బందరు కుర్చీ ఎవరికో.!

ABN , First Publish Date - 2021-03-04T15:48:02+05:30 IST

బందరు రాజకీయం వేడెక్కుతోంది. మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగియడంతో..

బందరు కుర్చీ ఎవరికో.!

ఉత్కంఠ రేపుతున్న మచిలీపట్నం కార్పొరేషన్‌ ఎన్నికలు

ప్రభుత్వ వైఫల్యాలే అస్ర్తాలుగా టీడీపీ

మేకపోతు గాంభీర్యం చూపుతున్న  వైసీపీ

వార్డుల తగ్గుదలపై ఇంటెలిజెన్స్‌ నివేదిక 

తాయిలాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు

వైసీపీ మేకపోతు గాంభీర్యం

 

మచిలీపట్నం: బందరు రాజకీయం వేడెక్కుతోంది. మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కొన్నివార్డుల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం విస్తృతంగా చేస్తుండటంతో వారి ఓట్లు ఎవరిని విజయం వైపు నడిపిస్తాయి? ఎవరిని ఇంటిదారి పట్టిస్తాయనే అంశంపై చర్చ జరుగుతోంది. 


మచిలీపట్నం కార్పోరేషన్‌ ఎన్నికల్లో 50 డివిజన్లలో 47కుపైగా తామే గెలుచుకుంటామని వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీకి అంతఅనుకూలంగా లేవని  ఇంటిలిజెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నాయకులు ఊహించినన్ని వార్డులు రావని ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నివేదికలతో పట్టణంలో కొన్ని సామాజిక వర్గాల నాయకులను బుజ్జగించడం, అధికారపార్టీ తరుపున పదవుల ఆశచూపి వారిని అధికారపార్టీలో చేర్చుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే వాదన ఉంది. టీడీపీకి చెందిన బలగం విజయశేఖర్‌ను వైసీపీలో చేర్చుకోవడం రాజకీయ ఎత్తుగడల్లో భాగమనే వాదన వినపడుతోంది. వైసీపీలో మేయర్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీ అధినాయకత్వం పెదవివిప్పడం లేదు.  ఈ అంశమే అధికారపార్టీకి  కొంతమేర ప్రతికూలంగా మారుతుందనే వాదన వినపడుతోంది. మేయర్‌ పదవిని కాపు సామాజికవర్గానికా? లేక బీసీలు, మైనార్టీలు, ఆర్యవైశ్యులలో ఒకరికా అనే అంశంపై అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు ద్వితీయశ్రేణి నాయకులు మంత్రి పేర్నినాని వద్ద మేయర్‌ పదవిని తమకు కేటాయించాలని ప్రతిపాదన చేసినా ఆయన మిన్నకుండిపోవడం వెనుక వ్యూహం ఏమిటనేది ప్రశ్నార్థఽకంగా మారింది. జనసేన, టీడీపీ తెరవెనుక ఒప్పందం కుదిరి ఓట్లు పంచుకుంటే వైసీపీకి పెద్ద ప్రమాదమే పొంచి ఉందనే వాదన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  


ఎన్నికల తాయిలాలు సిద్ధం 

ఎన్నికల తేదీ సమీపిస్తుడంతో ప్రధానపార్టీల అభ్యర్థులు నగదు పంపిణీకి వ్యూహ రచన చేస్తున్నారు. కొంరదు అభ్యర్థులు తమకున్న భూములను తనఖాపెట్టి నగదు కూడ బెట్టుకున్నారనే వార్తలు వినపడుతున్నాయి.  అన్ని  డివిజన్‌లలోనూ ఓటుకు కనీసంగా రూ.500లకు తగ్గకుండా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించారు.  ఇతరప్రాంతాల్లో ఉన్న ఓటర్లను రప్పించేందుకు రిజర్వేషన్‌లు చేయిస్తున్నారు.  


గట్టిపోటీ ఇస్తున్న టీడీపీ అభ్యర్థులు  

 అధికారపార్టీకి చెందిన అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకేనని వాదన తొలుత వినపడింది. అయితే టీడీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపొతున్నారు. టీడీపీకి  స్థిరంగా ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే, ఇతరపార్టీలు, ఉద్యోగుల ఓట్లను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉన్నారు. ఇళ్లస్థలాల లబ్ధిదారుల ఎంపికలో  వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, జీ+3గృహాలు లబ్ధిదారులకు రాకుండా చేయడం, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో  ఇప్పటివరకు వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, బంధుప్రీతి చూపడం వంటి అంశాలను ఓటర్లకు వివరిస్తున్నారు. 


Updated Date - 2021-03-04T15:48:02+05:30 IST