజనం కలగడం లేదు. రసాయన ఎరువులు అధికంగా వాడటం వల్ల నేల పొరలు మెత్తదనాన్ని కోల్పోయాయి. నేల రాటుదేలడం వల్ల ఎరువులు వేసినా అందులోని పోషకాలు మొక్కలకు అందని దుస్థితి ఏర్పడింది. దాంతో ఆశించిన దిగుబడులు రావడంలేదని అన్నదాతలు మరింత ఎరువుల మోతాదు పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల భూమి ఫలదాయకత తగ్గడంతోపాటు అధిక రసాయన ఎరువుల వినియోగంతో గాలి, నీరు కలుషితమవుతున్నాయి. రైతులకి ఖర్చులు రెట్టింపు అవుతున్నాయి. నిర్జీవమైన నేలల నుంచి పోషకాల్లేని పంటలు పండుతున్నాయి. వాటిని తిన్న ప్రజలు రోగాలపాలవుతున్నారు. ఇంతకుమించి రసాయన ఎరువులతో ఎవరికీ పెద్దగా ఒరిగింది లేదు.


యూరియా మినహా మిగతా ఎరువులపై ప్రభుత్వ నియంత్రణ లేనందువల్ల ఏటికేడు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ముడి సరుకుల ధరలు పెరిగాయంటూ ఎరువుల తయారీ కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత అంతర్జాతీయంగా గ్యాస్‌, బొగ్గు ధరలు విపరీతంగా పెరగటంతో ఈ కంపెనీలు ఎరువుల ధరల్ని 200 శాతం పెంచేశాయి. మిగతా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎరువుల ధరలు ఆయా ప్రభుత్వాల నియంత్రణలో ఉండగా మన వద్ద మాత్రం కంపెనీలకి కొమ్ముకాసే విధానాలు వేళ్లూనుకుని ఉన్నాయి. కంపెనీలు పెంచిన ధరల వల్ల అన్నదాతలు ఆగ్రహం చెందకుండా ప్రభుత్వాలు రాయితీని పెంచుతున్నాయి. ఇలా గత రెండు దశాబ్దాల్లో యూరియా సబ్సిడీని రూ.3వేలకి, డీఏపీ సబ్సిడీని రూ.2,500కి పెంచాయి. రిటైలు అమ్మకాల ఆధారంగా ఎరువుల రాయితీని నేరుగా కంపెనీలకే జమ చేస్తున్నప్పటికీ లోగుట్టు పెద్దలకే ఎరుక. ఎందుకంటే అతిపెద్దదైన మన దేశంలో ఏ కంపెనీ ఎంత మొత్తంలో ఎరువుల ఉత్పత్తి చేస్తోందో, ఎంత అమ్ముతోందో  చూసేది ఎవరు, లెక్కలు కట్టేది ఎవరు? ఇక స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లైనా ఈనాటికీ మనం యూరియాతో సహా ప్రధాన ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించలేకపోయాం. సాంకేతికత, ఐటీపరంగా దేశం ఎంతగా ప్రగతి సాధించినా 90శాతం ఫాస్పేట్‌, నూరు శాతం పొటాష్‌ను దిగుమతి చేసుకోవాల్సిన దుర్గతిలో ఉన్నాం. వేలకోట్ల రూపాయలను విదేశాలకు ధారపోయకుండా ప్రత్యామ్నాయం ఏమిటి, సొంతంగా ఉత్పత్తిని ఎలా పెంచాలి అన్న ప్రణాళికలు మన వద్ద లేవు.


అన్నదాతలకి గిట్టుబాట ధర ఎంత ముఖ్యమో దిగుబడి కూడా అంతే ముఖ్యం. అసలు దిగుబడి లేకుండా రాబడే లేదు. ఫలసాయం రసాయన ఎరువులతో పెరగదు. నిర్జీవమైన నేలల్లో అసలు పంటే రాదు. ఇప్పటికే 3 కోట్లకిపైగా భూములు నిస్సారమై ఉత్పదాక శక్తి భారీగా తగ్గిపోయింది. అధిక రసాయన ఎరువుల వాడకం వల్లనూ, పర్యావరణ కాలుష్యం వల్లనూ నేలలో దిగుబడిని పెంచే సేంద్రియ కర్బనం శాతం తీవ్రంగా పడిపోయింది. నేలకి సంజీవనిలాంటి హ్యూమస్‌, సేంద్రియ పదార్థాన్ని పెంచకుండా దిగుబడులు ఏమాత్రం పెంచలేం. ఈ సత్యాన్ని పాలకులు గర్తించాలి. దేశం రోగగ్రస్తంగా మారడానికి కారణం రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం శ్రుతిమించడమేనని గ్రహించాలి. మట్టిలోని జీవవైవిధ్యం మన ఆరోగ్యాలకి రక్ష అనే విషయం బోధపడితేనే ఈ అశాస్త్రీయ వాడకానికి అడ్డుకట్టపడుతుంది. సేంద్రియ, సహజ, ప్రకృతి సేద్య విధానాలే అందుకు ఆలంబన. 


నేల, మనిషి ఆరోగ్యం, దేశ ఆర్థిక వ్యవస్థ బాగు పడాలంటే రసాయన ఎరువుల వాడకంలో హేతుబద్ధత అవసరం. భూసార ఆధారిత ఎరువుల వాడాకాన్ని కఠినతరం చేస్తేనే సమతుల ఎరువుల పోషణ సాధ్యమవుతుంది. ఒక బస్తా అదనంగా వాడే ఎరువుని ఆదా చేసినా అది దేశానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. తొలి నాళ్లలో 5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల స్థాయి నుంచి నేడు 50 కోట్ల టన్నులు అవలీలగా పండించే శక్తికి ఎదిగిన మన దేశంలో సుస్థిర వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తే ఆహార భద్రతకి అనే ప్రశ్నే రాదు. భారత స్వాతంత్ర్య అమృతోత్సవాలను జరుపుకున్న వేళ పాలకులు వ్యవసాయ రంగానికి, నేలతల్లికి పునరుజ్జీవం కల్పించే విధానాలను పట్టాలెక్కించాలి. రసాయన ఎరువులు వాడని సహజ, సేంద్రియ రైతులకి రాయితీ ప్రయోజనాలు కల్పించాలి. దేశానికి అన్నం పెట్టే రైతులు సైతం తమ వంతుగా ఎరువుల వాడకంలో శాస్త్రీయత పాటించాలి. కృత్రిమ ఎరువులకి బదులు పశువులు, పంట వ్యర్థాల ఎరువులు ఎక్కువగా వాడాలి. అదే అమృత భారతావనికి, అఖండ ధరిత్రికి రైతులోకం సమర్పించే అతిపెద్ద కానుక.

జాగర్లమూడి దుర్గా ప్రసాద్‌

గ్రామ బజార్‌ వ్యవస్థాపకులు

Updated Date - 2022-09-15T10:25:01+05:30 IST